వృక్షాలకు శ్రీ రామ రక్ష
ఆ మహా టేకు వృక్షాలకు ‘శ్రీరామ లక్ష్మణ’ నామాలే రక్షగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వందేళ్ల క్రితం పూర్వీకులు రెండు టేకు చెట్లకు రామలక్ష్మణుల పేరు పెట్టగా ఇప్పుడవి దేవతావృక్షాలై స్మగ్లర్ల బారి నుంచి తమను తామే కాపాడుకుంటున్నాయి.
- టేకు మహావృక్షాలకు రామ లక్ష్మణుల పేర్లు
- వందేళ్ల క్రితం పేరు పెట్టిన కమలాపూర్ గ్రామ పూర్వీకులు
- ఆ నామాలే కాపాడుతున్నాయంటున్న స్థానికులు
- కమలాపూర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రత్యేక ఆకర్షణగా టేకు చెట్లు
- రామ లక్ష్మణులను చూసి తరిస్తున్న పలు ప్రాంతాల ప్రజలు
ఆ మహా టేకు వృక్షాలకు ‘శ్రీరామ లక్ష్మణ’ నామాలే రక్షగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వందేళ్ల క్రితం పూర్వీకులు రెండు టేకు చెట్లకు రామలక్ష్మణుల పేరు పెట్టగా ఇప్పుడవి దేవతావృక్షాలై స్మగ్లర్ల బారి నుంచి తమను తామే కాపాడుకుంటున్నాయి. కమలాపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ చెట్లను స్థానికులు ఎంతో అపూర్వంగా చూసుకుంటుండగా, వాటి గురించి తెలిసిన వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసి తరిస్తున్నారు. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు సైతం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
వృక్ష జాతుల్లో టేకుకు ప్రత్యేక స్థానం ఉంది. గృహావసరాలకు ఎక్కువగా టేకు కలపనే వినియోగిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి అడవుల్లో కొన్ని దశాబ్దాల క్రితం వరకు విరివిగా టేకు వృక్షాలుండేవి. కలప స్మగ్లర్ల వేటుకు ఆ వృక్షాలన్నీ కనుమరుగైపోయాయి. భూపాలపల్లి మండలం కమలాపూర్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో వందేళ్ల పైబడి వయస్సున్న రెండు టేకు వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ టేకు వృక్షాలు ఒకే చోట ఉండగా, వాటికి కమలాపూర్ పూర్వీకులు రామ లక్ష్మణుల పేర్లు పెట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. దేవతామూర్తుల పేర్లు ఉండడం వల్లే ఈ టేకు చెట్లకు ఎవరూ హాని తలపెట్టలేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు అవి మహా వృక్షాలయ్యాయి. వాటి సంరక్షణకు అటవీ శాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ వస్తున్నది. రామ లక్ష్మణ టేకు మహా వృక్షాలను చూసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు తరచూ వస్తుంటారు. 2022, మే 31న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రామలక్ష్మణ టేకు మహా వృక్షాలను సందర్శించారు.
ఇంత పెద్ద టేకు చెట్లు వేరేవి లేవు
మా ఊరి పక్కపొంటి జంగల్లో ఉన్న పెద్ద టేకు చెట్లకంటే వేరేవి ఎక్కడా లేవు. ఈ పెద్ద చెట్లు నా ఎరుకకన్నా ముందే ఉన్నాయి. నాకిప్పుడు 80 ఏళ్లు ఉన్నాయి. అంటే అవి దాదాపు వందేండ్ల కన్నా ముందువే. ఈ చెట్లకు దేవుళ్ల పేర్లను మా గ్రామ పూర్వీకులు పెట్టారు. రామ లక్ష్మణుల పేర్లు పెట్టడం వల్లనే వాటి జోలికి ఎవరూ పోలేదు. లేకుంటే వాటిని ఏనాడో నరికేసేటోళ్లు. రామ లక్ష్మణ దేవుళ్ల దయ వల్లనే ఆ టేకు చెట్లు ఇంత పెద్ద వృక్షాలు అయ్యాయి. ఇంత పెద్ద వృక్షాలను నెనెక్కడా చూడలేదు.
– బోండ్ల ఐలయ్య, కమలాపూర్
రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
కమలాపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రామలక్ష్మణ పేర్లతో ఉన్న రెండు టేకు మహా వృక్షాల వయస్సు వందేళ్ల పైబడే ఉంటుంది. ఆ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా చేశాం. చుట్టూ నీటి సౌకర్యం ఉండేందుకు కాంటూర్ కందకాలు తీయించాం. వాటి రక్షణ కోసం బేస్ క్యాంప్ సిబ్బందిని నియమించాం.
– బీ లావణ్య, డీఎఫ్‌వో,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా ఈ చెట్ల కాడికి వచ్చి చూసేటోళ్లు
నాకిప్పుడు 80 ఏండ్లు ఉన్నాయి. నేను 40 ఏండ్లు అటవీ వాచర్గానే పని చేశా. అడవులను కాపాడిన. రామలక్ష్మణ టేకు చెట్లను కాపాడే బాధ్యత తీసుకున్నా. రామ లక్ష్మణుల పేర్లతో టేకు చెట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అవి వందేండ్లకన్నా ముందటివే. అప్పుడు అడవిలో టేకు చెట్లు బాగానే ఉండేవి. స్మగ్లర్లు టేకు చెట్లను నరికి కోపులు పెట్టి అమ్మేటోళ్లు. కానీ రామ లక్ష్మణ పేర్లున్న ఈ టేకు చెట్లను మాత్రం ఎవ్వరూ ముట్టుకునే సాహసం చేయలేదు. జంగ్లాత్ ఏ పెద్ద ఆఫీసర్ భూపాలపల్లికి వచ్చినా కమలాపూర్ అడవిలో ఉన్న ఈ పెద్ద టేకు చెట్ల కాడికి వచ్చి చూసేటోళ్లు. ఈ చెట్లకు రామ లక్ష్మణుల పేర్లు పెట్టారని తెలుసుకొని పెద్దాఫీసర్లు ఆశ్చర్యపోయేటోళ్లు. ఈ చెట్లను మన ముందుతరం వారు కూడా చూసేలా కాపాడాలని చెప్పేటోళ్లు. రెండు మూడు రోజులకోసారి ఈ చెట్లకాడికి పోయి చూసి వచ్చేటోన్ని.
– ఎండీ అంకూస్, రిటైర్డ్ వాచర్, కమలాపూర్
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
చెట్లను, పూలను పూజించి అందులో దేవుళ్లను కొలువడం మన సంస్కృతి. కమలాపూర్ అడవుల్లో ఒకే దగ్గర ఉన్న రెండు టేకు చెట్లకు రామ లక్ష్మణులు అని పూర్వీకులు పేర్లు పెట్టారు. అందుకే ఇవి ఇంత పెద్ద చెట్లయ్యాయి. మా గ్రామస్తులమంతా వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంత పెద్ద టేకు చెట్లు ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా ఊరివాళ్ల కోరిక. మా ఊరి నుంచి టేకు చెట్ల దాకా రోడ్డు వేస్తామని మంత్రి చెప్పారు.
– ముద్దమళ్ల భార్గవ్, కమలాపూర్, భూపాలపల్లి రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

