ప్రేమలు.. పెళ్లిళ్లు ఎన్నో చూశాం. ‘అబ్బాయి ఏం చేస్తాడు?’ అన్న ప్రశ్నకు సమాధానం లేకపోతే ప్రేమ ఫలించదు. ఏడడుగుల పెళ్లికి ముందడుగుపడదు. చేసే పనిలో సంపాదన లేక, ఆ పనికి గ్యారెంటీ లేక సతమతమవుతున్న పేదింటి అబ్బాయికి ‘నేనే ఏదో ఒక ఉద్యోగం చేసి ఇల్లు నడుపుతాను’ అని భరోసా ఇచ్చింది ఆ ప్రియురాలు. ఎంత అదృష్టం! అన్నట్టే ఆమె ఉద్యోగం చేసింది. ఇంటిని నడిపింది. భర్తను యాక్టర్‌ని చేసింది. పేదింటి జీవితంలో పూసిన ‘రోజా దిద్దిన కాపురం’ ఇది.
ఈ వీడియోలు చేస్తుంటే ఎంతోమంది ఎన్నో మాటలన్నరు. అవన్నీ పట్టించుకోకుండా పని చేసుకున్నం. మాటలుపడి నవ్విస్తున్నం. ఇప్పుడు ఏ మాటలూ లేవు. ఏడికన్నా పోతే.. గుర్తుపట్టి పలుకరిస్తున్నరు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ వల్ల పెద్దగా పైసలు రాకున్నా పదిమందిని నవ్వించిన సంతృప్తి దక్కింది.
– రోజా
పరశురామ్ మేర్గవేని పేదింటి బిడ్డ. ఏడో తరగతిలో ఉన్నప్పటి నుంచే ఊళ్లలో బడి పిలగాళ్లతో కలిసి వీధి నాటికలు వేసేవాడు. బాలకార్మిక వ్యవస్థ, అక్షరాస్యత, మూఢనమ్మకాల నిర్మూలన గురించి అవగాహన కల్పిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రదర్శించే నాటకాల్లో వేషాలు వేసేవాడు. ‘ఓదెలు.. నీ కొడుకు మస్త్ నవ్విపిస్తడు’ అని ఊరి జనం అంటుంటే పరశురామ్ వాళ్ల నాన్న ఎంతో సంతోషపడేది. అప్పటినుంచి పరశురామ్ ఏదో చేయాలని ఆశ, సినిమాలోకి పోవాలనే కోరిక పెంచుకున్నాడు.
పరశురామ్ డిగ్రీ అయిపోయింది. యాక్టర్ కావాలని సొంత ఊరు గంగారం (కరీంనగర్ జిల్లా వీణవంక మండలం) వదిలిపెట్టి, హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో అడుగుపెట్టాడు. ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూనే అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టాడు. నటనంటే ఎంతిష్టమో చదువంటే అంత ఇష్టం. సుల్తానాబాద్ మండలం గర్రపెల్లిలో ఉన్న కాలేజీలో ఎంబీఏలో చేరాడు. కానీ, కాలేజీకి వెళ్లేవాడు కాదు. ‘నీ జతగా నేనుండాలి’ సినిమాలో చిన్న క్యారెక్టర్ వస్తే చేశాడు. అదే మొదటి అవకాశం. ఆ తర్వాత మళ్లీ అవకాశాలేం రాలేదు. ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నా… ఖర్చులకు సరిపోయేవి కాదు. ‘నువ్వు ఏదో ఒకటి సాధించాలి. నేను చూసుకుంటా’ అని అన్న అశోక్ భరోసా ఇచ్చాడు. అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నటించేవాడు. ఆరేడేండ్లు అన్న డబ్బులు పంపించాడు.
ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి వెళ్లినప్పుడు పరశురామ్ ఎవరితోనూ మాట్లాడకపోయేదట. క్లాస్‌మేట్స్‌తో మాట్లాడకుండా.. చదువు, పరీక్షల మీదే శ్రద్ధపెట్టేవాడు. పరీక్షల తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించే ఆలోచించేవాడు. అందరూ పరీక్షలకు ముందు నుంచే చదివేవాళ్లు. తాను డైరెక్ట్‌గా వెళ్లి రాసేవాడు. మంచి మార్కులు వచ్చేవి. ఆ సిన్సియారిటీ రోజా అనే అమ్మాయికి బాగా నచ్చింది. కొన్నాళ్లకు ఆమే పరశురామ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ‘అబ్బో కుదరదు. నా పరిస్థితి వేరు. నా ఫోకస్ అంతా సినిమా. నిన్ను పెళ్లి చేసుకున్నా నేను పోషించే పరిస్థితి లేదు’ అని చెప్పాడు పరశురామ్.
పరశురామ్‌కి సినిమాల్లో అనుకున్నన్ని అవకాశాలు రాకపోయినా.. టీవీ చానెల్స్‌లో అదిరింది, గరం గరం వార్తలు, ఇస్మార్ట్ న్యూస్, యూట్యూబ్ చానెల్స్ కోసం నటించే అవకాశాలు వచ్చాయి. రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ కామెడీ ప్రోగ్రామ్‌లు నాటీ నరేశ్, రింగ్ రియాజ్, బుల్లబ్బాయ్, నెమలి రాజు పాత్రల్లో మెరిశాడు. జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌లో గల్లీ బాయ్స్ టీమ్‌లో చేరి అదరగొట్టాడు. నెమ్మదిగా కెరీర్ గాడిలో పడుతుంది అనుకుంటుండగా కరోనా వచ్చింది. అవకాశాలు తగ్గాయి. కొవిడ్ వరకు మంచిగానే ఉన్న జీవితం మళ్లీ కష్టాలవైపు మళ్లింది.
రోజా ఎంబీఏ అయిపోయింది. తనకు నాన్న లేడు. అన్నీ అమ్మే. వాళ్లమ్మకు ఆరోగ్యం బాగుండేది కాదు. తను మెడికల్ షాప్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని నడిపేది. పెళ్లి సంబంధాలు వస్తే కాదనుకుంది. పరశురామ్ కోసం ఎదురుచూసింది. చివరికి ‘నేనే ఉద్యోగం చేసి నిన్ను చూసుకుంటా. నువ్వు నాతో ఉండటం కావాలి. పెళ్లి తర్వాత నువ్వు సినిమాల కోసం ట్రై చేసుకో’ అన్నది. ఇంటిని తాను నడిపిస్తానని ధైర్యం చెప్పింది. ‘ఒకబ్బాయి చెప్పాల్సిన మాటని అమ్మాయి చెప్పడం నా హృదయాన్ని కరిగించింది. కాదనకుండా పెళ్లి చేసుకున్నాన’ని పరుశురామ్ సంతోషంగా అందరికీ చెప్పుకొన్నాడు.
పెళ్లయిన తర్వాత ఆరు నెలలపాటు హైదరాబాద్‌లో ఉంటూ, ఊరికి వస్తూ పోతూ సినిమా, సంసార జీవితాన్ని నడిపించాడు పరశురామ్. రెండోసారి కొవిడ్ ప్రబలినప్పుడు రోజా ఆరునెలల గర్భవతి. ఉన్న అవకాశాలు కూడా వదులుకుని ఊళ్లోనే ఉంటూ, భార్యను చూసుకున్నాడు. పరశురామ్ కొత్త జీవితంలో ఉన్నా నటించాలనే ఆశ మాత్రం అతణ్ని వదిలిపెట్టలేదు. అప్పుడు పుట్టిన ఆలోచనే సోషల్ మీడియాలో నవ్వించే ప్రయత్నం. ఊళ్లోవాళ్లను కలుపుకొని వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. ఊరి జనం కదా నవ్వులకు కూడా ఊరి విశేషాలే ఎంచుకుని కామెడీ పండించడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఏదైనా జరిగితే ఎలా రియాక్ట్ అవుతుంటామో అవన్నీ గుర్తు చేసుకుని, జనంతో మాట్లాడి తెలుసుకుని వాటినే వీడియోలుగా తీసేవాడు. నాలుగేళ్ల క్రితం Parushuram Mergaveni పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. అప్పటినుంచి అందరికీ నవ్వులు పంచుతున్నాడు. అలా మొదలైన ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూపోయింది. ఆ తర్వాత కాలంలో ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో (m_parushuram_actor)లో తమ ఊరి నవ్వుల్ని ప్రపంచానికి పంచుతున్నాడు.
తన ఊరివాళ్లతో కలిసి పల్లె జీవన సౌందర్యాన్ని, అక్కడి నిష్కల్మషమైన నవ్వులను పరిచయం చేస్తూ వ్యూయర్లకు దగ్గరయ్యాడు పరశురామ్. వానొస్తే.. వానకష్టాలే కాదు చిరుజల్లులాంటి నవ్వులు కూడా ఉంటాయని వాన వీడియోలో చూపించాడు. పల్లెల్లో పండుగలు ఎంత గొప్పగా ఉంటాయో కామెడీగా చూపిస్తుంటాడు. వినాయక చవితికి లడ్డూ దొంగతనాలు, పులిహోర కొట్లాటలు, చందాల దందాలే స్ఫూర్తిగా తీసుకుని రియలిస్టిక్ కామెడీతో సోషల్ మీడియాలో ఆడియన్స్‌ని అలరిస్తున్నారు పరశురామ్ అండ్ కో. ఇలా ఎన్నో ముచ్చట్లు, గతంలో తను చూసిన, విన్న నవ్వులెన్నిటినో గుర్తు చేస్తున్నాడాయన.
భార్యాభర్తల హాస్యానికి ఆడామగ ఉండాలి. అలా జతగా వీడియోలు చేసిన జంటలెన్నో యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. పరశురామ్ కూడా తనతో నటించాలని భార్యను కోరాడు. ‘నీకోసం నేను ఏదైనా చేస్తా బావా’ అని ఒప్పుకొందామె. ఇద్దరూ కలిసి ఎన్నో వీడియోలు చేస్తూ సంసారంలో ఉండే సరదా ముచ్చట్లెన్నో చెబుతున్నారు. ఇక వీళ్ల కామెడీ చూసినవాళ్లు నవ్వుకోవడం ఖాయం. భర్తమీద సెటైర్ వేస్తే ‘మన మగోళ్ల పరువు తీస్తున్నారు. మరీ ఇంత దారుణంగా చేస్తున్నరేంది’ అని కామెంట్ చేస్తుంటారు కొందరు. అదే భార్య మీద భర్త ఎగిరిపడే వీడియోలకు మాత్రం ఆ తరహా కామెంట్లు కనిపించవని చెబుతారు పరశురామ్ దంపతులు. ‘భార్యా బాధితుల కోణంలో నవ్వించాలనే ప్రయత్నం తప్ప ఎవరినీ కించపరచాలని మాకు లేద’ని అంటున్నారు రోజా, పరశురామ్. ప్రస్తుతం ఈ దంపతులు గోదావరిఖనిలో ఉంటున్నారు. అక్కడి జనాలతో కలిసి వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో విహరిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో, సీరియల్స్‌లో చేస్తూనే సోషల్ మీడియాలో తాను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది చేస్తున్నాడు పరశురామ్. రోజా బలంతో, గోదావరిఖని బలగంతో!
– నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరిగౌడ్