LXME | పురుషుడితో సమానంగా ఉద్యోగం చేస్తున్నా, ఆయనగారితో పోటీపడి సంపాదిస్తున్నా.. ఇల్లాలికి ఇంకా ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు. ఇంటి బాధ్యతలను సింహభాగం పంచుకుంటున్న ఇంతికి.. తన సంపాదనలో ఎంత భాగం, ఎందుకు ఖర్చవుతున్నదీ తెలియడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికలపై తెగువ చూపలేకపోతున్న మగువలకు అండగా నిలుస్తున్నది.. బీయింగ్ ఎల్ఎక్స్ఎమ్ఈ (బీ యువర్ ఓన్ లక్ష్మి) యాప్.
పీజీ పట్టా అందుకున్నా, ఐదంకెల జీతం సంపాదిస్తున్నా.. ఆర్థిక విషయాల్లో అతివలు వెనుకంజలోనే ఉన్నారు. బ్యాంకు ఖాతాలో రొక్కం నికరంగా పెరుగుతున్నా, ఆ మొత్తాన్ని ఏం చేయాలన్నదానిపై వారిలో స్పష్టత కొరవడుతున్నదని సర్వేలూ చెబుతున్నాయి. పోపుదినుసుల దగ్గర కూడా పొదుపు మంత్రం పఠించే మహిళ, మదుపు దగ్గరికి వచ్చేసరికి మగని వైపు చూస్తున్నది. సంపాదనపరుల్లో నూటికి 91 మంది మహిళలు పెట్టుబడుల విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను అంచనా వేయలేకపోతున్నారు. ఈ లోటును పూడ్చే లక్ష్యంతో ప్రీతీరాఠి ‘బీ యువర్ ఓన్ లక్ష్మి’ ఫేస్బుక్ పేజీ ప్రారంభించింది. ఇప్పుడు యాప్ రూపంలోనూ అందుబాటులో ఉంది. మహిళలకు ఆర్థిక పాఠాలు బోధించడమే ఈ అప్లికేషన్ ప్రధాన లక్ష్యం. చేతిలో ఉన్న సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? బంగారంపై మదుపు చేయొచ్చా? మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలేమిటి?.. ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు యాప్ నిర్వాహకులు. సగటు మహిళల స్పందనా బాగుంది.
‘స్త్రీ ఒక విషయాన్ని విశ్లేషించే తీరు గొప్పగా ఉంటుంది. అయితే ఆమె, ఆర్థిక వ్యవహారాలు మాత్రం తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. దీనివల్ల, డబ్బులు సంపాదిస్తున్నా.. సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. అలాంటి వారికి దిశానిర్దేశం చేయడానికే బీ యువర్ ఓన్ లక్ష్మి ప్రారంభించా’ అని చెబుతారు ప్రీతి. మొదట్లో పట్టుమని పదిమంది కూడా లేని ఈ ఫేస్బుక్ పేజీ ఇప్పుడు మొబైల్ అప్లికేషన్‌గా రూపాంతరం చెందింది. 40వేలమంది మహిళా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఫేస్బుక్ పేజీని 30వేల మంది వరకూ ఫాలో అవుతున్నారు. వీళ్లంతా పొదుపు- మదుపు విషయంలో తమ సందేహాలను ఈ వేదిక ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు. షేర్‌మార్కెట్ తీరుతెన్నులేమిటి, ఎప్పుడు పెట్టు
బడులు పెట్టాలి, పరిమిత ఆర్థిక వనరులతో ఎలాంటి వ్యాపారం చేయొచ్చు… తదితర ప్రశ్నలను అడుగుతుంటారు. నిపుణులు వాటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతుంటారు. భావసారూప్యం ఉన్నవారంతా ఆర్థిక వ్యవహారాలు చర్చించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నది ‘బీ యువర్ ఓన్ లక్ష్మి’.