చాలామంది మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు వంటగదిలోనే ఉంటూ తీరొక్క తిండి పదార్థాలను వండిపెడుతుంటారు. రకరకాల వంటకాలు చేసే ఈ ప్రదేశం ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం. మీ చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. ముఖ్యంగా.. గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులను అజాగ్రత్తగా వదిలేస్తే.. అవి క్షణాల్లో మంటలు వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. చాలామంది వంట చేసేటప్పుడు కాగితాలు, బిల్లులు, పుస్తకాలను స్టవ్ దగ్గర ఉంచుతారు. కానీ, అవి చాలా ప్రమాదకరం. కూరగాయల కవర్లు, చేతివస్త్రం అన్నీ గ్యాస్‌కు అతి సమీపంలో ఉంటుంటాయి. గాలికి.. మంట వాటికి అంటుకుంటే క్షణాల్లో గదంతా వ్యాపిస్తాయి. చాలామంది పొయ్యి వెలిగించిన తర్వాత లైటర్లు లేదా అగ్గిపెట్టెలను స్టవ్ మీద వదిలేస్తారు.
కానీ, ఈ వస్తువులు అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మరింత జాగ్రత్త అవసరం. ఇక ఈ రోజుల్లో వంట పనిచేస్తూ ఫోన్ మాట్లాడేవాళ్లే అధికం. పైగా ఫోన్ చార్జింగ్‌లో పెట్టి మరీ.. కాల్ కంటిన్యూ చేస్తుంటారు. అయితే వంటపనిలో ఉన్నప్పుడు ఫోన్‌ని దూరం పెట్టడం చాలా అవసరం. అంతేకాదు, వంటగదిలో విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉన్నా, ఓవెన్ నుంచి శబ్దాలు వస్తున్నా.. వెంటనే మరమ్మతు చేయించడం మంచిది. అలాగే వంట చేసేటప్పుడు ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పట్టు, జార్జెట్, షిఫాన్ వస్ర్తాలు అగ్ని ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. కాటన్ దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే జుట్టును వదిలేయకుండా ముడివేసుకోవడం ముప్పు నివారణలో ముఖ్యాంశం. చివరిగా గ్యాస్‌స్టవ్ చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. ఇంట్లో ఒక చిన్న అగ్నిమాపక యంత్రం ఉండటం మంచిది.