ఈ స్మార్ట్ యుగంలో.. చాలామందికి ఫోనే గడియారంలా మారిపోయింది. మొబైల్ నోటిఫికేషనే.. అలారం అయిపోయింది. ఉదయం లేవగానే ఫోన్లో తల పెట్టేయడం.. బెడ్‌పై ఉండే సోషల్ మీడియాలో వాలిపోవడం కామన్‌గా కనిపిస్తున్నది. అయితే.. ఇలా, నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌తో గడపడం చాలా ప్రమాదకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అలవాటు అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.
యువతే కాదు.. పిల్లలు, పెద్దలు కూడా మొబైల్‌కు వ్యసనపరులుగా మారిపోయారు. ఉదయం లేవడమే స్మార్ట్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూసుకోవడం, మెయిల్స్ చెక్ చేసుకోవడం, వీడియోలు చూడటం.. ఇలా కనీసం గంటకుపైగా మొబైల్లో గడిపేస్తున్నారని ఇటీవలి కొన్ని సర్వేల్లో తేలింది. దాదాపు 61 శాతం మంది పడుకునే ముందు, నిద్ర లేవడంతో కూడా ఫోన్లోనే గడిపేస్తున్నారు. నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు కళ్లు సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో మొబైల్ స్క్రీన్ చూడటం ద్వారా కనుగుడ్లపై ఒత్తిడి పడుతుందని నిపుణుల మాట.
ఉదయం లేవగానే ఫోన్‌ను చూడటం వల్ల స్క్రీన్ నుంచి వెలువడే బ్లూలైట్.. కళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది అలవాటుగా మారితే.. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి లాంటి సమస్యలూ వస్తాయని చెబుతున్నారు. ఏకాగ్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. ఈ అలవాటు దీర్ఘకాలంలో.. అధిక రక్తపోటు, ఒత్తిడిలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్ చూసినా.. నిద్ర సరిగ్గా పట్టదు. అందుకే.. నిద్రపోవడానికి ఓ గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయాలనీ, నిద్ర లేచిన గంట తర్వాతే చేతిలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.