సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే.. ఒకదాని తర్వాత ఒకటి 3డీ ముఖాలు, క్యారెక్టర్లు కనిపిస్తున్నాయా? పెద్ద తల, చిలిపి కళ్లతో నవ్వుతున్న ఫొటోలు చూడగానే.. కార్టూన్ సినిమా పోస్టర్లా అనిపిస్తున్నాయా? అయితే, మీరు ఇప్పటికే మొదలైన కొత్త ట్రెండ్ జోన్లో ఉన్నారు! ఎందుకంటే.. ఇప్పుడు అందరూ తమ సెల్ఫీలను సినిమా లుక్‌లోకి మార్చుకుంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న మాయాజాలం.. గూగుల్ జెమినీ నానో బనానా ప్రో! ఇది ఫొటోను సాధారణ ఫిల్టర్‌లా మార్చదు.. పూర్తిగా కొత్తదానిలా క్రియేట్ చేస్తుంది. అందుకే ఫొటోలోని ముఖం, భావం, లైటింగ్ అన్నీ రియలిస్టిక్‌గా కనిస్తాయి.
దానికితోడు చిలిపిగా, పిక్సర్ స్టయిల్లో ఆకట్టుకుంటాయి. ఇలాంటివే ఇప్పుడు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌ని ఇప్పటికే పలువురు ఏఐ క్రియేటర్లు ట్రై చేశారు. సింపుల్‌గా.. ‘3డీ క్యారికేచర్ లుక్‌లో, పెద్ద తలతో, చిలిపి ముఖ కవళికలతో ఫొటో కావాలి’ అని ప్రాంప్ట్ చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సిన క్యారెక్టర్ మీ కళ్ల ముందు వాలిపోతుంది. ఇందులో ఆశ్చర్యపడి పోవడానికి ఏం లేదు. జెమినీ మోడల్ తన క్రియేటివ్ జీనియస్ ఎప్రోచ్‌తో ఇదంతా చేస్తున్నది. ఫొటోను ఎక్కడా ఎడిట్ చేయదు.. కొత్తగా ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది.
మాటలతో, ఎమోషన్‌తో, బ్యాక్‌డ్రాప్‌తో అన్నీ మీరు కోరినట్టుగా ఇచ్చేస్తుంది. ఉదాహరణకు.. ‘పారిస్ సన్‌సెట్‌లో నా 3డీ ఫొటో కావాలి’ అని చెబితే.. ఆ సన్నివేశం, ఆ లైటింగ్ అన్నిటినీ ఫొటోలో జొప్పిస్తుంది. ఫొటో డీటెయిల్స్, వెబ్ డేటా అన్నిటినీ కలిపి.. నిజంగా జీవం ఉన్న ఫొటోని సృష్టిస్తుంది. అన్నీ కలిపి నిజంగా మీరే అనిపించేలా, ఫిల్మీ లుక్‌లో మెరిసే క్యారికేచర్‌గా మారిపోతుంది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. యూజర్ తన ఇమేజ్ టోన్‌ని మాటలతోనే కంట్రోల్ చేయొచ్చు. కాన్ఫిడెంట్‌గా స్మైలింగ్/ డ్రామాటిక్ లైటింగ్ లాంటి పదాలు వాడితే.. అదే మూడ్‌కి తగ్గట్టుగా ఏఐ ఫొటోని తయారు చేస్తుంది. అందుకే ఈ ట్రెండ్ ఇప్పుడు యూత్‌లో బాగా పాపులర్ అయింది. వాళ్లకి ఇది ఫన్, క్రియేటివ్ అవుట్లెట్ కూడా. ‘నా ఫొటోను కూడా ఇలా మార్చితే ఎలా ఉంటుంది?’ అని మీకూ అనిపిస్తున్నదా!? అయితే వెంటనే ట్రై చేసేయండి.