ఎప్పటి తిన్నడు? ఎవరీ కన్నప్ప?? ‘కాళహస్తి మహాత్యం’గా 70 ఏండ్ల కిందట పలకరించాడు. ‘భక్త కన్నప్ప’గా మరోసారి 49 ఏండ్ల క్రితం భక్త వ‘శంకరుడి’ లీలను చాటాడు. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’గా కన్నార్పకుండా తనను చూడమంటున్నాడు! కన్నప్ప కథ.. ముచ్చటగా మూడోసారి వెండితెరపై వెలుగులు పంచనున్నది. ఒక్క కన్నప్ప కథ మాత్రమే కాదు.. మరెన్నో సినిమాలు తెలుగు తెరపై మళ్లీ మళ్లీ రూపుదిద్దుకున్నాయి. అందులో కొన్ని గత చిత్రాల కన్నా వైభవంగా ఆడాయి. మరికొన్ని ఉస్సూరుమనిపించాయి. అలా తెలుగు తెరపై అదే కథతో, ఇంచుమించు అదే కథనంతో పునర్ నిర్మితమైన సినిమాల ముచ్చట్లు ఇవి..
Telugu Cinema | రామాయణం ఎన్నిసార్లు విన్నా రమణీయమే! ఆదికవి వాల్మీకి అపురూప సృష్టిని.. తర్వాతి కాలంలో ఎందరో కవులు మళ్లీ మళ్లీ ఆవిష్కరించారు. వ్యాస విరచిత మహాభారతాన్నీ… కవిత్రయం మొదలుకొని మరెందరో మళ్లీ రచించారు. వేటి గొప్పదనం వాటిదే! కాస్త డొక్కశుద్ధి ఉన్న కవులు తిరగరాసినప్పుడు.. ఆ కావ్య గరిమ మరింత ఇనుమడించింది. అంతగా అవగాహన లేకుండా రాసి, ఆదరణ పొందని సందర్భాలూ ఉన్నాయి. సినిమాల్లోనూ అంతే! మొట్టమొదటి టాకీ చిత్రంగా విడుదలైన ‘భక్త ప్రహ్లాద’ తర్వాతి కాలంలో మూడుసార్లు మళ్లీ నిర్మితమైంది. మొదటి భక్త ప్రహ్లాద 1932లో విడుదలైంది. దీనికి హెచ్ఎం రెడ్డి దర్శకుడు. తర్వాత పదేండ్లకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది. తర్వాత 16 ఏండ్లకు దాదాపు ఇదే కథతో బీఏ సుబ్బారావు దర్శకత్వంలో ‘చెంచులక్ష్మి’ సినిమా వచ్చింది. ప్రహ్లాదుడి కథకు కొనసాగింపుగా చెంచులక్షి, నరసింహస్వామి పెండ్లి కథను ముడిపెట్టి దీనిని నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ 1967లో చిత్రపు నారాయణరావు డైరెక్షన్లో ‘భక్త ప్రహ్లాద’ వచ్చింది. ఈ చిత్రం అపూర్వ విజయం సొంతం చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ‘చెంచులక్ష్మి’, ‘భక ప్రహ్లాద’ (1967) రెండిట్లోనూ హిరణ్యకశిపుడిగా ఎస్వీఆర్ నటించాడు. మొత్తానికి ప్రహ్లాద చరితం నాలుగుసార్లు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ తరం నటుడు రానా బకెట్ లిస్ట్‌లో ‘హిరణ్యకశిప’ ప్రాజెక్టు ఉందని చాలాకాలంగా వినిపిస్తున్న మాట! అది పట్టాలెక్కితే ప్రహ్లాద చరిత్ర తెలుగులో ఐదుసార్లు తెరకెక్కిన చిత్రమవుతుంది.
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన ఏకైక తెలుగు చిత్రం ‘కాళహస్తి మహాత్యం’. తిన్నడుగా రాజ్‌కుమార్ నటించిన తీరు విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. హెచ్ఎల్ఎన్ సింహా దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఘంటసాల గాత్రం ఈ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. ఇందులోని పాటలు ఇప్పటికీ శివాలయాల్లో మార్మోగుతూ ఉంటాయి. కైలాసనాథ శాస్త్రిగా ముదిగొండ లింగమూర్తి అభినయం అద్భుతః అనిపిస్తుంది. ఆయన కొడుకు కాశిగా పద్మనాభం నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా విడుదలైన రెండు పుష్కరాలకు 1976 బాపు దర్శకత్వంలో ‘భక్త కన్నప్ప’ వచ్చింది. ఇందులో కన్నప్పగా కృష్ణంరాజు జీవించాడనే చెప్పాలి. ఆయనకు జోడిగా వాణిశ్రీ అభినయించింది. కైలాసనాథ శాస్త్రిగా రావుగోపాలరావు అదరగొట్టాడు. సినిమాకు సత్యం మాస్టారు సంగీతం అందించాడు. ఇందులోని కిరాతార్జునీయం గీతం వేటూరి రచనా వైచిత్రిని చాటి చెబుతుంది. ‘శివశివ శంకర.. భక్త వశంకర’ గీతంలో ఆయన ప్రయోగించిన అలంకారాలు.. పండిత పామరులనూ అలరించాయి. మళ్లీ దాదాపు 49 సంవత్సరాల తర్వాత మరోసారి వెండితెరపై వెలిగేందుకు కన్నప్ప సిద్ధమవుతున్నాడు. పాత కథకు పలు చారిత్రక అంశాలను జోడించి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించామని హీరో మంచు విష్ణు చెబుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు జనాదరణ పొందాయి. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ ప్రేక్షకులను పలకరించనున్నాడు.
అప్పుడెప్పుడో వచ్చి.. ఆ తర్వాత మళ్లీ అదే కథతో వచ్చి అలరించిన సినిమాలు ఒకటో రెండో కాదు… ఎన్నెన్నో ఉన్నాయి. ‘దేవదాసు’ 1953లో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని, సావిత్రి నటన, సముద్రాల పాటలు, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం, సీఆర్ సుబ్బురామన్ సంగీతం ‘దేవదాసు’ను అపురూప చిత్రాల జాబితాలో చిరస్థాయిగా నిలబెట్టాయి. మళ్లీ 21 సంవత్సాలకు కృష్ణ, విజయ నిర్మల జంటగా ‘దేవదాసు’ను మళ్లీ నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు బాగున్నప్పటికీ.. ఏయన్నార్ ‘దేవదాసు’ ముందు తేలిపోయింది. చివరికి పరాజయం మూటగట్టుకుంది.
రేలంగి, అంజలీదేవి జంటగా 1953లో వచ్చిన ‘పక్కింటి అమ్మాయి’ సినిమా ఆనాటి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. 1981లో చంద్రమోహన్, జయసుధ కాంబినేషన్లో అదే కథతో, అదే టైటిల్‌తో విడుదలైన ‘పక్కింటి అమ్మాయి’ ప్రేక్షకులను అలరించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు చక్రవర్తి ఇందులో కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ‘పక్కింటి అమ్మాయి’ మంచి విజయం సాధించింది.
ఇలా చెబుతూ వెళ్తే.. పాత కథతో, దాదాపు అదే కథనంతో వెండితెరపై అలరించిన సినిమాలు కొల్లలుగా కనిపిస్తాయి. కృష్ణ, విజయనిర్మల జంటగా వచ్చిన ‘మీనా’ అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా విజయనిర్మల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 1973లో విడుదలైంది. 43 ఏండ్ల తర్వాత ఇదే కథను కాలానుగుణంగా కొంత మార్చి ‘అ.. ఆ’గా అందించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ 1959లో విడుదలైంది. తొలుత తమిళ భాషలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. తర్వాత పుష్కర కాలానికి 1971లో బాపు దర్శకత్వంలో శోభన్‌బాబు రాముడిగా వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ‘లవకుశ’ అపురూప చిత్రంగా నిలిచిపోయింది. బాపు, బాలకృష్ణ కాంబోలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ కథ కూడా లవకుశులదే!
ఇలా ఎన్నెన్నో సినిమాలు మళ్లీ మళ్లీ వచ్చి.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో 1960లో ‘హరిశ్చంద్ర’ సినిమా వచ్చింది. 1965లో ఎన్టీఆర్ హీరోగా ‘సత్యహరిశ్చంద్ర’ మళ్లీ వచ్చింది. విజయ్‌చందర్ సాయిబాబాగా నటించిన ‘శ్రీషిర్డీ సాయిబాబా మహత్యం’ సినిమా 1986లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని పాటలు అమృతాన్ని పంచాయి. మళ్లీ నాగార్జున, రాఘవేంద్రరావు కాంబోలో 2012లో ‘శిరిడిసాయి’ విడుదలైంది. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడం గమనార్హం. ‘భట్టివిక్రమార్క’, ‘విక్రమార్క విజయం’ రెండూ ఒక తాను ముక్కలే! బాపు దర్శకత్వంలోనే వచ్చిన ‘బంగారు పిచుక’, ‘పెళ్లికొడుకు’ రెండు సినిమాల కథా ఒకటే! హిందీ ‘డాన్’ రీమేక్‌గా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా ‘యుగంధర్’ ఓ ట్రెండ్ సెట్ చేసింది. మళ్లీ ఇదే కథను ‘బిల్లా’ పేరుతో ప్రభాస్ హీరోగా పునర్ నిర్మించారు. ఇది కూడా విజయవంతమైంది.
తెలుగు తెర అదృష్టంగా భావించే చిత్తూరు నాగయ్య నటించిన ఎన్నో సినిమాలు తర్వాతి కాలంలో మళ్లీ రూపుదిద్దుకున్నాయి. ఆయన నటించిన ‘భక్త పోతన’, ‘త్యాగయ్య’, ‘రామదాసు’, ‘యోగి వేమన’ చిత్రాలు కొన్ని దశాబ్దాల తర్వాత పునర్ నిర్మితమయ్యాయి. ‘భక్త పోతన’ గుమ్మడి ప్రధాన పాత్రగా మళ్లీ రూపుదిద్దుకుంది. అయితే ఇది పరాజయం పాలైంది. ఇక రెండో ‘త్యాగయ్య’లో సోమయాజులు ప్రధాన పాత్ర పోషించాడు. దీనికి బాపు దర్శకత్వం వహించాడు. నాగయ్య నటించిన ‘యోగి వేమన’ కథతో కొన్ని దశాబ్దాల తర్వాత విజయ్‌చందర్ హీరోగా ‘శ్రీవేమన చరిత్ర’గా విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడిందంతే! నాగయ్య జీవితాన్ని అతలాకుతలం చేసిన సినిమా 1964లో వచ్చిన ‘రామదాసు’. ఈ చిత్రానికి నాగయ్యే దర్శక, నిర్మాత. ఆయన మీద అభిమానంతో ఎన్టీఆర్, ఏయన్నార్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. అయినప్పటికీ ఈ సినిమా నాగయ్యను నిలబెట్టలేకపోయింది. మళ్లీ 42 సంవత్సరాలకు రామదాసు కథతోనే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీరామదాసు’ చరిత్ర సృష్టించింది. ఇందులోనూ ఏయన్నార్ నటించడం విశేషం.
ఇదండీ మళ్లీ మళ్లీ వచ్చిన సినిమాల కథాకమామిషు. తరచి చూస్తే ఈ తరహా చిత్రాలు మరిన్ని దొరుకుతాయి. కొన్ని అప్పుడు విజయవంతమై ఆ తర్వాత పరాజయం పాలయ్యాయి. మరికొన్ని అప్పట్లో పరాజయం చెంది.. మళ్లీ నిర్మించిప్పుడు హిట్టు కొట్టాయి. అయితే, తెలుగు సినిమాను ప్రేమించే సగటు ప్రేక్షకుడు మళ్లీ రావాలని కోరుకునే చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనవి మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్. తెలుగు సినిమా కీర్తి పతాకను రెపరెపలాడించిన ఈ చిత్రరాజాలను మళ్లీ ఎవరైనా తీయకపోతారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సాహసం ఎవరు చేస్తారో చూడాలి!!