మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా ప్రొటీన్ తప్పనిసరి. సాధారణంగా అందరూ రోజుకు ఎంత ప్రొటీన్ తీసుకోవాలి? అనే అంశంపైనే దృష్టి పెడతారు. కానీ, ప్రొటీన్ ఎంత తీసుకున్నామన్న దానికంటే, ఎప్పుడు తిన్నామన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో ప్రొటీన్ తీసుకోకపోతే తగిన ఫలితం దక్కదు. చాలామంది ఉదయం పూట కేవలం కార్బోహైడ్రేట్లు (ఇడ్లీ, దోశ, బ్రెడ్) తిని, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భారీగా ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకుంటారు.
ఇది చాలా పెద్ద తప్పు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో కొవ్వును నిల్వ చేసుకునే స్టోరేజ్ ట్యాంక్ ఉన్నట్టుగా, ప్రొటీన్‌ను నిల్వ చేసుకోవడానికి ఏ ట్యాంకూ ఉండదు. మన శరీరం ఒకేసారి కేవలం 20 నుంచి 40 గ్రాముల ప్రొటీన్‌ను మాత్రమే గ్రహించగలదు. ఉదాహరణకు, మీరు ఒకే పూట 70 గ్రాముల ప్రొటీన్ తింటే, శరీరం తనకి కావాల్సినంత వాడుకుని, మిగిలిన దాన్ని శక్తిగా మార్చి కాల్చేస్తుంది.
దీనివల్ల కండరాల మరమ్మతుకు అందాల్సిన ప్రొటీన్ అందకుండా పోతుంది. మీరు తీసుకునే ప్రతీ పూట భోజనంలో మీ శరీర బరువులోని ప్రతి కిలోకు 0.4 గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. అంటే, 80 కేజీల బరువున్న వ్యక్తి ఒక పూట భోజనంలో సుమారు 32 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకే పూట 160 గ్రాముల ప్రొటీన్ తినే వ్యక్తి కంటే, రోజంతా నాలుగు పూటలా కలిపి 120 గ్రాముల ప్రొటీన్ తీసుకునే వ్యక్తిలో కండరాల పెరుగుదల మెరుగ్గా ఉంటుంది.
అల్పాహారం: మనం నిద్రపోతున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఉదయం పూట కనీసం 30 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఆ విచ్ఛిన్న ప్రక్రియ ఆగి, కండరాల మరమ్మతు మొదలవుతుంది.
వర్కౌట్ తరువాత: వ్యాయామం చేసిన రెండు గంటల లోపు ప్రొటీన్ తీసుకోవాలి. ఈ సమయంలో కండరాలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. జిమ్ నుంచి రాగానే ప్రొటీన్ షేక్ తాగకపోయినా ఫర్వాలేదు! కానీ, రెండు గంటల లోపు మంచి ప్రొటీన్ డైట్ తీసుకోవడం మాత్రం తప్పనిసరి.
నిద్రకు ముందు: మనం నిద్రిస్తున్నప్పుడే శరీరం కండరాలను ఎకువగా రిపేర్ చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు గ్రీక్ యోగర్ట్ లేదా పనీర్ వంటి మెల్లగా జీర్ణమయ్యే ప్రొటీన్ తీసుకుంటే రాత్రంతా శరీరానికి కావాల్సిన ఇంధనం అందుతుంది.