కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతోనే తెలుగు వారికి వచ్చే పండుగ ఉగాది. కాలంలో వచ్చే మార్పునకు ఈ పండుగ ప్రత్యక్ష నిదర్శనం. ఈ పండుగలో భాగంగా జరుపుకొనే ఆచారాలు, సంప్రదాయాలన్నీ పూర్తిగా వైజ్ఞానికమైనవే. ఉగాది పండుగ అనగానే గుర్తుకు వచ్చేది పంచాంగం. రాబోయే ఏడాదంతా తనకు ఎలా ఉండబోతుంది? తన భవిష్యత్ ఏమిటనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ సహజంగానే కలుగుతుంది.
తరలివచ్చిన వసంతంతో వనం సంతసిస్తుంది. తరులు చివురు తొడుగుతాయి. చివురులు మేసిన చిన్నారి కోయిలలు.. కుహూ రావాలతో కాలానికి తాళం వేస్తాయి. గుమ్మాలకు చేరిన మామిడాకులు, వేపకొమ్మలు.. పచ్చగా స్వాగతం పలుకుతాయి. కొత్తకుండలో అమ్మ సిద్ధం చేసిన పచ్చడి.. మంచిని నిలిపి, చెడును విడవమని చెబుతుంది. పంచాంగ శ్రవణంలో గ్రహగమనాలు.. కాలానుగుణంగా వ్యవహరించమని హెచ్చరిస్తాయి. ఇలా కోటి ఉషస్సులతో ఆగమించిన ఉగాది ఇచ్చే సందేశం ఇది..
Ugadi | ఉగాది పండుగతో చైత్రమాసం ప్రారంభమవుతుంది. వసుధపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది. మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తి భిన్నం. ఏ దేవుడి పేరూ ఈ పండుగ రోజు వినిపించదు. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. అంతేకాదు, ఎన్నో వైజ్ఞానిక అంశాల సమాహారంగానూ ఉగాది తన ప్రత్యేకతను చాటుతుంది.
ప్రతి మనిషిలోను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలుగా పంచభూతాలు అంతర్లీనంగా ఉంటాయి. ఇవే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే రూపాల్లో బాహ్యంగా ప్రకటితమవుతాయి. ఇలా అంతర్బహిర్ రూపాల్లో ఉన్న పంచభూతాలను మనో నేత్రంతో దర్శించి, లౌకిక జీవనాన్ని సాఫల్యం చేసుకుంటూనే కైవల్యానికి సోపానాలు నిర్మించుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంది. దైనందిన జీవనంలోని ప్రతి అడుగులో ప్రకృతిని అనుసరిస్తూ, ‘ప్రకృతి’, ‘శక్తు’ల మేలు కలయికగా జీవన లక్ష్యాన్ని చేరుకోవాలనేది మన ప్రాచీనుల దిశానిర్దేశం. ఈ బాధ్యతల నిర్వహణలో మనిషికి చేయూత అందించేందుకు సర్వోపద్రష్టలైన మన ప్రాచీనులు ‘కాల’విభజన చేశారు. ఈ క్రమంలో భారతీయ జీవనంలోని అత్యున్నత వైజ్ఞానిక కోణం సమున్నతంగా ఆవిష్కృతం అవుతుంది.
ఆశలు చిగురుల వంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి. అలా కోరుకోవటమే నిత్య వసంతం అవుతుంది. ఎల్లప్పుడూ మంగళధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత. ఈ విధంగా ఉగాది పండుగ మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది. ఉగాది పండుగ పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు మోడుబారిన చెట్లు, తీగలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్టు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకుసాగాలనే సందేశాన్ని అందిస్తుంది. ఇదంతా ఉగాది పండుగలోని సామాజిక విజ్ఞానం.
ఉగాది పండుగలో అన్నిటికన్నా విశేషమైంది ఉగాది పచ్చడి. మిగిలిన పండుగల్లో పిండివంటలు చేసుకుంటే ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా. ఏ విధంగానూ పచనం (వండటం) చెయ్యకుండా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం అనే ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి పచ్చడిని తయారుచేస్తారు. ఈ రుచుల్ని కలపటానికీ ఓ లెక్క ఉంది. తీపి, కారం సమానంగా కలపాలి. వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి. మానవజీవితం అన్ని రుచుల కలయిక. అన్ని రుచులూ కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకుంటుంది. మనసు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాది రోజున ఆరు రుచుల పచ్చడిని ప్రసాదంగా అందజేస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు మానవ జీవితంలో సహజ రుచులు. వీటిని సమన్వయం చేసుకుని, అనుకూలంగా రంగరించుకుని ప్రయాణించటమే జీవనం. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ మానవ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి. సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్త్విక సందేశం ఉగాది పచ్చడిలో ఉంది.
