సినిమా అంటే చక్కెర పూతతో కూడిన చేదు మాత్రలా ఉండాలని అంటున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఎంతటి సీరియస్ అంశాన్ని అయినా సున్నితంగా, హాస్య ప్రధానంగా చెప్పినప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్ముతారు ఆయన. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన సంగతులివి..
సినిమా ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించాలని ఫిక్సయినట్టున్నారు..
ఈ సినిమాలో కేవలం వినోదమే కాదు. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఒకవైపు కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకుంటుంది. హీరో ఎలివేషన్స్, నాటకీయత.. లాంటివి లేకుండా కథలోని పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.
ట్రైలర్లో ‘బారిష్టర్ పార్వతీశం’ నవలను చూపించారు. ఈ సినిమా కాన్సెప్ట్‌తో ఆ నవలకు ఏమైనా సంబంధం ఉందా?
అలాంటిదేమీ లేదు. నాకు బాగా ఇష్టమైన నవలల్లో ‘బారిష్టర్ పార్వతీశం’ ఒకటి. ఈ సినిమాలో చిన్న ఎపిసోడ్ కోసం ఆ నవలను స్ఫూర్తిగా తీసుకున్నాం. నాని అమెరికా వెళ్లే ఎపిసోడ్లో పంచె కట్టుకునే తీరు, ఆయన హావభావాలు కాస్త పార్వతీశాన్ని గుర్తుకుతెస్తాయి.
అసలు ఈ సినిమాకు ఎలా అంకురార్పణ జరిగింది? కథ వినగానే నాని ఏమన్నారు?
ఐదేండ్ల కిందట రాసుకున్న కథ ఇది. నా మొదటి రెండు చిత్రాల హీరో శ్రీవిష్ణుతో ఈ కథ గురించి చర్చించాను. అయితే ఆది నుంచీ ఈ కథలో నానిగారినే హీరోగా ఊహించుకున్నా. కథ వినగానే ఆయన అద్భుతంగా ఉందన్నారు. పాత్రల్లోని నిజాయతీ, అంతర్లీనంగా ఉండే సందేశం బాగా నచ్చిందని చెప్పారు. భిన్న మతాలకు చెందిన ఓ జంట కథ ఇది. మతాంతర వివాహం చేసుకున్న వారి జీవితంలో చోటు చేసుకునే సంఘటనల్ని హాస్య ప్రధానంగా చూపించాం. నాని బ్రాహ్మణ యువకుడిగా, కథానాయిక నజ్రియా ఫహద్ క్రైస్తవ అమ్మాయిగా కనిపిస్తారు. సినిమాలో కుటుంబ సంస్కృతి, సంప్రదాయాల్ని గౌరవించాలని చెబుతూనే, అదే సమయంలో ప్రగతిని నిరోధించే సంకెళ్ల నడుమ చిక్కుకుపోవద్దనే చక్కటి సందేశమూ ఉంటుంది.
నాని పాత్రను ఎలా డిజైన్ చేశారు. గతంలో ఆయన ఈ తరహా కామెడీ క్యారెక్టర్స్ చాలా చేశారు కదా?
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నాని ఇందులో కనిపిస్తాడు. పండించే హాస్యం కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదని నమ్మకంగా చెబుతున్నా. అమాయకుడైన సుందరం పాత్రలో నాని చక్కగా ఒదిగిపోయాడు. ఆయన మాటల్లో, చేష్టల్లో అమాయకత్వం కనిపించినా… మనసులో మాత్రం ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో అంతర్మథనం చెందుతుంటాడు. హృదయంలో బాధను దాచుకొని బయటికి మాత్రం చిరునవ్వులు చిందిస్తుంటాడు.
ఈ సినిమాలో హీరో నాని ఏదో ఒక శారీరక లోపంతో బాధపడుతుంటాడని అంటున్నారు. టైటిల్ కూడా అదే అర్థాన్ని స్ఫురించేలా ఉంది?
టైటిల్లో మీరు ప్రశ్నార్థకంతో పాటు ఆశ్చర్యార్థకాన్ని కూడా చూడొచ్చు (నవ్వుతూ). ఈ సినిమాలో హీరోకు సమస్య ఉందా లేదా అన్నది వెండితెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
రెండు మతాల నేపథ్య కథాంశమంటే వివాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కదా?
మతాల నేపథ్యంలో సినిమా కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. అందుకే సన్నివేశాల చిత్రీకరణ మొదలుకొని సంభాషణల వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి ద్వంద్వార్థాలు, అశ్లీలతకు తావులేకుండా సినిమాను తీర్చిదిద్దాం. సెన్సార్‌వారు క్లీన్ ‘యు’
సర్టిఫికెట్ ఇచ్చారు.
మీ గత రెండు చిత్రాల్లోనూ సీరియస్ అంశాల్ని హాస్య ప్రధానంగా తెరకెక్కించారు. దర్శకుడిగా అదే మీ బలం అనుకుంటున్నారా?
ఎంత సీరియస్ అంశాన్ని అయినా హాస్యంతో మేళవించి చెప్పగలిగితే ప్రేక్షకులకు సూటిగా రీచ్ అవుతుందని నమ్ముతాను. తెరపై బాగా నవ్వుల్ని పంచిన పాత్ర ఒక్కసారిగా సీరియస్ అయిపోతే.. ప్రేక్షకుల్లో ఓ రకమైన ఉత్సుకత క్రియేట్ అవుతుంది. ఆ పాత్ర చెప్పే మాటలు బలంగా తాకుతాయి. సినిమాలో పాత్రల్ని రాసుకునే ముందే దీన్ని ఫాలో అవుతాను.
ఈ సినిమాలో కథానాయిక పాత్ర బలమైన భావోద్వేగాలతో సాగుతుంది. కథాగమనంలో హీరోకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఆమె పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించాలంటే కథను ఆకళింపుచేసుకొని చక్కటి అభినయాన్ని ప్రదర్శించాలి. నజ్రియా ఫహద్ ప్రతిభ ఉన్న నటి. ఏ పాత్రకైనా న్యాయం చేస్తుంది. అందుకే ఆమెను ఎంచుకున్నాం.
స్వతహాగా మీరు ఎలాంటి సినిమాల్ని ఇష్టపడతారు. ఏవైనా డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయా?
ప్రతి సినిమా ద్వారా దర్శకుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తా. లేకపోతే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా.. ప్రతిదీ కొత్త ప్రాజెక్ట్‌గానే భావిస్తాను. యాక్షన్ డ్రామా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.
మీకు సాహిత్యం మీద మంచి పట్టుంది కదా… సాహిత్య ప్రధానంగా ఏమైనా సినిమాలు తీసే ఆలోచన ఉందా?
నేను సాహిత్యాన్ని ఇష్టపడతాను. శ్రీశ్రీ, రంగనాయకమ్మ రచనల ప్రభావం నాపై చాలా ఉంది. పుస్తకాల ఆధారంగా సినిమాల గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు. నేను చదివిన సాహిత్యం తాలూకు ప్రభావం మాత్రం నా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తున్నది. కథల్లో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. యువ దర్శకుడిగా ఈ ధోరణిపై మీరేమంటారు?
ఇప్పుడున్న ఓటీటీ వాతావరణంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కాస్త కష్టమైన పనే. అయితే ఎన్ని మాధ్యమాలు వచ్చినా.. ఒక సినిమాను థియేటర్లో చూసినప్పుడు పొందే ఆనందం వేరుగా ఉంటుంది. అందరితో కలిసి నవ్వుతూ, భావోద్వేగాల్ని పంచుకుంటూ సినిమా చూడటంలో అనిర్వచనీయమైన అనుభూతి ఉంటుంది. ఓటీటీల ప్రభావం వల్ల కథాంశాల ఎంపికలో నాణ్యత పెరిగింది. కొత్తదనంతో కూడిన కథలు వస్తున్నాయి.
– కళాధర్ రావు జూలపల్లి