మరీ అందగత్తేం కాదు. కానీ, ఏదో అయస్కాంత శక్తి! తెరమీద చూస్తున్నంత సేపూ.. ఆ పిల్లతో మనకు బీరకాయ పీచు చుట్టరికం ఉందేమో అన్న అనుమానం. మరుక్షణమే మనసును మల్టీప్లెక్స్ చేసుకుని.. ఆలియాభట్‌కు ఓ కార్నర్ సీట్ కేటాయిస్తాం. బ్రహ్మచారుల క్లబ్బులే కాదు, కార్పొరేట్ హౌస్‌లు కూడా ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడతాయి. బ్యాండు మేళాలతో వెళ్లి.. బ్రాండింగ్ కాంట్రాక్టులు ఖాయం చేసుకుంటాయి. కాబట్టే, మన ట్రిపుల్ ఆర్ సీతమ్మ వాకిట్లో కాసుల సిరిమల్లె చెట్టు విరగకాస్తున్నది.
ఎన్నేండ్ల నుంచి ఉన్నామన్నది కాదు! ఎందరిని మెప్పించామన్నది ముఖ్యం. ఈ సూత్రం ఆలియా భట్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న ట్రిపుల్ ఆర్‌లో ఆలియా అక్కడక్కడా అలా మెరిసి, ఇలా మాయమైనా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకు కారణం ఆకట్టుకునే రూపం, ఆశ్చర్యపరిచే నటన.. మాత్రమే కాదు. ఆలియా నవతరం నటులకు ప్రతినిధి. మంచి స్క్రిప్ట్, మంచి పాత్రలు, మంచి హిట్స్.. అక్కడితో ఆగిపోలేదు. సంపాదన గురించి కూడా ఆలోచిస్తున్నది. అందుకే, బ్రాండింగ్ మీద దృష్టిపెట్టింది. వాణిజ్య ప్రకటనల్లో విలక్షణ ప్రతిభను కనబరుస్తున్నది. వాటిలో ఎంతోకొంత సామాజిక సందేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఆలియాకు బ్రాండ్ మహారాణి కిరీటం రాత్రికి రాత్రే దక్కిందేం కాదు. దీని వెనుక ఎంతో కృషి దాగున్నది. వరుస హిట్స్ ఆలియాను ప్రకటనల రేసులోనూ ముందుకు తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన ‘గంగూబాయి కాఠియావాడి’ రూ.వంద కోట్ల క్లబ్లో చేరడం, వెనువెంటనే వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’లో ఆమె కూడా ఓ కథానాయిక కావడం.. ఆలియా ఇమేజ్ను అమాంతం పెంచేశాయి. దీంతోపాటు ఆమె చేస్తున్న సినిమాలు కూడా ఆ వేగానికి ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి.
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ, జీ లే జారా, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. మార్కెట్ వర్గాలు తమ బ్రాండ్ ప్రమోషన్లో ఆలియాను తురుపుముక్కగా భావిస్తున్నాయి. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో మంచి తరుణం మించిన దొరకదన్న నమ్మకంతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటున్నాయి. ముప్పయ్కిపైగా బ్రాండ్లు ఇప్పటికే ఆలియా చేతిలో ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సూత్రాన్ని తను తు.చ. తప్పక పాటిస్తున్నది. లైమ్‌లైట్‌లో ఉండగానే సంపాదించుకోవాలని ఫిక్సయినట్టుంది. తన పారితోషికాన్ని కూడా 20 నుంచి 40 శాతం వరకు పెంచిందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇదంతా చూసే, ‘తను ఏదో ఒకరోజు గ్లోబల్ స్టార్ అవుతుంది. భారతదేశానికి పేరు తెస్తుంది’ అంటారు సంజయ్‌లీలా బన్సాలీ.
గత ఏడాది విడుదలైన ‘క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్’్ట ప్రకారం.. ఆలియా బ్రాండ్ అంబాసిడర్‌గా హేమాహేమీల సరసన నిలిచింది. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని, బాలీవుడ్ బిగ్-బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, సల్మాన్‌ఖాన్ తర్వాత ఆలియాభట్ అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నదని తేలింది. తాజా నివేదిక ప్రకారం ఆమె మరో రెండుస్థానాలు ఎగబాకి టాప్ త్రీలో నిలిచింది. ఆలియాను నమ్ముకొని పెద్దపెద్ద బ్రాండ్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
సామ్సంగ్, సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ, లేస్, మాన్యవర్, ఫ్లిప్‌కార్ట్, హీరో, మేక్ మై ట్రిప్, ఫ్రూటీ.. ఇలా 30 బ్రాండ్ల ప్రకటనల కోసం, ఎడతెగని షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నది ఆలియా. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఆమె సంపాదన ఏటా రూ.64 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ లెక్కలు. లెక్కా పత్రం ఎలా ఉన్నా.. ఆలియా మాత్రం అయితే సినిమా షూటింగ్లో, లేదంటే యాడ్స్ షూటింగ్లో కనిపిస్తున్నదట. 29 ఏండ్ల ఈ నటిని మిలీనియల్స్‌కు ప్రతినిధిగా భావిస్తున్నారు. ఈ తరం ఆలోచనలకు ఆమె దగ్గరగా ఉండటంతో పలు వాణిజ్య సంస్థలు ఆలియా కోసం పోటీపడుతున్నాయి. తన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య దాదాపు 6.18 కోట్లు, ట్విటర్ ఖాతాను 2.13 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దీనిని బట్టి యువతలో ఆలియా క్రేజ్ ఏపాటిదో తెలుసుకోవచ్చు. బాలీవుడ్లో సత్తా చాటుతున్న ఆలియా.. బ్రాండింగ్‌లోనూ ‘నా దారి.. రహదారి’ అంటున్నది. అన్నట్టు, ఆలియా పరిశ్రమకు వచ్చి ఈ ఏడాదితో పదేండ్లు! నాన్న మహేశ్‌భట్ మాటల్లో చెప్పాలంటే.. ‘ఆలియా టాల్కమ్ పౌడర్ కాదు, గన్ పౌడర్’!
అల్లు అర్జున్ నా అభిమాన హీరో!