ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతే భారతదేశానికి బలమంటాడు వివేకానందుడు. వయసు ఉడిగిపోయినా, కండలు కరిగిపోయినా చెక్కు చెదరని సంకల్పం ఉన్నవాళ్లూ సమాజానికి నిర్దేశం చేయగలరని నిరూపించారు దయాబాయి. జనం సమస్యల పరిష్కారం కోసం 82 ఏండ్ల వయసులో 17 రోజులపాటు ఆమె చేసిన నిరాహార దీక్ష ప్రపంచాన్ని ఆకర్షించింది.
దయాబాయి… కేరళలో పుట్టినా మధ్యప్రదేశ్లో స్థిరపడ్డారు. బాల్యం నుంచీ అడవిబిడ్డల సమస్యలపై పోరాటాలు జరిపారు. పాఠశాలల కోసం ధర్నాలు చేశారు. నర్మదా బచావో ఆందోళన్లోనూ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, హర్యానా తదితర రాష్ర్టాల్లో ఎన్నో ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ఆ ఉద్యమ ఆకాంక్ష నేటికీ ఆమెలో చెక్కు చెదరలేదు. ఒక సమస్య తీరాక మరొకటి, అది పూర్తయ్యాక ఇంకొకటి… అలా ఆరు దశాబ్దాలకు పైగా అణగారిన వర్గాల కోసం అలు పెరుగని పోరాటం సాగుతూనే ఉంది. ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర సచివాలయం ఎదుట ఆమె నిరాహార దీక్షకు దిగారు. కాసర్గోడ్ పట్టణంలోని ఎండోసల్ఫాన్ బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలకోసం.. ఎనభై రెండేండ్ల వయసులో.. గాంధీ జయంతి రోజు నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి బాధితులకు తగిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చాకే.. పదిహేడు రోజుల తర్వాత తన పోరాటాన్ని ముగించారు. మధ్యలో ఆసుపత్రి పాలైనా ప్రాణాలకు తెగించారే కానీ, పట్టువీడలేదు. కాసర్గోడ్ మున్సిపాలిటీకి చెందిన 20 గ్రామ పంచాయతీల పరిధిలో 1975 నుంచి 2000 మధ్యకాలంలో అక్కడి చెట్లకు ప్రభుత్వం ఎండోసల్ఫాన్ స్ప్రే చేసింది. ఆ విష ప్రభావం కారణంగా స్థానికంగా వేయిమందికిపైగా చనిపోయారు. ఆరువేల మంది రోగాల బారినపడ్డారు. వేలమంది చిన్నారులు అవక
రాలతో పుట్టారు. వారికోసం చేపట్టిన ఈ దీక్షలో ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోకపోతే మళ్లీ దీక్షకు వెనకాడనని తేల్చి చెప్పారు దయాబాయి.
ఈమె జీవిత కథ సినిమా గానూ వచ్చింది. మడమతిప్పని ఆ ఉద్యమకారిణిని మించిన కథానాయికా, ఆమె జీవిత గమనాన్ని మించిన స్ఫూర్తిదాయక గాథా ఉంటాయా? తన అసలు పేరు ‘మెర్సీ మ్యాథ్యూ’ను జనం భాషలోకి మార్చుకుని దయా బాయిగా మారిందా దయామూర్తి.