తీపి: ఉగాది పచ్చడిలో తొలి అంశం మధురం. తీపికి ప్రతీకగా ఉగాది పచ్చడిలో కొత్త బెల్లాన్ని కలుపుతారు. తియ్యదనం ఆనందానికి గుర్తు. ఒక వ్యక్తి మిఠాయిలు పంచుతున్నాడంటే అతనికి ఆనందం కలిగినట్లు సంకేతం అందుకోవచ్చు. మనం ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం…ఇలా ఏ పనిచేసినా అంతిమంగా ఆశించేది ఆనందమయమైన జీవితమే. ఆనందమే మనిషి జీవితానికి పరమార్థం. అందుకనే ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అటువంటి ఆనందమయ జీవితం ఈ ఏడాదంతా కావాలని సంకేతరూపంలో చెప్పేదే ఉగాది పచ్చడిలోని మధుర పదార్థం.
మరోకోణంలో తీపి కామానికి సంకేతం. కామం అంటే కోరిక. మనిషికి కోరిక ఉంటేనే చైతన్యంగా ఉంటాడు. అంతమాత్రాన కోరిక హద్దు మీరకూడదు. అందుకనే ఉగాది పచ్చడిలో సగభాగం మాత్రమే తీపి కలపాలని నియమం పెట్టారు. వైద్యవిజ్ఞాన పరంగా కొత్త బెల్లం (తీపి) శరీరంలో ఉండే వాత, పిత్త ధర్మాలను అదుపులో ఉంచుతుంది. దప్పిక, మూర్ఛలను తొలగిస్తుంది. మంటల నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
లవణం: ఉప్పు ఉత్సాహానికి ప్రతీక. మనిషి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఏదో కోల్పోయినట్టు నీరసంగా ఉండే వ్యక్తి ఏ లక్ష్యాన్నీ సాధించలేడు. ఉత్సాహవంతుడైన వ్యక్తి మాత్రమే తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. మనిషి జీవితానికి తప్పనిసరిగా ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అతను నిరంతరం శ్రమించాలి. ఆ శ్రమలోనే ఆనందం కలుగుతుంది. ఆనందంతో, ఇష్టంతో పడే కష్టం అలసట కలిగించదు. అలసట ఎరుగని శ్రమ విజయాన్ని అందిస్తుంది. వైద్య విజ్ఞానపరంగా చూస్తే ఉప్పు బద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందింపజేస్తుంది. కఫాన్ని, కంటిలో ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.
చేదు: చేదు రుచి కోసం ఉగాది పచ్చడిలో వేపపూత కలుపుతారు. చేదు మనిషికి కలిగే బాధలకు సంకేతం. బాధల్లేని మనిషి భూమ్మీద ఉండనే ఉండడు. అలాగని, బాధల్ని తల్చుకుంటూ జీవితాన్ని నిస్తేజంగా గడపటం తగదు. ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడే ధైర్యాన్ని తెచ్చుకోవాలి, సహనాన్ని అలవర్చుకోవాలి. బాధ కలిగింది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా, తన కష్టాన్ని తొలగించుకునే మార్గాన్ని అన్వేషించాలనే కర్తవ్యాన్ని ఉగాది పచ్చడిలోని చేదు బోధిస్తుంది. వైద్యపరంగా చూస్తే చేదు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. తల్లిపాలలో ఉండే దోషాలను కూడా ఇది తగ్గిస్తుంది. దప్పిక, దురదలు, మంటలు పోగొడుతుంది. చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వేపను ఉపయోగించి 35 రకాల శారీరక వ్యాధులను నివారించవచ్చు. నిద్రలేమితో బాధపడేవారు కొద్దిగా వేపాకు నమిలినా, అరచేతిలో వేపాకు మర్దించి వాసన చూసినా ఫలితం ఉంటుంది.
పులుపు: ఉగాది పచ్చడి నోటికి తగలగానే కలిగే భావన పులుపు. చింతపండు పుల్లదనం అందిస్తుంది. పులుపులో చురుకు ఎక్కువగా ఉంటుంది. పులుపు నేర్పరితనానికి సంకేతం. తనకు కలిగే కష్టాలు, నష్టాలు, బాధల నుంచి ఉపశమనం పొందటానికి మనిషికి నేర్పరితనం ఎంతో అవసరం. నేర్పరితనం లేని మనిషి మొద్దుగా ప్రవర్తిస్తాడు. ఇతరుల ఆత్మీయత అందుకోలేడు. కాగా, ఉగాది పచ్చడిలోని పులుపుదనం వైద్య విజ్ఞానపరంగా వాతాన్ని పోగొడుతుంది. ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలుచేస్తుంది. పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. రుచి కోల్పోయిన నాలుకకు ఉత్తేజం కలిగిస్తుంది.
వగరు: మామిడి పిందెల ముక్కలు ఉగాది పచ్చడికి వగరుదనాన్ని కలిగిస్తాయి. వగరుదనం కొత్త సవాళ్లను స్వీకరించటానికి సంకేతం. సవాళ్లను స్వీకరించిన మనిషి మాత్రమే జీవితంలో విజయం సాధిస్తాడు. లేకపోతే అతడు నిరంతరం పరాజితుడుగానే మిగిలిపోతాడు. వైద్య విజ్ఞానపరంగా చూస్తే వగరుదనం శ్లేష్మ, రక్త, పిత్త బాధలు తగ్గిస్తుంది. గాయాలు మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఉగాది పచ్చడిలో వేసే మామిడి ముక్కలు జీర్ణాశయంలో పుండ్లకు, రక్తస్రావాలకు మందుగా పనిచేస్తాయి. వేసవికాలపు వడదెబ్బను కూడా ఇవి నివారిస్తాయి.
కారం: ఉగాది పచ్చడిలో అంటీ అంటకుండా నోటికి తగిలే రుచి కారం. ఈ రుచి కోసం ఉగాది పచ్చడిలో మిరియాల చూర్ణం కలుపుతారు. కారం ధైర్యానికి సంకేతం. కోపానికి ప్రతీక. ధైర్యం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. ధైర్యలక్ష్మి లేకపోతే మిగిలిన లక్ష్ములు ఉన్నా ప్రయోజనం లేదు. ప్రతి మనిషికీ జీవితం ఓ అగ్నిపరీక్ష. కష్టాలు, కడగండ్లు తప్పనిసరిగా ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూర్తిగా సుఖాలతో ఉండదు. జీవితంలో ఆపదలు రావటం చాలా సహజం. అటువంటి సందర్భాల్లోనే ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం లేకపోతే వివేకం నశిస్తుంది. వైద్య విజ్ఞానపరంగా చూస్తే కారం పేగుల్లో ఉండే పురుగులను చంపి, ఆకలిని పెంపొందిస్తుంది. రుచి పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. ఇలా షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరోగ్యంతోపాటు జీవిత సత్యాన్నీ చాటి చెబుతుంది.
యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. ఈ ఆరు చక్రాలు మనం తీసుకునే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మూలాధారం – తీపి, స్వాధిష్టానం – వగరు, మణిపూరకం – చేదు, అనాహతం – పులుపు, విశుద్ధ- కారం, ఆజ్ఞ – ఉప్పు రుచులకు ఆలంబనగా ఉంటూ, మనిషి జీవక్రియల నిర్వహణలో తోడ్పడుతుంటాయి.
మనం వివిధ రకాలైన ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఆయా రుచులకు అనుగుణంగా ఆయా చక్రాలు చైతన్యవంతం అవుతాయి. అలాగే, ప్రాణవాయువు మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రకాలుగా ఉంటుంది. వీటిలో ప్రాణ – వగరు, అపాన – తీపి, వ్యాన – పులుపు, ఉదాన – కారం, సమాన – చేదు రుచులతో అనుసంధానమై ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రుచి ఎక్కువగా ఉందో అందుకు అనుగుణంగా ఆ రకమైన ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది. షట్చక్రాలు, పంచప్రాణాలను యోగ శాస్త్ర పద్ధతుల ప్రకారం అదుపులో ఉంచుకోవటానికి కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఏ ఒక్క ఆహారం (రుచి) మాత్రమే కాకుండా అన్ని రకాల రుచుల మేళవింపుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా రుచులన్నీ సమపాళ్లలో అందినప్పుడే శరీరం మనిషికి స్వాధీనంలో ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఆరు రుచులను కలిపి మేళవించటంలో ఉన్న మరో అర్థం ఇదే. మొత్తంగా మనిషిని పరిపూర్ణుడుగా మారేందుకు ఉగాది పచ్చడి ప్రేరేపిస్తుంది.
– డాక్టర్ కప్పగంతు రామకృష్ణ