‘ఫ్లయింగ్ యూనికార్న్’ బ్యానర్ కింద చాలా ఓటీటీ సినిమాలు వచ్చాయి. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘పిట్టకథలు’ అందులో ఒకటి. ఆ సంస్థ వ్యవస్థాపకురాలి పేరు అషి దువా. తన సినిమా ప్రయాణం గురించి ఇలా చెబుతున్నది అషి..
నేను ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ కలగనలేదు. కాలేజీ చదువుల కోసం ఢిల్లీలో కాలుపెట్టాకే నాకు ప్రపంచం అంటే ఏమిటో తెలిసింది. ఆ రోజుల్లో జర్నలిజం, చరిత్ర.. రెండూ ఎంతో ఇష్టమైన అంశాలు. రాజధాని నగరంలో ఎందుకో ఉక్కపోతగా అనిపించేది. దీంతో మార్పు కోసం తరచూ ముంబై వెళ్లేదాన్ని. చదువు పూర్తికాగానే ఇంటర్న్‌షిప్ కోసం పర్సెప్ట్ పిక్చర్స్‌లో చేరాను. అక్కడే నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పరిచయం అయ్యారు. ఆ భేటీ నా జీవితాన్ని మార్చేసింది. ఓరోజు ఆయన ‘దేవ్ డి’ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు. ‘ఈ ప్రాజెక్ట్‌లో నువ్వూ ఎందుకు భాగం కాకూడదు?’ అన్నారు. కాదనడానికి కారణం కనిపించలేదు. దీంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాను. భారతీయ సినిమా వందేండ్ల పండుగ సందర్భంగా ‘బాంబే టాకీస్’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. నా సొంత బ్యానర్ కిందే తీశాను. లస్ట్ స్టోరీస్-1, 2, ఘోస్ట్ స్టోరీస్, పిట్టకథలు.. తదితర ఓటీటీ సినిమాలు ఫ్లయింగ్ యూనికార్న్ రూపొందించినవే. అందులోనూ పిట్టకథలు నాకు బాగా నచ్చిన
ఇతివృత్తం. ఇందులో ప్రతి కథా జీవితంలోని సున్నితత్వాన్ని తెలియజెప్పేదే.
పరిశ్రమలో మహిళా దర్శకులకు, టెక్నీషియన్స్‌కు గౌరవం పెరుగుతున్నది. మహిళల చుట్టూ తిరిగే సినిమాలు తీయడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో మా సంస్థ నుంచి మరిన్ని ‘పిట్టకథలు’ రానున్నాయి.