స్మార్ట్‌వాచీల తయారీలో అగ్రగామి గార్మిన్.. ‘ఫీనిక్స్ 8’ పేరుతో మల్టీ స్పోర్ట్స్వాచ్ను తీసుకొచ్చింది. ప్రొఫెషనల్ అథ్లెట్స్, సాహసికుల కోసం ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌కు రూపకల్పన చేసింది. సాధారణ స్మార్ట్‌వాచ్ కన్నా భిన్నంగా.. ఇందులో అనేక అధునాతన, భద్రతా ఫీచర్లను జోడించింది. ట్రెక్కింగ్, లాంగ్ రైడ్ చేసేవారికి బ్యాటరీ బ్యాకప్ ప్రధాన సమస్యగా మారుతుంది. దాన్ని నివారించడానికి ఇందులో శక్తిమంతమైన బ్యాటరీని ఏర్పాటుచేసింది.
వాడకాన్ని బట్టి 10 రోజుల నుంచి 29 రోజుల వరకూ బ్యాకప్ ఇస్తుందని సంస్థ చెబుతున్నది. సోలార్ చార్జింగ్ సౌకర్యాన్నీ కల్పించడంతో.. ఎక్కడపడితే అక్కడే చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక మరింత మన్నిక, దృఢత్వం కోసం టైటానియం బెజెల్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను తీర్చిదిద్దింది. ఇందులోని ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్.. రాత్రిపూట ఇబ్బందులను తప్పిస్తుంది. మైక్రోఫోన్, స్పీకర్ వంటి మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి. కేవలం స్మార్ట్వాచ్గానే కాకుండా.. అధునాతన యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్లనూ కలిగి ఉంది.
ఈ వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఎల్టీఈ-శాటిలైట్ కనెక్టివిటీని అందిస్తుంది. లైవ్ లొకేషన్ షేరింగ్, వాతావరణ సమాచారాన్ని కూడా నేరుగా అందిస్తుంది. గార్మిన్ మెసెంజర్ ద్వారా నేరుగా ఉపగ్రహం నుంచే లొకేషన్ చెక్-ఇన్లు, టెక్ట్స్ మెసేజులను పంపవచ్చు. పది మీటర్ల లోతు వరకు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్‌లలో ఉండే అన్నిరకాల ఫీచర్లనూ అందిస్తుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది.