నెలసరి వచ్చే మహిళల శాతానికి, ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే శక్తి కలిగిన మహిళల శాతానికి మధ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అంతరం ఉంది. మన దేశంలో అయితే శానిటరీ న్యాప్కిన్లు వినియోగిస్తున్నవారు దాదాపు 20 శాతం మంది మాత్రమే. ఇలా రుతుక్రమానికి సంబంధించిన అవసరాల్ని తీర్చుకోలేని స్థితిని ‘పీరియడ్ పావర్టీ’(నెలసరి పేదరికం) గా పిలుస్తారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం మీద చర్చ నడుస్తున్నది. స్కాట్లాండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయట. అందుకే ఆ దేశ చట్టసభ ‘పీరియడ్ ప్రొడక్ట్ బిల్’ను ప్రవేశ పెట్టింది.
దీని ప్రకారం దేశంలోని మహిళలందరికీ శానిటరీ ఉత్పత్తులను పూర్తి ఉచితంగా ఇస్తారు.. స్థానిక సంస్థలు ఈ బాధ్యత తీసుకుంటాయి. ఎవరు ఎన్ని తీసుకెళ్లినా ప్రశ్నించకూడదు. తీసుకునే సమయంలో ఎలాంటి దరఖాస్తులూ నింపాల్సిన అవసరం లేదు. మహిళలు తమకు అవసరమైన వస్తువుల్ని స్వేచ్ఛగా, గౌరవంగా తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. నిజానికి ఈ చట్టం చేసి రెండు సంవత్సరాలైంది. తొలుత విద్యాసంస్థల్లో ఉచితంగా ఇచ్చేలా చట్టం రూపొందించారు. తాజా సవరణతో అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. స్కాట్లాండ్ స్ఫూర్తితో ప్రతి దేశం పీరియడ్ పావర్టీని రూపుమాపే దిశగా అడుగులు వేయాలి.