మనకు జుంబా డాన్స్ తెలుసు. ఫిట్నెస్ కోసం చాలామంది నేర్చుకుంటారు కూడా. దానికి కొనసాగింపే జుంబినీ (జుంబా ప్లస్ మినీ). బెంగళూరుకు చెందిన అపర్ణ ముదియనూర్ క్యాలిఫోర్నియాకు వెళ్లి మరీ ఇందులో సర్టిఫికెట్ కోర్సు చేసి వచ్చింది. ఇది ప్రాథమికంగా పిల్లలకు ఉద్దేశించిన ప్రోగ్రామ్. తల్లులు కూడా పాల్గొంటారు.
ఇక్కడ జుంబా డాన్స్ను పోలిన నృత్యానికి సంగీతం జోడిస్తారు. ఆటపాటలకు అనుసంధానిస్తారు. ఏడాది నుంచి నాలుగేండ్ల పిల్లల వరకూ ఒక బృందంగా, ఐదు నుంచి పద్నాలుగేండ్ల పిల్లల వరకూ ఒక బృందంగా శిక్షణ ఇస్తారు. దీనివల ్ల పిల్లల సామాజిక నైపుణ్యం మెరుగుపడుతుందని చెబుతారు. పిల్లల్ని స్వేచ్ఛగా పాడనిస్తారు, ఆడనిస్తారు. దీంతో బెరుకుపోతుంది. పజిల్స్ ఇచ్చి పరిష్కరించమంటారు. కొత్తగా ఆలోచించడం అలవాటు చేస్తారు. దీనివల్ల సృజన పదునెక్కుతుంది. అన్నిటికీ మించి తల్లీపిల్లల మధ్య అనుబంధం బలపడుతుంది. అంతేకాదు, భాష మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు కూడా. జుంబినీ ప్రత్యేకతలను వివరించే వీడియోలు ఆన్లైన్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. ‘అమెరికాలో మొదలైన ట్రెండ్ ఇప్పుడు మనదేశంలోనూ విస్తరిస్తున్నది’ అంటారు అపర్ణ.