ఇప్పుడంతా మడత ఫోన్ ముచ్చట్లే. మల్టీ టాస్కింగ్ కోసం మస్తీ ఫీచర్లలో అన్ని కంపెనీలు ఇప్పుడు ఈ ఫోల్డ్ ఫోన్ పైనే ధ్యాస పెడుతున్నాయి. వివో కూడా ‘ఎక్స్ ఫోల్డ్ 4’ పేరుతో మార్కెట్లోకి నయా మాడల్ తేనుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో, ఇప్పటి వరకూ మడత ఫోన్లలో లేని అడ్వాన్స్ అప్డేట్స్ ఇందులో పొందుపర్చింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులను ఆకర్షిస్తున్నది. అంతేకాదు.. దాన్ని వైర్లెస్గా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. ఇంకా చెప్పాలంటే… రెండు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ నిక్షిప్తం చేయనుంది. ఫొటోగ్రఫీ ప్రియులు మెచ్చేలా 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మూడు కెమెరాలు ఏర్పాటుచేసింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్ పక్కగా ఆన్బోర్డ్ అయ్యిందట. ఫోల్డ్ 3 తర్వాత వచ్చే వెర్షన్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా మరి!!