సినిమా విజయాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ‘కాంబినేషన్ సెటప్’ కూడా ఒకటి. మంచి కాంబినేషన్ కుదిరితే చాలు సినిమా సగం విజయం సాధించినట్టే అన్నది ఇండస్ట్రీ మాట. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా ట్రెండ్‌లో ఈ కాంబినేషన్ క్రేజ్ మరింత ఎక్కువైంది. అయితే ఒక్కోసారి అనూహ్యమైన కలయికలు తెరపైకి వచ్చి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇటీవల టాలీవుడ్లో వచ్చిన కొన్ని సినిమా ప్రకటనలు ఆయా ప్రాజెక్ట్‌లపై ఒక్కసారిగా హైప్‌ను తీసుకొచ్చాయి. సెట్స్‌పైకి వెళ్లకముందే టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ కాంబోస్, వాటి వెనకున్న విశేషాలేమిటో తెలుసుకుందాం..
Tollywood | ‘దసరా’ సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నాని కెరీర్లో తొలిసారి వందకోట్లు సాధించిన చిత్రమిది. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో హైదరాబాద్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ప్యారడైజ్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హీరో నాని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం మరో విశేషం.
డిసెంబర్లో ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. ఇక అప్పటినుంచి మెగా అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజున ‘హీ ఫైండ్స్ పీస్ ఇన్ వయొలెన్స్’ అనే పోస్టర్‌తోనే సినిమాలో చిరంజీవి పాత్ర ఎంత ఇంటెన్స్‌తో ఉండబోతున్నదో హింట్ ఇచ్చాడు దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్నదని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రభాస్.. బ్రహ్మ రాక్షస అగ్ర హీరో ప్రభాస్ లైనప్‌లో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి భారీ సినిమాలున్నాయి. వీటితోపాటు ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు.
మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడిక్ ఫిల్మ్ ఇదని సమాచారం. దర్శకుడు ప్రశాంత్‌వర్మ తొలుత ఈ కథను బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్‌కు వినిపించగా ఆయన ఓకే చేశారు. కొంతమేర కథా చర్చలు కూడా జరిగాయి. కానీ అనివార్య కారణాల వల్ల రణవీర్‌సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారని తెలిసింది. ఆ తర్వాత ఈ కథ ప్రభాస్‌ను చేరింది. ఆయన ఈ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నది. రానున్న రెండేళ్లపాటు ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయింది. ‘స్పిరిట్’తో పాటు ‘కల్కి-2’, ‘సలార్-2’ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు పూర్తయిన తర్వాతే ‘బ్రహ్మ రాక్షస’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. అంటే 2027లో ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతను తీసుకోవచ్చని టాక్.
ఇటీవలే ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సెట్లోకి ఎంటరయ్యారు ఎన్టీఆర్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. దీని తర్వాత ‘దేవర-2’ చేయాల్సి ఉంది. తమిళస్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా సన్నాహాల్లో ఉన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. తమిళంలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్‌కు పేరుంది.
దళపతి విజయ్, రజనీకాంత్‌లతో బీస్ట్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్- నెల్సన్ దిలీప్‌కుమార్ మూవీపై దక్షిణాదిలో భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాకు ‘రాక్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పెట్టబోతున్నట్టు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్‌తో ‘జైలర్-2’ తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతారని తెలిసింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో పాన్ వరల్డ్ సినిమా ప్రకటన ఇటీవలే వెలువడింది. హాలీవుడ్ స్థాయి హంగులతో సన్‌పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించనుంది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కథ గురించి అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఓ ఇంటర్నేషనల్ డాన్ చుట్టూ ఈ కథ నడుస్తుందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. భారతీయ మూలాల నేపథ్యంలో సూపర్‌హీరో కథాంశం ఇదని మరికొందరు చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరచిన అనౌన్స్మెంట్ విజయ్ సేతుపతి- పూరి జగన్నాథ్ కాంబో సినిమానే. తమిళంలో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. గత ఏడాది ‘మహారాజ’ చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. పూరి చెప్పిన కాన్సెప్ట్‌లోని కొత్తదనం, తన పాత్రను డిజైన్ చేసిన విధానం నచ్చడంతో విజయ్ సేతుపతి ఈ సినిమాకు వెంటనే అంగీకరించాడని తెలిసింది. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ పవర్ఫుల్ కథ రాశాడని, విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేయబోతున్నాడని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమైంది. దీంతో ఆయన పూర్తిస్థాయి కుటుంబ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తాడని సమాచారం. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాలతో కిషోర్ తిరుమల ఫీల్‌గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన రవితేజ వంటి మాస్ హీరోను డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. రవితేజ కోసం వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సిద్ధం చేశాడని, ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత కిషోర్ తిరుమల చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.
– సినిమా డెస్క్