మహిళల్లో గుండెపోటు భిన్నంగా కనిపిస్తుంది. వారిలో అలసట, ఆయాసం, వీపు పైభాగంలో నొప్పి, వికారం, గుండెదడ వంటి లక్షణాలతో ఉంటుంది. అయితే, చాలామంది ఈ లక్షణాలను గుండెపోటుగా భావించడం లేదట. వేరే సమస్యలుగా పొరబడుతున్నారట. దాంతో, మహిళల్లో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. మహిళల్లో హృద్రోగ సమస్యలపై చేపట్టిన ఈ అధ్యయనం.. అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టింది.
ఈ అధ్యయనం కోసం అమెరికా మిన్నెసోటాలోని ఓల్మెస్ట్డ్ కౌంటీలో గుండెపోటుకు గురైన 1,474 మంది హెల్త్ డేటాను పరిశీలించారు. వీరంతా 65 ఏళ్లలోపు వయసు గలవారే. ఆడవాళ్లలో గుండెపోటు రావడానికి అత్యంత స్పష్టమైన కారణం.. స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్.
ఇది కరోనరీ ధమని గోడలో ఏర్పడే ఒక చీలిక. దీనివల్ల రక్తనాళంలోని పొరల మధ్య రక్తం చిక్కుకుపోయి, గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆగిపోతుంది. అది గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి, ఈ సమస్యను గుర్తిస్తే.. మహిళల్లో గుండెపోటు మరణాలు సంభవించకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు.