గతంలో ప్రదర్శించినవైనా, ఇప్పటికే ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నవైనా.. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్న నాటకాలైనా.. ‘ద డ్రామా లైబ్రరీ’లో సేవ్ చేసుకోవచ్చు. రచయితల అనుమతితో వాటిని ఔత్సాహికులు నిరభ్యంతరంగా చదువు కోవచ్చు. నలుగురితో చదివించొచ్చు కూడా. కొత్తగా ఉంది కదూ! ముంబైలో ఇలాంటి ఓ వర్చువల్ లైబ్రరీని ఇటీవలే ప్రారంభించారు భాష సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నిర్వాహకులు. వ్యవస్థాపకులలో ఒకరైన ఫల్గుణీరావు ఈ గ్రంథాలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
తను నాటకాభిమాని, రచయిత్రి. ఇప్పటికే రెండొందల పైచిలుకు నాటకాలు డ్రామా లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్నడం, తమిళం, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భారతీయ భాషల రచనలు ఉన్నాయి. వీటిలోనూ, ఎక్కడా ప్రచురణకు నోచుకోని స్క్రిప్ట్లే ఎక్కువ. ‘నాతోపాటు ఎంతోమంది నాటక ప్రియుల ఆలోచనల ఫలితం ఇది’ అంటారు ఫల్గుణీరావు. www. thedramalibrary.comలోకి వెళ్లి మీకు నచ్చిన నాటకాల్ని చదవొచ్చు. అప్లోడ్ చేయొచ్చు కూడా.