చాలామంది బరువు తగ్గడం బాధ్యతగా భావిస్తారు. కానీ, పాటించడం దగ్గరికి వచ్చేసరికి పట్టుదల తక్కువే! సొంతవైద్యం కొంత, యూట్యూబ్ వైద్యం ఇంకొంత పాటిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. కానీ, ఇలాంటి ఉచిత సలహాల్లో నిజానిజాలు తెలుసుకుంటే మంచిది.
అపోహ: పిండి పదార్థాలు తింటే బరువు పెరుగుతారు.
వాస్తవం: చక్కెర, అధిక కొవ్వు ఉండే కార్బొహైడ్రేట్స్కు, పిండిపదార్థాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలకు తేడా తెలియాలి. పిండిపదార్థాలు సమృద్ధిగా ఉండే కూరగాయలు బరువును నియంత్రించడంలో సాయపడతాయి.
అపోహ: తీవ్ర కసరత్తులు చేయాలి.
వాస్తవం: గంటల తరబడి వర్కవుట్లు చేస్తే బరువు తగ్గుతాం అనుకుంటే పొరపాటే! నిపుణుల సలహా మేరకు కసరత్తులు చేయాలి. అర్ధగంట నుంచి గంటపాటు సరైన వ్యాయామం చేస్తే సరిపోతుంది.
అపోహ: తిండి మానేయాలి.
వాస్తవం: రెండుపూటలా అన్నం మానేసి కఠిన ఉపవాసం పాటించడం డైటింగ్ అనిపించుకోదు. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను మితంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.