సోనిలివ్, ఆహా: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: అసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కె జయన్ తదితరులు.
దర్శకత్వం: జోఫిన్ టి చాకో
OTT | కథలో కొత్తదనం.. కథనంలో విలక్షణాన్ని చూపిస్తూ అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు మలయాళీలు. అందులోనూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ జానర్‌కు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా, రూ.10 కోట్లతో తెరకెక్కిన ‘రేఖా చిత్రం’ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.55 కోట్లను కొల్లగొట్టింది. మలయాళంలో గ్రాండ్ సక్సెస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ‘సోనిలివ్’తోపాటు ‘ఆహా’లోనూ స్ట్రీమింగ్కు వచ్చి.. ఇక్కడా హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. మరి అంతగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో ఏముంది?
విలక్షణమైన కథనంతో నడుస్తుందీ సినిమా. రాజేంద్రన్ (సిద్ధిఖీ) శ్రీమంతుడు. ఒకరోజు ఆయన ఓ అటవీ ప్రాంతానికి వెళ్తాడు. ఒక చెట్టుకింద కూర్చుని.. గతంలో చేసిన ఓ పాపం తనని వెంటాడుతున్నదని ఆవేదన చెందుతాడు. తనతోపాటు తన మిత్రులు కలిసి ఓ 18 ఏళ్ల అమ్మాయిని ఆ చెట్టు కిందే పూడ్చిపెట్టామని చెబుతూ.. ఫేస్బుక్లో లైవ్ వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు.
అదే రోజున ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో వివేక్ గోపీనాథ్ (అసిఫ్ అలీ) చార్జ్ తీసుకుంటాడు. ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన వివేక్.. రాజేంద్రన్ చెప్పిన చోట తవ్వి చూస్తే అక్కడ అస్థిపంజరం దొరుకుతుంది. దానికి ఉన్న కాలు పట్టీల ద్వారా అది ఒక అమ్మాయిదే అనే నిర్ధారణకు వస్తారు. మరి ఎవరా అమ్మాయి? ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఆమెను ఎవరు, ఎందుకు చంపుతారు? ఈ హత్య కేసును వివేక్ ఎలా ఛేదిస్తాడు? అనేది మిగతా కథ. కాన్సెప్ట్ పాతదే అయినా.. కొత్తగా చెప్పాలనే మాటకు ‘రేఖాచిత్రం’ మంచి ఉదాహరణగా నిలుస్తుంది.