సాంకేతిక ప్రపంచంలో సౌలభ్యాలు ఎన్నో… సమస్యలూ అన్నే ఉంటున్నాయి. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. పాజిటివిటీ పత్తా లేకుండా పోయింది. నెగెటివిటీ ప్రతి మనిషిలో వేళ్లూనుకుంటున్నది. ఈ నెగెటివిటీ ఎంతలా పెరిగిందంటే.. సమయం దొరికితే చాలు వేలు రీల్స్‌ను స్క్రోల్ చేసేస్తున్నది. కండ్లు ఆ స్క్రీన్కు అతుక్కుపోతున్నాయి. విలువైన సాహిత్యం, సంగీతానికి సంబంధించిన రీల్ ఒక్కటుంటే ఒట్టు. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న అర్థం పర్థం లేని రీల్స్ చూస్తూ గంటలు నిమిషాల్లా గడిపేస్తున్నారు. ఇవి మన ఉత్సాహాన్నీ, మనశ్శాంతినీ దూరం చేస్తున్నాయని ఎప్పుడైనా గమనించారా? ఎక్కడో రోడ్డు ప్రమాదం, మరెక్కడో చిన్నపిల్లాడిని కుక్క తరుముతున్న వీడియో, వీటికితోడు స్ఫూఫ్ వీడియోలు, వల్గర్ కంటెంట్.. ప్రతి నాలుగు రీల్స్/ షార్ట్స్‌లో మూడు ఇవే ఉంటున్నాయి. ఇవి చూస్తూ ఉంటే కాలంతోపాటు మన మనశ్శాంతి కూడా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రీల్స్ చూసే అలవాటు పెద్ద పొరపాటుగా మారకూడదంటే.. ‘ఇగ్నోర్’ మంత్రం పఠించాలని సూచిస్తున్నారు.
మనసుకు నచ్చని వ్యక్తిని మనమేం చేస్తాం.. ఇగ్నోర్ చేస్తాం! నెట్టింట కూడా ఇదే సూత్రం పాటించాలి. అందులో కనిపించిన ప్రతి అంశాన్నీ బుర్రలో వేయొద్దు. నెగెటివ్ క్రిటిసిజం, గాసిప్, ట్రోలింగ్, అనవసర పోలికలు… ఇలాంటివన్నీ మంచి చేయకపోగా అనవసరంగా మనసుని పాడు చేస్తాయి. అలాంటివి కనిపిస్తే వెంటనే మార్చేయండి. అంతేకానీ మీరూ నచ్చిన హీరోయిన్, హీరో, క్రీడాకారులకి సపోర్టు చేయాలి, మద్దతు పలకాలంటూ వాదనలోకి దిగొద్దు. కామెంట్ల ఎదురు దాడితో సమయం వృథా చేసుకోవద్దు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకోవట్లేదు, ముఖ్యమైన దాన్ని వదిలేస్తున్నామన్న కంగారే వద్దు. నిజంగా తెలుసుకోవాలనిపిస్తే వార్తాపత్రికలు, పుస్తకాలు వంటివి ఉండనే ఉన్నాయి. వాటిని ఆశ్రయించండి… సమాచారం తెలుస్తుంది. మంచీ చెడుల తేడా స్వయంగా మీరే అంచనా వేయగలుగుతారు, సొంత అభిప్రాయం ఏర్పరచుకోగలుగుతారు. అంటే, మీ పైన ఎవరి అభిప్రాయమూ పనిచేయదన్న మాట. అందుకే మనసు, మెదడు ఆరోగ్యం బాగుండాలి, మీ శక్తి అనవసర అంశాలమీద ఖర్చు అవొద్దంటే ఈ ఇగ్నోర్ సూత్రాన్ని పాటించేయండి మరి.