బచ్చన్నపేట సెప్టెంబర్ 25 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని చేర్యాల రోడ్లో దశాబ్దాల నాటి పాత బస్ స్టాండ్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరుకుని కూలిపోయింది. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాత బస్ స్టాండ్ స్థానంలో వెంటనే ఆధునిక సౌకర్యాలతో కూడిన మినీ బస్ స్టాండ్ నిర్మించాలని ఫైట్ ఫర్ బచ్చన్నపేట సభ్యులు డిమాండ్ చేశారు.
బచ్చన్నపేట ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, మినీ బస్ స్టాండ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. బచ్చన్నపేట ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచే ఈ పనికి అధికారులు సహకరించి, వీలైనంత త్వరగా మినీ బస్ స్టాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఫైట్ ఫర్ బచ్చన్నపేట బృందం విజ్ఞప్తి చేసింది.