ఒత్తిడిని తగ్గించుకోడానికి కొందరు ‘స్ట్రెస్ బాల్స్’ను ఆశ్రయిస్తారు. పసుపు రంగులో ఉండే ఈ మెత్తని బంతులను చేతితో నొక్కుతూ కనిపిస్తారు. అయితే, ‘ఈ స్ట్రెస్ బాల్స్ నిజంగా పనిచేస్తాయా?’ అంటే.. ఇవి రెండు రకాలుగా ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించడంతోపాటు వ్యాయామంలోనూ ముందుంటాయని అంటున్నారు. వాటిని ఉపయోగించే విధానాన్ని వివరిస్తున్నారు.
ఆందోళనలో ఉన్నప్పుడు మన మెదడు మొత్తం అనవసరమైన ఆలోచనలతో నిండిపోతుంది. అలాంటి సమయంలో స్ట్రెస్ బాల్‌ను నొక్కడం వల్ల.. మన దృష్టి ఆలోచనల నుంచి శారీరక స్పర్శ వైపు మళ్లుతుంది. ఇది ఒక రకమైన ‘గ్రౌండింగ్ టెక్నిక్’లా పనిచేస్తుంది. ఇక స్ట్రెస్ బాల్‌ను గట్టిగా నొక్కినప్పుడు.. చేతితోపాటు , ముంజేతిలోని కండరాలు బిగుసుకుంటాయి. వదిలినప్పుడు ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని ఉద్రిక్తత తగ్గుతుంది. మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. అలా, ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
చాలామంది స్ట్రెస్ బాల్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం లేదు. దాంతో, దీన్నో నిరుపయోగమైన వస్తువుగా భావిస్తుంటారు. కేవలం బంతిని నొక్కడమే కాకుండా.. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.