పండుగ షాపింగ్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి క్రెడిట్ కార్డు ఓ మంచి సాధనమని చెబుతారు
పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల మీద ఆన్లైన్లో ఐదు నుంచి పదిహేను శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వడ్డీలేని నెలసరి సమాన వాయిదా (ఈఎమ్ఐ) అవకాశాన్నీ ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు తగ్గింపు డెబిట్ కార్డులకూ వర్తిస్తుంది. కాకపోతే, షాపింగ్ మొదలుపెట్టడానికి ముందే ఎక్కడెక్కడ భారీ డిస్కౌంట్లు దొరుకుతున్నాయన్నది పరిశోధించాలి. మన క్రెడిట్‌కార్డు బిల్లు తేదీ పూర్తయిన వెంటనే షాపింగ్ చేస్తే.. బిల్లు చెల్లింపు కోసం నలభై అయిదు రోజుల వ్యవధి దొరుకుతుంది. కొంతకాలం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇది కూడా పరోక్షంగా డిస్కౌంట్ లాంటిదే. ఏ మాల్కో వెళ్లి ఆఫ్‌లైన్‌లో నచ్చిన వస్తువులను ఎంచుకుని, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం మరో పద్ధతి. దీనివల్ల ప్రత్యక్షంగా చూసి ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇరవై నుంచి ఇరవై అయిదు శాతం డిస్కౌంట్నూ ఎంజాయ్ చేయవచ్చు. నేరుగా ఆయా బ్రాండ్స్‌కు సంబంధించిన సైట్స్‌లోకి వెళ్లకుండా.. థర్డ్ పార్టీ సైట్లో కొంటే, మరింత డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంటుంది.