ఉరుకులు పరుగుల పనుల వల్ల మనసు అలసిపోదు. ఆందోళన చెందుతుంది. ఆ ఆందోళన కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. రక్తంలో ఈ హార్మోన్లు పెరిగితే రక్తపోటు పెరిగినట్టే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం సుమారు 1.4 బిలియన్ల మంది పెద్దలు హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. కాబట్టి ఆందోళన చెందకుండా ఉండాలంటే రోజులో చేయాల్సిన పనులను ముందుగా రాసి పెట్టుకోవాలని, వాటిని ప్రాధాన్య క్రమంలో చేయడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ భ్రమరీ ప్రాణాయామం చేస్తూ రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ ప్రాణాయామానికి ముందుగా మోకాళ్లపై కూర్చుని, నడుము, వెన్ను, మెడ ఒకే వరుసలో ఉండేలా నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని ‘హూ……….. ’ అంటూ తేనెటీగలా శబ్దం చేస్తూ గాలిని బయటికి వదలాలి. మొత్తం గాలి బయటికి విడుదలయ్యేంత వరకు హమ్మింగ్ చేసిన తర్వాత మళ్లీ మెల్లగా దీర్ఘ శ్వాస తీసుకుని, ఊపిరితిత్తులు గాలితో నింపుకోవాలి. ఇలా మళ్లీ మళ్లీ అయిదు నిమిషాలపాటు హమ్మింగ్ (భ్రమరీ ప్రాణాయామం) చేస్తే మెడ, ఛాతీ, పొట్టలో వ్యాపించి ఉండే వాగస్ నాడులకు ప్రేరణ కలుగుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి.