మనకు లెదర్ ల్యాప్‌టాప్ బ్యాగులు తెలుసు. వాటి మీద ఎప్పుడైనా ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్ చూశారా? వర్షాకాలంలో రోజూ గొడుగులు వాడతాం. కానీ, వాటి మీద సంప్రదాయ కళా వైభవాన్ని ఏ రోజైనా గమనించారా? చాయ్ కప్పుల నుంచి టీషర్ట్స్ వరకూ కాదేదీ.. కళాత్మకతకు అనర్హం అని నిరూపిస్తున్నారు బెంగాల్‌కు చెందిన స్వయంభర్ నారీ శాంతినికేతన్ సభ్యులు.
ఆ మహిళా సంఘం నేతృత్వంలో హైదరాబాద్, మారేడ్‌పల్లిలోని వైఎంసీఏలో జరుగుతున్న ఎగ్జిబిషన్ ఇంటిని, ఒంటిని కొత్తగా ముస్తాబు చేసుకోవాలని అనుకునేవారికి చాలా ఐడియాలే ఇస్తుంది. బాతిక్, పట్టచిత్ర బొమ్మలను తమదైన శైలిలో ఉపయోగించుకున్నారు మహిళామణులు. ఈ ప్రదర్శన ఆగస్టు 25 వరకూ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. కళాకారులను ప్రోత్సహించడం అంటే కళలను బతికించడమే. కళ బతికితేనే సమాజం కళకళలాడుతుంది.