భారతీయుల్లో కేవలం 45 శాతం మంది మాత్రమే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నారట. అదే జపాన్లో ఇది 83 శాతం. ఓరల్ హెల్త్ అబ్జర్వేటరీ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. చక్కెరను ఎక్కువగా తినే భారతీయులు నోటి ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఎన్నిసార్లు పండ్లు తోముకుంటున్నారనే సంగతి పక్కనపెడితే, ఎలా బ్రష్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకోవాలి.
ఆహారంలో ఉండే కార్బొహైడ్రేట్లు, చక్కెరలు నోట్లో ఉండే బ్యాక్టీరియాను ఆమ్లం ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి, తిన్న అర్ధగంట తర్వాత బ్రష్ చేసుకుంటే మంచిదని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సలహా. ఇలా చేస్తే దంతాల మీద ఆమ్లం పేరుకుపోదు. దంతాలు దెబ్బతినవు.
రెండుసార్లు కూడా ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్నే వాడాలి.
పాచి చిగుళ్ల మీద పేరుకుంటుంది. చిగుళ్ల వరుసకు 45 డిగ్రీల కోణంలో బ్రిసిల్స్ ఉంచి బ్రష్ చేసుకోవాలని దంతవైద్యుల సూచన.
ముందు వరుసలోనే కాకుండా… నాలుక వైపు ఉన్న పంటి భాగాన్నీ తోముకోవాలి. లేకుంటే నోట్లో ఊరే లాలాజలం పంటిపై పేరుకున్న పాచితో కలిసిపోతుంది. దీంతో పాచి గట్టిపడిపోయి పండ్లపై గార పడుతుంది.
నోట్లో దంతాలను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి భాగంలో కుడి వైపు నుంచి మొదలుపెట్టి ఎడమవైపు శుభ్రం చేస్తూ వెళ్లాలి. ఇలా ప్రతి భాగాన్ని 30 సెకన్లపాటు బ్రష్ చేయాలి. పంటి ముందు, వెనక, పై భాగాలు… మూడు వైపులా బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు.
పండ్ల మధ్య శుభ్రం చేసుకోవడానికి టూత్ పిక్స్ వాడకూడదు. ఫ్లాసింగ్ చేసుకోవడం మంచిది. అదీ ఫ్లాసింగ్ తాడును ఆంగ్ల అక్షరం సీ ఆకారంలో ఉండేలా పైకీ కిందికీ సున్నితంగా ఫ్లాసింగ్ చేయాలి.