Shriya Saran | కథ మారింది. దర్శకుడూ మారాడు. పాత్రల తీరుతెన్నులూ మారాయి. మొత్తం జట్టులో మారనిది ఎవరైనా ఉన్నారంటే అది శ్రియ మాత్రమే! అదే అందంతో, అంతే చక్కని అభినయంతో ‘దృశ్యం-2’తో ప్రేక్షకులను పలకరించింది. ‘దృశ్యం-1’ హిందీ రీమేక్‌లో తన నటనతో ఆకట్టుకున్న శ్రియ.. ఏడేండ్ల తర్వాత సీక్వెల్‌తో సీక్రెట్స్ పంచుకుందిలా..
» ‘దృశ్యం-2’లో నందిని పాత్రలో చాలా పార్శాలు ఉన్నాయి. అమాయకత్వం, గడుసుదనం, భయం, ధైర్యం ఇలా భిన్న కోణాలు కనిపిస్తాయి. ఏడేండ్ల కిందట చేసిన పాత్రను మళ్లీ అదే తరహాలో పోషించడం అంటే సవాలుతో కూడుకున్నదే! దాన్ని సమర్థంగా నిర్వర్తించాననే అనుకుంటున్నాను. ఈ కాలంలో నందిని ఎలా మథనపడి ఉంటుందన్నదీ దృష్టిలో ఉంచుకొని నా పాత్రను పోషించాను.
» ‘దృశ్యం-2’ సెట్లో దర్శకుడు నిశికాంత్ కామత్‌ను చాలా మిస్ అయ్యాం. ఆయన లేని లోటు తీర్చలేనిది. ‘దృశ్యం-1’కి ఆయనే దర్శకుడు. ‘దృశ్యం-2’ను దర్శకుడు అభిషేక్ పాఠక్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అయితే, నిశికాంత్ ఎక్కడున్నా మా ప్రయత్నానికి సంతోషిస్తూ ఉంటాడని అనుకుంటున్నాం.
» చాలామంది ఆడపిల్లల్లా నేను సిగ్గరిని కాదు. మాట్లాడకుండా అస్సలు ఉండలేను. సినిమాలో నందినిలా కాస్త హడావుడి మనిషినే! నా సహజ స్వభావానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. అందుకే ఆడుతూపాడుతూ చేశాను. కాకపోతే, నాలో అంతర్గతంగా ఉన్న ఏదో బాధ ఈ పాత్ర పోషణకు సాయపడిందేమో అనిపిస్తూ ఉంటుంది.
» ఇద్దరు పిల్లలకు తల్లిలా నటించాను కాబట్టి ఇక కెరీర్ చరమాంకానికి వచ్చింది అనుకోకండి. ఇలాంటి విషయాలు నేనస్సలు పట్టించుకోను. కథ బాగుండాలి, పాత్ర నచ్చాలి. ఒక నటిగా ఎలాంటి పాత్రలైనా పోషించాలి.
» ఎందుకో తెలియదు కానీ, కెరీర్ ప్రారంభంలో హిందీ చిత్రాల్లో అవకాశాలైతే పెద్దగా రాలేదు. బహుశా నా కష్టం సరిపోలేదేమో! వెనక్కి తిరిగి చూసుకుంటే బోలెడన్ని కారణాలు కనిపిస్తాయి. అదే సమయంలో దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు రావడంతో ఇక్కడే స్థిరపడ్డాను.
» ప్రస్తుతం కిచ్చా సుదీప్, ఉపేంద్రతో కలిసి ‘కబ్జా’ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నాను. శర్మన్ జోషి ‘మ్యూజిక్ వరల్డ్’తోపాటు మరిన్ని చిత్రాలు చేస్తున్నాను.
“Shriya Saran | వయస్సు పెరిగినా తరగని శ్రియా సరన్ అందచందాలు..”