K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
కాకతీయ యూనివర్సిటీలో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కే-హబ్ వృథాగా మారింది.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 2 : కాకతీయ యూనివర్సిటీలో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కే-హబ్ వృథాగా మారింది. మూడేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. కేయూ వీసీ, రిజిస్ట్రార్ కే-హబ్ పేరిట కోట్ల రూపాయాల ధనం వృథాగా ఖర్చు చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరమైన కేయూలో కే-హబ్ పేరిట కోట్ల రూపాయాలు కాంట్రాక్టర్, అధికారుల చేబుల్లోకి తప్పా విద్యార్థులకు ఉపయోగపడింది లేదని వాపోతున్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించడం, ఉపాధి అవకాశాలకు వారిని అనుసంధానం చేయడం వంటి లక్ష్యాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాకతీయ యూనివర్సిటీ కే-హబ్ భవనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా, ఆశించినస్థాయిలో కార్యకలాపాలు ఎందుకు ప్రారంభం కాలేదనే ప్రశ్నలు వర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ హయాంలో ‘రుసా’ నిధులతో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో కే-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు గతంలో వెల్లడించారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఇన్క్యుబేషన్, కెరీర్ గైడెన్స్, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఈ కేంద్రం మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగంలోకి రాలేదనే అంశంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుసా ద్వారా వచ్చిన నిధుల లక్ష్యం నెరవేరుతోందా..? కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనం విద్యార్థులకు ఎంతమేరకు ఉపయోగపడుతోంది..? అనే ప్రశ్నలకు వర్సిటీ యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ రూ.2 కోట్ల ఖర్చు ఎందుకు..?
కే-హబ్ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా భవనం లోపల కొన్ని నిర్మాణాలను తొలగించి, హాళ్లు, గదుల్లో మార్పులు, మరమ్మతులు చేపట్టి అదనంగా సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన భవనంలో కొద్ది కాలానికే అంతర్గత నిర్మాణాలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? అసలు నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా..? లేక అవసరాలకు అనుగుణంగా డిజైన్ మార్పులు చేశారా..? ఈ పనులకు ఎవరి అనుమతి ఉంది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.2 కోట్ల అదనపు వ్యయానికి సంబంధించిన అంచనాలు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు, టెండర్ వివరాలు, కాంట్రాక్టర్ వివరాలు, బిల్లులు వంటి సమాచారాన్ని వర్సిటీ బహిర్గతం చేస్తే ఈ వ్యవహారంపై నెలకొన్న అనుమానాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒక్క వర్క్‌షాప్‌తో సరిపెట్టారా..?
ఇటీవల విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం పేరుతో కే-హబ్ నిర్వాహణలో చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు విద్యార్థులు కే-హబ్ బిల్డింగ్ లోపలికి పోలేదు. అయితే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయా..? విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు కే-హబ్ సేవలు అందుబాటులో ఉన్నాయా..? అనే ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. భవనాన్ని క్రమం తప్పకుండా వినియోగించకుండా కేవలం అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కే-హబ్ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందా అనే చర్చ జరుగుతోంది.
తాళాలు వేసి ఉంటే నిర్వహణ ఎలా?..
కే-హబ్ భవనం గత కొంతకాలంగా పూర్తిస్థాయిలో వినియోగంలోలేక తాళాలు వేసి ఉండటంతో గదుల్లో తేమ, ఫంగస్ ఏర్పడి మళ్లీ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనం నిరంతరం వినియోగంలో ఉంటేనే దాని ప్రయోజనం ఉంటుంది. లేకపోతే నిర్వహణ లోపాలతో భవనం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిర్మాణాలు, మరమ్మతుల పేరుతో అదనపు వ్యయం జరిగిన నేపథ్యంలో భవనం నిర్వహణపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పట్లో కే-హబ్ బిల్డింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ సామాన్లు మాయమైనట్లు కూడా చర్చ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వాటిని సరిచేసే క్రమంలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
‘రుసా’ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కేయూలో కే-హబ్ నిర్మాణానికి ‘రుసా’ నిధుల సద్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కే-హబ్ నిర్మాణానికి వచ్చిన రుసా నిధులు, ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం, నిర్మాణ పనులు, అదనంగా చేపట్టిన రూ.2 కోట్ల పనులు, పరికరాల కొనుగోలు, ప్రస్తుతం వాటి పరిస్థితి, నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, భవనం వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను కాకతీయ యూనివర్సిటీ అధికారులు ప్రజల ముందుంచాలని పలువురు కోరుతున్నారు. ‘మళ్లీ’ రూ.2 కోట్లు అదనంగా ఖర్చు చేయడంపై రుసా నిధులు దారిమల్లినట్లు విమర్శలు వస్తున్నాయి.
అవసరమైతే కే-హబ్‌కు సంబంధించిన నిధుల వినియోగం, నిర్మాణ పనులు, పరికరాలు, ప్రస్తుత కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయాలతో నిర్మించిన కే-హబ్ విద్యార్థులకు, యువతకు ఉపయోగపడేలా నిరంతర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందా..? లేక మరో ప్రతిష్టాత్మక భవనంగా మాత్రమే మిగిలిపోతుందా..? అన్నది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశంగా మారింది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

