ISRO | చంద్రయాన్ విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పేరు మారుమోగింది. ఆ స్ఫూర్తితో ఆదిత్య ప్రాజెక్ట్‌తో ఏకంగా సూర్యుడినే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ రెండు విజయాల ఆనందం నుంచి అభిమానులు తేరుకునేలోపే ‘వ్యోమ మిత్ర’ కబురు వచ్చేసింది. ఇస్రో రూపొందించిన ఓ రోబో పేరిది. ‘వ్యోమ మిత్ర’ ఈ ఏడాది అంతరిక్షంలోకి వెళ్లనుంది.
ఆ వాతావరణం ఎలా ఉంటుంది, దానికి తగినట్టు ఎలా నడుచుకోవాలి, వ్యోమనౌకను ఎలా నియంత్రించాలి, ఏదైనా ఆపద వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో అంశాలను వ్యోమ మిత్ర ద్వారా పరీక్షించనున్నారు. ఇది ఉత్తుత్తి ప్రయోగం కాదు.
వచ్చే ఏడాది గగన్‌యాన్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలో పంపే ప్రయత్నం జరుగుతున్నది. అయితే, ఇప్పటివరకూ దేశీయ వ్యోమనౌక ద్వారా ఎవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా .. ఇతర దేశాల సహకారంతోనే వెళ్లారు. ఈ పరిమితిని గగన్‌యాన్ దాటేయనుంది. ఆ ప్రాజెక్ట్ సృష్టించబోయే అద్భుతానికి ఒక రిహార్సల్‌గా వ్యోమ్ మిత్ర సాయపడనుంది. ఈ రోబో మహిళ రూపంలో ఉండటం విశేషం.