తెలంగాణోళ్లకు తెలంగాణోళ్లకు కేసీఆరే పెద్ద హీరో!
ద్దరు అన్నయ్యలు, అయిదుగురు అక్కల పెద్ద కుటుంబంలో చిన్నదాన్ని నేను. నాన్న మల్లావజ్జల సదాశివుడు టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి అన్నల్లో చేరిండు. తన కోసం వచ్చిన పోలీసులు పెద్దన్నని పట్టుకుపోయేది. పోలీసుల వేధింపులు, బెదింరిపులు భరించలేక అన్నకూడా నాన్న దారిలోనే నడిచిండు.
వెతలు ఆమెకు ఉగ్గుపాల కథలు..
బాల్యమంతా పోరాట గాథలు..
గానం తన ప్రయాణానికి మొదలు..
వ్యాఖ్యానాలు బతుకు
బాటలో సోపానాలు..
కవిత్వం, సాహిత్యం తండ్రి స్మృతులు..
తృప్తి కోసం పోరు పాటలు..
భృతి కోసం సినిమా పాటలు..
వృత్తి ఏదైనా అభ్యుదయం,
ఆధ్యాత్మికమే వ్యాపకాలు!
నాన్న తన పాఠశాల!
అభ్యుదయం, ఆధ్యాత్మికం
ఆ బడిలో పాఠ్యాంశాలు!
వాటిని జీవితానికి ఎలా
అన్వయించుకున్నదో చెబుతున్నది
కృష్ణవేణి మల్లావజ్జల. ఇది తన తండ్రి
మల్లావజ్జల సదాశివుడి స్మరణ!ఇ
ద్దరు అన్నయ్యలు, అయిదుగురు అక్కల పెద్ద కుటుంబంలో చిన్నదాన్ని నేను. నాన్న మల్లావజ్జల సదాశివుడు టీచర్ ఉద్యోగం వదిలిపెట్టి అన్నల్లో చేరిండు. తన కోసం వచ్చిన పోలీసులు పెద్దన్నని పట్టుకుపోయేది. పోలీసుల వేధింపులు, బెదింరిపులు భరించలేక అన్నకూడా నాన్న దారిలోనే నడిచిండు. అప్పటి నుంచి చిన్నన్నయ్యను పట్టుకుపోయేది. నాన్న ఓపాలి పోలీసులకు దొరికిండు. కొట్టి, చిత్రహింసలు పెట్టినరు. సచ్చిపోయిండనుకుని ఊరవతల పడేసి పోయినరు. ఊరి జనం కాపాడినరు. తనకు ఆస్తమా వచ్చింది. ఆరోగ్యం క్షీణించింది. ‘సదాశివ.. నువ్వు ఇక్కడ ఉండలేవు. ఇక్కడ చేయలేవు. నువ్వు కవివి.. కాబట్టి ప్రజల్లోకి పోయి ప్రజా సమస్యల మీద పాటలు రాయి. పాటలు పాడుకుంట పోరాటం చేయి’ అని పీపుల్స్‌వార్ అగ్రనేత కోటన్న (కిషన్ జీ) చెప్పిండు. ఆ మాట పట్టుకుని బయటికి వచ్చిండు. ఆ బాటనే నడిచిండు.
నాన్నే నా పాఠశాల
అనారోగ్యం వల్ల నాన్న ఇంటిపట్టునే ఉండే రోజుల్లో నేను తనపక్కనే పడుకునేదాన్ని. ఇంట్లోనే అక్షరాలు, శ్లోకాలు, పద్యాలు నేర్పిండు. నాన్న రాసిన పాటలకు మొదటి శ్రోతను నేనే! పాట రాసి, రాగం కట్టి ఇది పాడమని కాగితం ఇచ్చేవాడు. నాన్నకు మళ్లీ జాబ్ వచ్చింది. ఊళ్లో ఉంటూ, ఉద్యోగం చేస్తూనే ప్రజా ఉద్యమాల్లోనూ పాల్గొనేటోడు. తెల్లారితే మా ఇంట్లో సమాజం, సమస్యలు, విప్లవాల చర్చలే నడిచేవి. కాలువ మల్లయ్య, వజ్జల శివకుమార్, జాకబ్, కవ్వంపల్లి స్వామి, ఇతర సాహితీవేత్తలు, ఉద్యమకారులు వచ్చేటోళ్లు. వాళ్లు రాగానే ‘ఆ కృష్ణా పాడు’ అని నాన్న అనగానే నేను రాగం అందుకునేది.
పోలీసుల వేధింపులు,: బెదిరింపులు ఎప్పుడూ ఉండేవి. ఊరు మారితే దాడులు, ఒత్తిడి తగ్గుతయని మూర్ముర్ (అంతర్గాం మండలం) నుంచి గోదావరిఖనికి మారినం. అక్కడ సింగరేణి కార్మికులు, శ్రమజీవుల పోరాటాల్లో నాన్న భుజం కలిపిండు. పాటలు రాసిండు. పోరాటం నడిపిండు. వరకట్న వేధింపుల గురించి ‘పారాణి ఆరలేదు చెల్లెల’, ‘ఉయ్యాల ఉయ్యాలో కోలో’ పాటలో మహిళల కష్టాలు, ‘ఎన్నేళ్లీ వెలివేత’ పాటలో దళితుల అవమానాలు, ‘జాబిలమ్మకు జునుగు పోగుల దుప్పటి కప్పిన చేతులేరా’ అంటూ సిరిసిల్ల చేనేత గోసని పాటకట్టి పాడిండు. ‘ఎర్రసైన్యం’ సినిమా కోసం ‘ఏమున్నదక్కో ఏమున్నదక్కా’ పాట రాసిండు. తెలంగాణ పోరాటంలో నాన్న రాసిన ‘తలాపున పారుతాంది గోదారి’ పాట నినాదమైంది. ఈ పాటలతో నాన్న ప్రజాకవిగా ఎదిగిండు. ప్రజా ఉద్యమాలకు మమ్మల్నీ తీస్కపోయేది. నేను, అన్నయ్య, మా ఇద్దరు అక్కలు ఆ సభల్లో పాటలు పాడేటోళ్లం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో నాన్న
చనిపోయిండు. డిగ్రీ అయిపోగానే నా పెండ్లి అయింది. పేదరికమే చిరునామాగా సాగింది బతుకు. కొన్నాళ్లకు కొడుకు పుట్టిండు.
జీవితం నేర్పిన జర్నలిజం
సింగరేణిలో జరిగే కల్చరల్ ఈవెంట్స్, మహిళా దినోత్సవం రోజుల్లో నన్ను వ్యాఖ్యాతగా పిలిచేటోళ్లు. ‘నువ్వు బాగనే మాట్లాడతవు. కాబట్టి జర్నలిజంలో చేరు. కమ్యూనిస్ట్ పార్టీ 99 టీవీ పెడుతున్నది. ఇక్కడే ఉంటే ఈ పేదరికంలో చితికి పోతావు’ అని జాకబ్, స్వామి అంకుల్ అన్నరు. వాళ్లే హైదరాబాద్ తీసుకొచ్చి 99 టీవీల చేర్పించినరు. బాబుని పట్టుకుని చానెల్ ఆఫీస్‌కి పోయేదాన్ని. ఉద్యోగం అయిపోయాక బాబుని పట్టుకుని ఇంటికి వచ్చేదాన్ని. టీ న్యూస్‌లో ‘కలం గళం’ పేరుతో ప్రఖ్యాత సాహితీవేత్తలతో సంభాషణ నిర్వహించిన.
వెండితెరపై ఇలా ‘మెరిసే’
నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు తొలి కవిత రాసిన. కవిత్వం చదవడం, పాటలు పాడటం ఎంతో ఇష్టం. నాన్న చనిపోయిన నాలుగో రోజు ‘అస్తమించని సూర్యుడు’ అని ఒక స్మృతి గీతం రాసిన. కవిత్వం చదివినప్పుడల్లా, రాసినప్పుడల్లా నాన్నే గుర్తుకొస్తడు. అందువల్ల కవిత్వం చదవడం కష్టమయ్యేది. మూడేండ్లు అదే డిప్రెషన్లో ఉండిపోయిన. కవిత్వం రాసే ఒక వృత్తి ఉంటుందని నాకు తెలియదు. జర్నలిస్ట్‌గా పనిచేస్తూనే వేదికలపై వ్యాఖ్యాతగా అడుగుపెట్టిన. ‘బందూక్’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొడకండ్ల పరిచయం అయిండు. నా ఫేస్బుక్ వాల్‌పై ‘నిశీధికే తలవంచి ఉషోదయం ఆగిందా?.. ప్రకాశమై దిగంతాలు స్పృశించలేదా?’ అనే కవిత చూసి ఫోన్ చేసి మెచ్చుకున్నడు. ‘మెరిసే మెరిసే’ సినిమా కోసం పాట రాయమన్నడు. ‘నిన్నే నేనలా… ఉన్నాను నేనిలా’ పాట రాసిన. అట్ల వెండితెరకు పరిచయం అయిన. ఆ తర్వాత ‘నిశీధికే తలవంచి ఉషోదయం ఆగిందా?’ పాట ‘జెట్టి’ సినిమా కోసం శంకర్ మహదేవన్‌తో పాడించినరు. అప్పట్నుంచి సినిమా చాన్స్‌లు వస్తనే ఉన్నయి. రాస్తనే ఉన్న.
పేరుతెచ్చిన పాట
ఇప్పటికి పది సినిమాలకు ఇరవై పాటలు రాసిన. ఆలస్యంగా అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న. విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాల కోసం పాటలు రాసిన. ‘డియర్ ఆస్ట్రోనాట్’లో నావి నాలుగు పాటలున్నయి. పేద రైతు కథతో వస్తున్న ‘మా ఊరి మల్లన్న’ సినిమాలో నాది సింగిల్ కార్డ్. పాన్ ఇండియా మూవీ ‘కృష్ణకృష్ణ హరే’లో పది పాటలూ నావే! ఎన్ని పాటలు, ఎంత బాగా రాసినా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి వచ్చినంత పేరు రచయితకు రాదు. నాకంటూ పేరు తెచ్చింది ‘స్కంద జోలాలి’ పాటే. జోలపాటలు సేకరించి, వాటిని కాపాడుకోవాలని ఒకరు యూట్యూబ్‌లో ఆల్బమ్ చేస్తున్నరు. దానికోసం ‘స్కంద జోలాలి’ పాట రాసిన. అది పెద్ద హిట్ అయింది. మోపిదేవి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామివారి పవళింపు సేవకు ప్రతి రోజూ ఆ పాట ఆలపిస్తున్నరు. ఒక రచయిత పాటను ఏ పుణ్యక్షేత్రమూ ఇలా స్వీకరించలేదు. ఇలాంటి సేవల్లో అన్నమయ్య, రామదాసు కీర్తనలే పాడుతరు.
మన హీరో సాంగ్
సినిమాల్లో హీరోని ఎలివేట్ చేసే సాంగ్ కవయిత్రులకు ఇయ్యరు. విలన్‌కి బీజీఎం సాంగ్ ఇయ్యరు. ఆడపిల్లలు సున్నిత మనస్కులని ప్రేమ పాటలే ఇస్తుంటరు. నేనేమిటో తెలియాలని హీరో ఎలివేట్ పాట రాసిన. తెలంగాణలో కేసీఆర్ కంటే పెద్ద హీరో ఎవరున్నరు? కేసీఆర్ తెలంగాణ పోరాటం షురూ చేసినప్పుడు నాన్న కూడా కదిలిండు. ఉద్యమ పాటలు రాసిండు. తను రాసిన ‘తలాపున పారుతాంది గోదారి’ పాట ఉద్యమ నినాదమైంది. తెలంగాణ ఉద్యమంలో మా నాన్న కేసీఆర్‌తో కలిసి నడిచిండు. అందుకే కేసీఆర్ అంటే అభిమానం. ‘చరిత్రను మార్చిన బీజాక్షరాలు.. చీకటి చీల్చిన మూడక్షరాలు’ అనే బ్రీత్ లెస్ సాంగ్ పాట రాసి కేసీఆర్‌కి పుట్టిన రోజున నా అభిమానం చాటుకున్న. మా నాన్న బాటలో నేను నడిచినట్టే తండ్రి బాటలో నడిచే కేటీఆర్ కోసం ‘కాలం గిరిగీసెనో’ అని బర్త్ డే సాంగ్ రాసిన. హీరో ఎలివేషన్ సాంగ్ రాయాలనే కోరిక తీర్చుకున్న.
నాది ఆధ్యాత్మిక సోషలిజం!
నాన్నే నా పాఠశాల. నాన్నను తలచుకోని రోజు ఉండదు. కవిత్వం రాసినా, చదివినా నాన్ననే స్మరణకు వస్తడు. తనను తలచుకుంటూనే కవిత్వం రాస్తున్న. రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంలో ‘శ్రీరామానుజ గీతం’ రాసిన. నర సింహస్వామి కోసం ‘శరణం ఉగ్రం వీరం’ పాట రాసిన. శివుడు, అమ్మవారు, హనుమంతుడి ఆల్బమ్లకూ పాటలు రాసిన. నా కవిత్వంలో, పాటల్లో ఆధ్యాత్మికం, సమాజం, విప్లవం ఉన్నయి. కారణం మా నాన్నే. ఆయన ఉద్యమకారుడు మాత్రమే కాదు.. ఆధ్యాత్మికవేత్త. తను మంగళహారతులు రాసిండు. మా ఇంట్లో, ఊళ్లో ఇప్పటికీ ఆయన రాసిన మంగళహారతులే పాడుతుంటరు. మనిషి దేనికీ బందీ కావొద్దు. ఐడియాలజీకి కూడా బందీ కావొద్దనేవాడు. అదే నాన్న గొప్పతనం. ఒక స్థాయిలో ఆధ్యాత్మికతే కమ్యూనిజం అని నాన్నని చూసి నేర్చుకున్న. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. అన్ని జీవులను సమానంగా చూడాలని చెప్పే ఆధ్యాత్మికత సోషలిజమే కదా!
-నాగవర్ధన్ రాయల, గడసంతల శ్రీనివాస్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

