పొద్దున్నే ‘టీ’ తాగనిదే కొంతమందికి రోజు మొదలుకాదు. అయితే, తరచూ తేనీరు సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది చెబుతుంటారు. ఆ ప్రచారానికి విరుద్ధంగా, రోజుకు ఒకసారైనా బ్లాక్ టీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు అమెరికన్ పరిశోధకులు. వేడివేడి ‘టీ’ వల్ల శరీరానికి ఉత్తేజం వస్తుందని హామీ ఇస్తున్నారు. అందుకేనేమో..
అలసట, ఒత్తిడి అనిపించగానే చాలా మంది చిక్కటి చాయ్‌ని ఆశ్రయిస్తారు. తేనీరు అనేది క్యాన్సర్, ఊబకాయం లాంటి సమస్యలు దరి చేరకుండా చూస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ బ్లాక్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉంటుందట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, బ్లాక్ టీ ఒంటినొప్పులను కూడా తగ్గిస్తుంది. మలబద్ధ్దకం సమస్య సైతం తీరిపోతుందని నిర్ధారిస్తున్నారు పరిశోధకులు. కాకపోతే చక్కెర స్థానంలో తేనె, బెల్లం మొదలైన సహజ తీపి పదార్థాలను జోడిస్తే మేలు.