ఘుమఘుమలు వెదజల్లే వంటగదిలో ఒక్కోసారి భరించరాని దుర్గంధం వ్యాపిస్తుంది. చెత్త డబ్బాలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు, సింక్‌లో పేరుకుపోయిన అవశేషాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. దాంతో, భోజనం సిద్ధం చేయడానికే కాదు.. ఆ గదిలో నిల్చోవడానికీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ.. వంటగదిని సువాసనల మయం చేయొచ్చు. ఇందుకు వంటకోసం ఉపయోగించే పదార్థాలనే శుభ్రంగా వాడేయొచ్చు.
వంటగదిలో దుర్వాసనను పోగొట్టడంలో నారింజ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో ఓ గ్లాసు నీళ్లు పోసి.. అందులో గుప్పెడు ఆరెంజ్ తొక్కలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. ఈ నీటిని సన్నని మంటపై ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గిన్నెను
అలాగే ఉంచేస్తే.. దుర్వాసన దూరమై, వంటగదిలో పరిమళాలు విస్తరిస్తాయి.
చేపల కూర వండినప్పుడు ఇల్లంతా నీచు వాసన వస్తుంది. ఆ వాసనను పోగొట్టడంలో నిమ్మకాయ ముందుంటుంది. ఒక గిన్నెలో లీటర్ నీళ్లు తీసుకొని, దానిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండాలి. తొక్కలను కూడా అందులోనే వేసి.. నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని డబ్బాలోకి తీసుకొని గది మొత్తం స్ప్రే చేస్తే.. దుర్వాసన మాయం అవుతుంది.
ఇక మటన్, చికెన్ వండినప్పుడు వెలువడే వాసనను పోగొట్టాలంటే.. వెనిగర్‌ని ఉపయోగించాలి. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి, అందులో కొద్దిగా వెనిగర్, నిమ్మకాయ తొక్కలు వేయాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై వేడిచేస్తే.. కొద్దిసేపట్లోనే సువాసనలు వెదజల్లుతాయి.
వంటగదిలో మిగిలిపోయే పదార్థాల నుంచి కూడా చెడు వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని.. అందులో కొద్దిగా యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క లాంటి మసాలా దినుసులు వేయాలి. ఈ నీటిని కొద్దిగా మరిగిస్తే.. వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. చల్లారిన తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్లోకి తీసుకొని.. సింక్ కింద, డస్ట్‌బిన్ పెట్టే ప్రాంతంలో స్ప్రే చేసుకోవాలి.