HomeZindagiSamantha Ruth Chitchat With Namasthe Telangana
ఈ క్షణం నాదే!
ఇంట గెలిచిన సమంత.. ఇప్పుడు రచ్చ మీదా సత్తా చాటుతున్నది. తాజాగా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నది. భవిష్యత్ ప్రణాళికలు రచించడం తనకు తెలియదనీ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాననీ మీడియాతో చెబుతున్నది. నటిగా ఎన్నో విజయాలు మూటగట్టుకున్న సమంత రూత్ ప్రభుతో చిట్‌చాట్..
ఇంట గెలిచిన సమంత.. ఇప్పుడు రచ్చ మీదా సత్తా చాటుతున్నది. తాజాగా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నది. భవిష్యత్ ప్రణాళికలు రచించడం తనకు తెలియదనీ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాననీ మీడియాతో చెబుతున్నది. నటిగా ఎన్నో విజయాలు మూటగట్టుకున్న సమంత రూత్ ప్రభుతో చిట్‌చాట్..
నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు, ఆ ధైర్యమూ చేయలేదు. నా దృష్టి చదువు మీదే ఉండేది.
సినిమా పరిశ్రమలోనూ మంచిచెడులు ఉంటాయి. కానీ, రెండిటినీ సమానంగా స్వీకరిస్తా. నటి కావడాన్ని అదృష్టంగా భావిస్తాను. నా వృత్తిని చాలా ప్రేమిస్తాను. షూట్‌కు వెళ్లిన ప్రతిరోజూ నేను ఆనందంగా ఫీలవుతాను. అంతేకాదు, సవాళ్లను స్వీకరించడాన్ని ఇష్టపడతాను.
ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉంటుంది. సినిమా రంగమనే కాదు, ఏ కెరీర్ ఎంచుకున్నా పోరాటంతోనే విజయం సొంతం అవుతుంది. హీరోయిన్ అనేది గ్లామరస్ ఉద్యోగం. కానీ, ఇక్కడా శ్రమిస్తేనే విజయం దక్కుతుంది. కాకపోతే, ఈ రంగంలో ఊహించినదాని కన్నా శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఒక యంత్రంలా పనిచేయాల్సి వస్తుంది. నా దినచర్య ఉదయం 5 గంటలకు మొదలైతే రాత్రి 9 వరకూ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్కోసారి 24 గంటల వ్యవధిలో రెండు మూడు రాష్ర్టాల్లో షూటింగ్స్‌లో పాల్గొన్న సందర్భాలూ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుల అభిమానం ముందు ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి.
‘ఫ్యామిలీ మ్యాన్-2’కు ఓటీటీలో మంచి విజయం దక్కింది. ఇక బాలీవుడ్లో అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా పనితీరును అక్కడివారంతా మెచ్చుకోవడం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. బాలీవుడ్లో కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. అవి నన్ను సగర్వంగా నిల బెడతాయనే నమ్మకం ఉంది.
మొదట్లో సినిమా సంఖ్యను బట్టి సక్సెస్‌ను బేరీజు వేసుకునేదాన్ని. ఇప్పుడు నా అభిప్రాయం మారింది. ఎంత మంచి కథల్లో, ఎలాంటి పాత్రల్లో నటించామన్నది ముఖ్యమని అర్థమైంది. ఇప్పుడు నాకు పాత్ర, కథ నాణ్యతే ప్రధానం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించాలని భావిస్తున్నాను. అందుకు తగ్గట్టే మంచి పాత్రలను ఎంచుకుంటున్నా.
భవిష్యత్తుపై ఆశలు, రేపటి గురించి ప్రణాళికలు.. నాకు నచ్చవు. ఈ క్షణం నాదే అనుకోవాలి. ప్రతి నిమిషం ఆనందంగా గడపాలి. ఏ రోజు ఎలా ఉంటే, దాన్ని అలా స్వీకరిస్తాను. ఇప్పుడు నేను ఉన్న స్థితికి సంతోషంగా ఉన్నాను.
ఒక నటిగా నా ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చూపాల్సిందే. పాత్రకు, ట్రెండ్స్‌కు తగ్గట్టుగా తయారు కావాల్సి ఉంటుంది. సాధారణ సమయాల్లో నా మనోస్థితిని బట్టి డ్రెసింగ్ ఉంటుంది. ఏం మాట్లాడకుండానే, మనసులోని ఆలోచనలను ఎదుటివారు అర్థం చేసుకునేలా నా ఆహార్యం సాయం చేస్తుంది.
ఆత్మవిశ్వాసమే అసలైన అందమని నా భావన. ఎవరూ నూటికి నూరు శాతం కచ్చితంగా ఉండరు. మనలో ఉన్న తప్పులను అంగీకరించి, వాటిని దిద్దుకోగలగడమే నిజమైన అందం.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇష్టం. ఎన్నో మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఫొటోలు, బిట్స్ షేర్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ప్రపంచ
వ్యాప్తంగా ఉన్న అభిమానులతో నేరుగా కనెక్ట్ కావొచ్చు. అయితే, మొదట్లో నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ గురించి చాలా బాధ పడేదాన్ని. కొన్నిసార్లు రాత్రిళ్లు నిద్రపోని సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు అలవాటైపోయింది. పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, నిజమైన అభిమానుల సద్విమర్శలను స్వీకరిస్తాను. వాటికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుంటాను. ఫ్యాన్స్ వల్లే కదా, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నది.