మనిషి మస్త్ జోర్ మీద ఉన్నడంటే మనసు దిల్కా ధడ్కన్ దగ్గరుందనే! ఆడైనా మగైనా ప్రేమైతే చాలు పారే ప్రవాహంలా మారిపోతారు. అప్పుడే మూత తీసిన బీర్ సీసాలా పొంగిపోతుంటారు. పంచ్‌ల పలక్నామాకే పంచ్‌లు వేసే లెవెల్లో ఉంటారు. ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ ప్రేమికులు! అంతేనా… చెంపలు కెంపులు కావడాలూ, గుండె గొంతులో కొట్టుకోవడాలూ, కళ్లు లైట్లలా వెలగడాలూ… అసలు బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే డైమండ్ ఫేషియల్ చేసినంత గ్లోతో వెలిగిపోతుంటారు వీళ్లు. ధైర్యంలోనూ మనల్నెవడ్రా ఆపేది… అన్నట్టుగా ఉంటుంది ప్రేమికుల పద్ధతి. వీళ్లు ఇంతలా తుళ్లి పడుతున్నారంటే అసలేముందీ ప్రేమలో అని చాలామంది గుండె మీద చెయ్యేసుకుని, సారీ గుండు మీద చెయ్యేసుకుని ఆలోచించారు. శాస్త్రవేత్తలైతే అధ్యయనాలూ చేశారు… కాస్తో కూస్తో ప్రేమ గుట్టు రట్టు చేశారు. అదే లవ్ ఎనర్జీ ..!
Valentines Day | గాయం మాయం ప్రేమ మనసుకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా అని అడిగితే చెప్పడం కాస్త కష్టమే. అయితే మనిషి ప్రయాణంలో ఈ రెండిటికీ గాయాలయ్యే అవకాశం ఉంది. కాలికి ఏ దెబ్బో తగిలితే బయటికి కనిపిస్తుంది. మనసును కలచివేసే సంఘటన ఎద లోపల వ్రణాన్ని మిగులుస్తుంది. ఈ రెండు రకాల గాయాలనూ త్వరిత గతిన మాన్పే శక్తి ప్రేమకు ఉంది. లవ్ ఎనర్జీ అన్నది మందుకు ఏ మాత్రం తీసిపోదు. మనసైన వారి సాంగత్యం, ప్రేమపూర్వక స్పర్శ దేహ ప్రాణాలు రెండిటికీ సాంత్వన చేకూరుస్తాయి. అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో బొబ్బలు, కోసుకున్న గాయాల్లాంటివి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండే జంటల్లో తొందరగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. దీనికి పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది సంబంధం లేదనీ కేవలం జంట మధ్య ఉన్న అన్యోన్యతే ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నదనీ తెలిపింది. బంధాలను బలపరిచే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే హార్మోన్లు గాయాలను మాన్పడంలో కీలకంగా పనిచేస్తున్నాయట. ప్రేమలో ఉన్నవారిలో నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లూ అధిక మోతాదులోనే ఉంటాయట. మనసుకు తగిలిన గాయాలకు ప్రేమను మించిన మందులేదని లెక్కకు మిక్కిలి సందర్భాల్లో రుజువైంది. తగిలిన గాయాలే మాయమవుతుంటే కొత్త గాయాల ముచ్చటెక్కడిది. జంటగా ఉంటే ఏనుగంత బలం మరి!
టింగ్… ప్రియమైన వాళ్ల మెసేజ్. ఆ సంగతి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదివిన వెంటనే కందిన బుగ్గలే బయట పెట్టేస్తాయి. ఇక, తను పక్కనుంటే ముఖానికి అదనపు మేకప్ ఏమీ అక్కర్లేదు. అందరూ గులాబీ రంగు బ్లష్‌ని ఏరికోరి రాసుకుంటే, ప్రేమపక్షుల్లో అది సహజంగానే అందాన్ని తెస్తుంది. ఏమిటీ ఈ రహస్యం అంటే, ప్రియమైన వాళ్లని చూడగానే మెదడు ఆనంద పారవశ్యానికి, ఒక రకమైన మొహమాటానికి గురవుతుంది. దీని వెనుక మతలబును కూడా కనిపెట్టేసింది సైన్స్. ఇష్టమైన వాళ్లని చూడగానే మెదడు నోరెపినెఫ్రన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలకు నోరెపినెఫ్రన్ సాయపడుతుంది. అది ఎగ్జయిట్‌మెంట్‌కు కారణం అవుతుంది. దీంతో ముఖంలోని నాడులు విచ్చుకుని ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ అధికం అవుతుంది. దీంతో చెంపలు కెంపుల్లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక రిలేషన్షిప్ తొలినాళ్లలో ఈ తరహా మార్పులు ఎక్కువగా కనిపిస్తాయట. లవర్స్ బ్యూటీ సీక్రెట్ ఇదన్నమాట!
‘బటర్‌ఫ్లైస్ ఇన్ ద స్టమక్’ అనే పదబంధం చాలామంది వినే ఉంటారు. కడుపులో ఏదో వింతైన భావన కలగడం అన్నది దీని అర్థం. ప్రియమైన వాళ్ల సాంగత్యంలో ఈ అనుభూతిని పొందని వారుండరంటే అది అతిశయోక్తి కాదు. మానసికంగానే కాదు భౌతిక ఆకర్షణ కలిగి ఉన్న వ్యక్తుల మధ్య ఆడామగా అన్న తేడా లేకుండా ఈ భావన కలుగుతుంది. కేవలం దగ్గరగా ఉండటమే కాదు, వాళ్ల ఆలోచనలూ ఈ వింతైన అనుభూతికి కారణం అవుతాయి. ఇష్టమైన వాళ్ల ఊహ రాగానే శరీరంలో డోపమైన్, అడ్రినలిన్లు విడుదల అవుతాయి. డోపమైన్ ఒక ఫీల్‌గుడ్ హార్మోన్. అడ్రినలిన్ కాస్త ఒత్తిడిని కూడా తెచ్చిపెడుతుంది. ఈ రెండూ ఒకేసారి ఉండటం వల్ల కడుపులో ఒకరకమైన కంగారుతోపాటు సంతోషంగానూ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే వ్యవస్థ వేగస్ నర్వ్‌కు అనుసంధానమై ఉంటుంది. అదే గుండె, పొట్ట భాగాలకు కనెక్టయి ఉంటుంది. ఇష్టమైన వారిని చూసినప్పుడు ఈ నాడి ఉత్తేజితం అవడంతో గుండె వేగం పెరగడం, కడుపులో అదోలా ఉండటం లాంటివి జరుగుతాయట. కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు… ఏ రాగం.. ఇది ఏ తాళం… అని కవులు రాసేదీ దీని సంగతే!
వావ్… హ్యాండ్సమ్! హాయ్… బ్యూటిఫుల్! ప్రేమికుల పలకరింతలు ఇలాగే ఉంటాయి. ఆమెకు అతనే నవ మన్మథుడు. అతనికి ఆమే రతీదేవి. తా వలచింది రంభ, తా మునిగింది గంగ… అంటూ ఎవరన్నా వెక్కిరించినా, నా కళ్లతో చూడు అంటారే తప్ప వెనక్కి తగ్గరు. ఎందుకంటే వాళ్ల ప్రపంచం వేరు. అందులోని వర్ణాలు వేరు. అక్కడి అందానికి నిర్వచనమూ వేరే! అక్కడ మనకు కనిపించే శరీరంతోపాటు వాళ్లు పంచుకున్న అనుభూతులు, వ్యక్తిత్వం, అవతలి వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు కలిగే సౌకర్యం లాంటి వాటితో కలగలిసిన అమితమైన ప్రేమ ఆ అందానికి రంగులు జోడిస్తుంది. మనకిష్టమైన వాళ్లతో ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంచి, బంధాలను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, కౌగిలించుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు ఉత్పత్తయ్యే ఇది ఊబకాయం సమస్యనూ దూరం చేస్తుందట. ఇక, ప్రేమికుల్లో విడుదలయ్యే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ కూడా తమ జోడును ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. అది బాబూ సంగతీ… ప్రేమంటే ఉత్తి ఫిజిక్స్ కాదు… అందులో ఇంత కెమిస్ట్రీ ఉంది!
కేరింతలూ తుళ్లింతలూ యువత లక్షణాలు. ముఖ్యంగా ప్రేమికుల ప్రధాన ఆనవాళ్లు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అయినా పరీక్ష చక్కగా పాసైపోతారు. చదివిన కాసేపూ బుర్ర చురుగ్గా ఉంటుంది మరి! అసలు ఉత్సాహమంతా ఒక్క దగ్గరే పోగై ఉందా అనిపిస్తుంది అసలైన ప్రేమజంటను చూస్తుంటే. దీనికి కారణం లవ్ ఎనర్జీనే. ఇది హై ఫ్రీక్వెన్సీ కలిగిన శక్తి. దీన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఎంచక్కా పెంపొందించుకోనూవచ్చు. నాకంటూ ఒక తోడు, నన్నే నమ్మే ఒక జోడు ఉందన్న భావన మనిషిలో సంతృప్తినీ ధైర్యాన్నీ పెంచుతుంది. హాయిగా నవ్వడానికి ఈ ఒక్కటీ చాలు కదూ! ఇక, ప్రేమ జంట మధ్య గాఢమైన అనుబంధం ఉంటుంది. అమితమైన ఆకర్షణా కనిపిస్తుంది. ఇవే శరీరం పనితీరును చక్కగా చేసే, మనసుకు హాయినిచ్చే ఆక్సిటోసిన్, డోపమైన్, నోరెపినెఫ్రన్లాంటి వివిధ హార్మోన్ల విడుదలకు కారణం అవుతాయి. ఇవన్నీ పుష్కలంగా ఉంటే మనిషి ఫుల్ జోష్ మీద ఉండటం అన్నది అసలు వింతే కాదు. ఎందుకంటే అసలైన వింత ప్రేమ కాబట్టి. అవునంటారా… కాదంటారా?!