కాశీబుగ్గ, మే 24 : వానకాలం సాగుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రైతులు వరి పంటలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వరిలో కూడా పలు రకాల విత్తనాలు ఉంటాయి. ఈ క్రమంలో రైతులు సాగుచేసుకోవడానికి అనువైన వరి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పలు రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
డబ్ల్యూజీఎల్-1119 : ఈ రకం పంట కాలం 115-120 రోజుల మధ్య ఉంటుంది. సన్న గింజ కలిగి ఉండి వివిధ రకాల ఉల్లికోడు బయోటైప్లను(1,2, 4ఎం) సమర్థవంతంగా తట్టుకుంటుంది. కొంత వరకు పొట్టకుళ్లు తెగులు, మెడ విరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. ఒక ఎకరానికి 24 నుంచి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
డబ్ల్యూజీఎల్-962 : ఇది సాంబ మసూరికి(బీపీటీ5204) ప్రత్యామ్నాయ సన్నగింజ రకం. 120-125 రోజుల మధ్య పంట వస్తుంది. మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటుంది. కొంత వరకు అగ్గి తెగులు, మెడ విరుపు తెగులును తట్టుకుంటుంది. మంచి గింజతో నాణ్యత కలిగి ఉంటుంది. ఒక ఎకరానికి 26-28 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
డబ్ల్యూజీఎల్-1246 : ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న స్వల్పకాలిక (125-130 రోజులు), సన్న గింజ రకం. మెడ విరుపు తెగులు, సుడి దోమను కొంత వరకు తట్టుకుంటుంది. పొట్టకుళ్లు, కంకివల్లి, గింజ మచ్చ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. మంచి గింజ, అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. ఎకరానికి 28-30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే సామర్థ్యం కలదు.
డబ్ల్యూజీఎల్-44(సిద్ధి) : అధిక దిగుబడినిచ్చే (ఎకరానికి 28-30 క్వింటాళ్ల ) సామర్థ్యం కలిగి ఉన్న దీర్ఘకాలిక (140-145 రోజులు) సన్నగింజ రకం ఇది. ఉల్లికోడు (బయోటైప్-1)ను తట్టుకుంటుంది. కొంత వరకు చేడును కుడా తట్టుకుంటుంది. మంచి అన్నం, గింజ నాణ్యత కలిగి ఉంటుంది. ఎక్కువ ఎత్తు పెరిగి, చేను మీద పడిపోదు. బాగా దుబ్బు చేసే గుణం ఉంటుంది. సాంబ మసూరి కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది. సాంబమసూరి కన్నా వారం రోజుల ముందే కోతకు వస్తుంది. పైన తెలిపిన రకాల విత్తనాల కోసం రైతులు నేరుగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి వచ్చి కొనుగోలు చేయవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం 9949317565 నంబర్లో సంప్రదించాలని కోరారు.
డబ్ల్యూజీఎల్-1487 : ఈ రకాన్ని జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా రూపొందించారు. దీని పంటకాలం 135 రోజులు. తక్కువ భాస్వరం లభ్యత కలిగిన నేలల్లో సాగు చేయడానికి అనుకూలమైన రకం. తక్కువ భాస్వరం కలిగిన నేలల్లో కూడా 26-28 క్వింటాళ్లు పండించవచ్చని పరిశోధనలో తేలింది. సుడిదోమ, అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. మంచి నాణ్యత కలిగి ఉన్న సన్న గింజ రకం.
డబ్ల్యూజీఎల్-915 : ఇది వానకాలంలో సాగుకు అనుకూలమైన మధ్యకాలిక (135 రోజులు) దొడ్డు గింజ రకం. సుడిదోమ, అగ్గి తెగులుతోపాటు టుంగ్రో వైరస్ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. డ్రమ్ సీడర్ నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుకు అనువైన రకం. అటుకులు, మరమరాలు తయారీకి అనుకూలం. ఎకరాకు 30-32 క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలదు.