అమ్మదనం… గొప్పవరం. సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. స్త్రీ జన్మకు సార్థకత అమ్మదనమే అంటారు పెద్దలు. తన బిడ్డలకు మాతృత్వపు మాధుర్యాన్ని పంచాలని ప్రతి స్త్రీమూర్తీ పరితపిస్తుంది. సంతానం కోసం కోటి దేవుళ్లకు మొక్కుతుంది. అయితే, పూర్వం అరుదుగా తప్ప.. అందరు స్త్రీలూ అమ్మ అనిపించుకున్నవాళ్లు! ఓ పాతికేళ్ల కిందట చూసుకుంటే.. సంతానలేమితో బాధపడే దంపతులు అరుదుగా కనిపించేవాళ్లు. వీరిలో సింహభాగం మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా వంధ్యత్వానికి గురయ్యేవారు. అయితే, సంతానలేమితో బాధపడే దంపతుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. గతంలో అరుదుగా కనిపించిన ఈ సమస్య ఇప్పుడు చాలామందిని కలవరపెడుతున్నది. అసలు ఈ సంతానలేమి సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి? గతంతో పోలిస్తే వంధ్యత్వంతో బాధపడుతున్నవారి సంఖ్య ఎందుకు పెరుగుతున్నది? సంతానలేమి సమస్యలకు గురికాకుండా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు నేటి ఊపిరిలో తెలుసుకుందాం..
ఒకప్పుడు సంవత్సరానికి ఐవీఎఫ్ కేసులు కేవలం 5 శాతం మాత్రమే నమోదయ్యేవి. అది క్రమంగా పెరుగుతూ 10 శాతానికి ఆ తరువాత 15 శాతం దాటింది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. అంటే, ఒకప్పుడు వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతుంటే… ఇప్పుడు 100 మందిలో 18 మంది సంతానలేమితో సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో ఇన్ఫెర్టిలిటీ బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
వంధ్యత్వానికి గల ప్రధాన కారణాలు
ఇవన్ని కూడా జీవనశైలికి సంబంధించిన అంశాలే. ఇవి శరీరంలో కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అంటే మహిళల్లో ఉత్పత్తి జరిగే అండాలు, పురుషుల్లో ఉత్పత్తి జరిగే వీర్యకణాలపై ఇవి ప్రభావం చూపుతాయి. అంటే పురుషుల్లో వీర్యకణాలు తగ్గిపోవడం, మహిళల్లో అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. ఈమధ్య కాలంలో ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఫలితంగా ప్లాస్టిక్‌లోని రసాయనాలు శరీరంలోని జీవకణాలను దెబ్బతీస్తున్నాయి. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ సైతం మహిళల్లో అండాలు ఉత్పత్తి చేసే కణాలు, పురుషుల్లో వీర్య కణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నది. ఇవన్నీ కలగలిసి ఇన్ఫెర్టిలిటీ సమస్య నానాటికీ పెరిగిపోతున్నది.
నివారణ చర్యలు
ఆలస్య వివాహాల వల్ల…
ఈతరంలో చాలామంది యువతులు 30 ఏండ్లు దాటిన తర్వాతే పెండ్లిపీటలు ఎక్కుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, జీవితంలో సెటిల్ కావడం.. ఇవన్నీ అయ్యేసరికి వయసు మూడుపదులు దాటిపోతున్నది. అప్పుడు పెండ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఇలా ఆలస్యంగా వివాహం చేసుకోవడం కూడా సంతానలేమి సమస్యకు దారితీస్తున్నది. స్త్రీలలో సాధారణంగా 30-35 ఏళ్లు దాటితే ఫెర్టిలిటీ సమస్యలు వస్తుంటాయి. అందుకని 30 ఏళ్లు దాటిన వారు సంతానానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మహిళల్లో 40 ఏళ్లు దాటితే మెనోపాజ్ దశ మొదలవుతుంది. అంటే నెలసరి క్రమం క్షీణిస్తుంది. నెలసరి ఆగిపోయిందంటే అండోత్పత్తి నిలిచిపోతుందన్నమాట. వాస్తవానికి స్త్రీలలో 30 ఏండ్లు దాటినప్పటి నుంచి అండాల ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకని సకాలంలో వివాహాలు చేసుకుని 30 ఏండ్లలోపు పిల్లల్ని కంటే అటు తల్లికి, ఇటు బిడ్డకు ఆరోగ్యకరం.
ఎగ్ ప్రిజర్వేషన్తో…
ప్రస్తుతం వైద్యరంగంలో పెను మార్పులు వచ్చాయి. అత్యాధునిక వైద్యపరిజ్ఞానం అందుబాటులో ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా చాలామంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. ఇది తప్పదనుకునే వారు… ముఖ్యంగా మహిళలు యుక్త వయసులోనే అండాలను నిల్వ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. దీనినే వైద్యపరిభాషలో ఎగ్ ప్రిజర్వేషన్ అంటారు. సాధారణంగా 35 ఏండ్లు దాటితే మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే అండాల నాణ్యత కూడా తగ్గిపోతుంది. అందుకని యువతులు 30 ఏండ్ల లోపే తమ అండాలను ప్రిజర్వ్ చేసుకోవాలి. అదే విధంగా వివాహం చేసుకున్న తరువాత కూడా కొంతమంది స్త్రీలు తమ లక్ష్యాలను సాధించే వరకు సంతానం వద్దనుకుంటారు.
అలాంటి వారు కూడా తమ అండాలను ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సంతానం కావాలనుకున్నప్పుడు ప్రిజర్వ్ చేసుకున్న తమ సొంత అండాలతోనే గర్భం దాల్చే అవకాశం అందుబాటులో ఉంది. చాలా మంది సినీతారలు యుక్త వయసులో ఉన్నప్పుడే వారి అండాలను ప్రిజర్వ్ చేసుకుని, ఆ తరువాత పిల్లలకి జన్మనిస్తున్నారు. క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడే స్త్రీలు సైతం తమ అండాలను ప్రిజర్వ్ చేసుకుని వ్యాధి నివారణ తరువాత పిల్లల్ని కనవచ్చు. మొదట్లో ఇలాంటి వారు మాత్రమే అంటే ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడే స్త్రీలు మాత్రమే ఎగ్ లేదా ఎంబ్రియోస్ను ప్రిజర్వ్ చేసుకునేవారు. కానీ, ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు.
పురుషుల్లో ప్రతీ 60 రోజులకు కొత్త ఉత్పత్తి
మహిళల్లో పుట్టినప్పుడు ఉన్న అండాలే మెనోపాజ్ వచ్చే వరకు ఉంటాయి. ఆ తరువాత ఉండవు. అదే పురుషుల్లో అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతీ 60 రోజులకి వీర్యకణాలు కొత్తగా ఉత్పత్తి అవుతాయి. అందుకని మహిళలకు ఎగ్ ప్రిజర్వేషన్ అనేది అవసరం. పురుషులకు సంబంధించి కూడా వీర్యకణాల ప్రిజర్వేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ వారిలో ప్రతి 60 రోజులకు ఒక కొత్త ఉత్పత్తి వస్తున్నందున వారికి ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు.

ఐవీఎఫ్‌లో ఏఐ విట్నెస్ సిస్టమ్
సంవత్సరం క్రితం అందుబాటులోకి వచ్చిన సరికొత్త పరికరం ఏఐ విట్నెస్ సిస్టమ్. ఇది ఐవీఎఫ్ ప్రక్రియలో ఒక విప్లవాత్మకమైన పరిజ్ఞానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘటనలతో సంతానం లేని దంపతుల్లో నెలకొన్న ఆందోళనలు, అనుమానాలకు ఈ సరికొత్త పరికరంతో చెక్ పెట్టవచ్చు. సాధారణంగా ఒక జంట నుంచి వీర్యకణాలు, అండాన్ని సేకరించి వాటి కలయికతో ఎంబ్రియో తయారు చేస్తారు. కొన్ని రోజుల తరువాత ఈ ఎంబ్రియోను గర్భాశయంలోకి మార్పిడి చేస్తారు. ఈ ప్రక్రియలో సేకరించిన అండాలను గాని, వీర్యకణాలను గాని సంబంధిత జంట నుంచి కాకుండా ఇతరులవి తీసుకునే అవకాశం లేకుండా ఉండేందుకు ఏఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది.
గతంలో ఈ రకమైన పరికరం అందుబాటులో లేదు. కేవలం సంబంధిత జంటకు చెందిన డిష్‌పై వారి పేర్లతో రాతపూర్వకమైన లేబుల్ చేసేవారు. అనంతరం ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోకు కూడా అదే లేబుల్ వేసేవారు. ఈ విధంగా ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోను సంబంధిత మహిళ గార్భాశయంలోకి మార్పిడి చేసేవాళ్లు. సుమారు 50 సంవత్సరాలుగా కేవలం విలువలు, నమ్మకంపైననే నడిచిన ఐవీఎఫ్ చికిత్స ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనతో పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఇలాంటి సమయంలో సంతానం లేని జంటలకు నమ్మకం కలిగించడంతో పాటు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకుగాను ఈ ఏఐ విట్నెస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
ఎలా పనిచేస్తుదంటే..
మహిళ నుంచి సేకరించిన ఎగ్ డిష్‌కి ఆ దంపతుల పూర్తి వివరాలతో కూడిన బార్‌కోడ్‌తో ట్యాగింగ్ చేస్తారు. అదే వివరాలతో కూడిన మరో బార్‌కోడ్‌తో ఆమె భర్త నుంచి సేకరించిన వీర్యకణాల డిష్‌కి కూడా ట్యాగింగ్ చేస్తారు. ఈ రెండు డిష్‌లను ‘ఇక్సీ’ విధానంలో ఎంబ్రియో చేయడానికి యంత్రంలో పెట్టినప్పుడు జంటకు సంబంధించిన డిష్‌లు అయితేనే ఆ యంత్రం వాటిని అనుమతిస్తుంది. అలా కాకుండా వేరేవారి అండం లేదా వీర్యకణాలతో ఎంబ్రియో చేసేందుకు యత్నిస్తే ఏఐ విట్నెస్ సిస్టమ్ అందుకు అనుమతించదు. వెంటనే అలారం ఇస్తూ ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఆ జంటకు సంబంధించిన డిష్‌లో ఇతరుల అండం లేదా వీర్యకణాలు ఉన్నట్లు అర్థం. ఈ విధంగా ఐవీఎఫ్‌లో పొరపాట్లు గాని, అక్రమాలు గాని జరగకుండా ఈ యంత్రం ద్వారా అరికట్టవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో మాతృత్వాన్ని వరంగా పొందండి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల.. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు గురవ్వకుండా ఉండొచ్చు.
డాక్టర్ రజిని ప్రియదర్శిని
సీనియర్ అబ్స్టట్రీషియన్ గైనకాలజిస్ట్,
ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ రెని హాస్పిటల్, కరీంనగర్
-మహేశ్వర్‌రావు బండారి