పెండ్లికి ముందు, తర్వాత.. చాలామంది మహిళలు అమాంతం బరువు పెరిగిపోతారు. ఆ మార్పు కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొంటారు. ఆత్మన్యూనతకూ గురవుతారు. ఒక్కోసారి వారికి సరిపడా దుస్తులు మార్కెట్లో లభించవు. అలాంటివారిని ఏకం చేసేందుకు ఫ్యాషన్ బ్రాండ్ ‘వెస్ట్‌సైడ్’ ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటి సమీరారెడ్డితో పోడ్కాస్ట్ ఎపిసోడ్స్‌ను వీక్షకుల ముందుకు తెచ్చింది. ఆ కార్యక్రమం పేరే.. లిమిట్లెస్ విత్ సమీరారెడ్డి!
‘జీవితం అంటే మనం చేసే ప్రతిపనినీ పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనదైన శైలిలో ఎదిరించి దూసుకెళ్లడం’ అంటున్నది నటి సమీరారెడ్డి. తను మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ‘లిమిట్లెస్ విత్ సమీరారెడ్డి’ పోడ్కాస్ట్కు విశేషస్పందన లభిస్తున్నది. బాధలు, కష్టాలు, అవమానాల్లో కూడా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో ఈ కార్యక్రమం వివరిస్తుంది.
‘లిమిట్లెస్’ మొదటి ఎపిసోడ్లో సహనటి స్వస్తిక ముఖర్జీతో కలిసి తన అంతరంగాన్ని ఆవిష్కరించింది సమీర. జీవితం, సవాళ్లు, ఒత్తిళ్లు, అందం వంటి అనేక విషయాలు ఇద్దరి మధ్యా ప్రస్తావనకు వచ్చాయి. ఆ చర్చను ఎంతోమంది స్వాగతించారు. ఈ సందర్భంగా తమ జీవితంలో ఎదురైన ఒడు దొడుకులను పంచుకున్నారిద్దరూ. బాడీ షేమింగ్, బాడీ పాజిటివిటీ, సెల్ఫ్‌లవ్ వంటి అంశాలనూ ప్రస్తావించుకున్నారు. సమాజంలోని మూసను బద్దలుకొట్టడంపై విస్తృతంగా చర్చించారు. ముగ్గురు తోబుట్టువులలో చిన్నదైన సమీరారెడ్డి చిన్నప్పటి నుంచీ బొద్దుగా ఉండేది. దీంతో ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొన్నది. ఆ కసితో తన అక్కల్లా స్లిమ్‌గా మారేందుకు కఠోర సాధన చేసింది. బరువు తగ్గి హీరోయిన్గా రాణించింది. పెండ్లి, పిల్లల తర్వాత.. మళ్లీ లావు పెరిగినట్టు చెప్పు కొన్నది. ఎవరెన్ని మాటలన్నా.. లెక్కచేయకుండా, ఏమాత్రం కుంగిపోకుండా.. జీవితంలో ముందుకు సాగుతున్నానంటూ మనోగతాన్ని ఆవిష్కరించింది.
తమలాంటి వారికి ఓ వేదిక కల్పించి.. ధైర్యం చెప్పేందుకే ఈ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది సమీరారెడ్డి. ప్రతి ఒక్కరూ తమను తాము వ్యక్తీకరించుకునేలా ప్రోత్సహించడం, అందరినీ ఓ జట్టుగా నిలబెట్టడమే ‘లిమిట్లెస్’ పోడ్కాస్ట్ లక్ష్యమని వివరించింది. మూసను బద్ధ్దలుకొట్టి.. వృత్తి, ఫ్యాషన్, అందం వంటి విషయాల్లో వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తక్షణ లక్ష్యమంటున్నది సమీర. ఈ కార్యక్రమం అమెజాన్ మ్యూజిక్ సహా వివిధ వేదికలపై స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చర్చలు నవతరం యువతుల హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి.