కంటివెలుగు శిబిరాలు ఐదో రోజూ జోరుగా కొనసాగాయి. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులు పరీక్షలు, అద్దాలు తీసుకునేందుకు వచ్చిన వారితో కిటకిటలాడాయి. కంటి సమస్యలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన కంటివెలుగు.. చాలా మంచి కార్యక్రమమని ప్రజలు కితాబునిస్తున్నారు. దూరం, దగ్గరి చూపుతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతికి రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు చేయిస్తూ ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడుతున్నారు. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వాడవాడనా క్యాంపులు ఏర్పాటుచేయడం వల్ల దూరం వెళ్లే బాధ తప్పిందని, వైద్యులు, సిబ్బందితో కూడా చాలా ఓపికగా పరీక్షలు చేస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
ఇబ్బంది లేకుంట చేశిండు..
మరిపెడ : ఇప్పుడు కండ్లు కనవడక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నరు. పరీక్షల కోసం దూరం పోలేక ఆగమైతున్నరు. పైసలు పట్టుకొని ప్రైవేట్ దవాఖానకు పోయినా సక్కగ సూత్తలేరు. ఇప్పుడా రంది లేకుంట వాళ్లందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా అయితాండు. ఇప్పుడు ఊళ్లెనే క్యాంపులు పెట్టి పరీక్షలు చేయిస్తున్నడు. నేను కూడా పోయి కంటివెలుగు పరీక్షలు చేయించుకున్న. సర్కారోళ్లు కంటివెలుగు పరీక్షలు మంచిగ జేత్తున్నరు. ప్రజల దగ్గరికే కంటివెలుగు పరీక్ష కేంద్రాలు తెచ్చి సీఎం కేసీఆర్ చాన మంచి పని చేశిండు.
– కేతిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎర్జర్ల, మరిపెడ మండలం
కంటివెలుగు మంచి కార్యక్రమం
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటివెలుగు మంచి కార్యక్రమం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ కంటి చూపు సమస్య ఉంది. కానీ చాలామంది దవాఖానకు వెళ్లడం లేదు. అశ్రద్ధ చేయడం వల్ల కంటిచూపు సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి పరీక్షలు చేయిస్తుండడం శుభపరిణామం. అవసరమైన అద్దాలతో పాటు శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నారు. నేను కూడా కంటివెలుగు సెంటర్‌కు వెళ్లి టెస్టులు చేయించుకున్నా. కంటి అద్దాలు ఇచ్చారు. అధికారులు, సిబ్బంది మంచిగ చూస్తున్నరు.
– అల్లం శ్యామల, రంగశాయిపేట
పరీక్షలు మంచిగ చేస్తున్నరు..
రాయపర్తి : కంటివెలుగు క్యాంపులో డాక్టర్లు మంచిగ పరీక్షలు చేస్తున్నరు. ఒక్కో వివరం అడుగుకుంట నిదానంగా టెస్టు చేయడం మంచిగ అనిపించింది. కంప్యూటర్ మిషన్‌లో పెట్టి కూడా కండ్లను పరిశీలిస్తున్నరు. చిన్న చిన్న సమస్యలుంటే మందులతోనే తగ్గుతయని చెబుతున్నరు. నేను మా దగ్గర ఉన్న రాయపర్తి సర్కారు బడిలో పెట్టిన క్యాంపులకు పోయి పరీక్షలు చేయించుకున్నా. వేలకు వేలు పెట్టి ప్రైవేట్ దవాఖానకు పోతే కూడా ఇంత మంచిగ చూడరు. కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండు.
– కసిరబోయిన సాంబరాజు, రాయపర్తి
కేసీఆర్‌ది మంచి ఆలోచన..
కమలాపూర్ : నాకు 75 ఏండ్లు. వయసు మీద పడ్డంక కంటిసూపు తగ్గుతాంది. ఇదివరకు ప్రయివేటు దవాఖానకు పోతే 6వేలు ఖర్చు అయినయ్. మళ్ల కండ్లు మస్కవారుతానయ్. మొన్నటినుంచి సర్కారు బడిల కంటి పరీక్షలు ఫ్రీగా చేత్తాన్రని నేను కూడా పోయిన. అక్కడ డాక్టర్లు కండ్ల గురించి అన్నీ వివరంగా అడిగి పరీక్ష చేసి అద్దాలు ఇచ్చిన్రు. ప్రయివేట్ దవాఖానకు పోవాల్నంటే బస్సు ఎక్కి పట్నం పోవాలె. కిరాయిలకు, ఫీజులకు పైసల్ కావాలె. ఇప్పుడు గవేవీ అవసరం లేకుంట ఊళ్లెనే రూపాయి ఖర్చు లేకుంట పరీక్షలు చేయిత్తాండు. పెద్దమనుసులకు సూపు మంచిగ కావడానికి ఉన్న కాన్నే మంచి సౌలత్ చేశిండు. గింత మంచి ఆలోచన చేసిన కేసీఆర్‌కు దండాలు.
– బండ కనుకయ్య, భీంపల్లి, కమలాపూర్
మూడు తీర్ల పరీక్షలు చేసిన్రు..
భూపాలపల్లి రూరల్ : నాకు 60 ఏండ్లుంటయ్. ఏడాది సంది కండ్లు మంచిగ కనవడ్తలేవు. ప్రైవేట్ దవాఖానకు పోదామంటే పైసలు బాగా అయితయని పోలే. మరి ఎట్ల ఏం చేసుడని మస్తు రంది వట్టుకున్నది. ఇంతల కేసీఆర్ సారు ఫిరీగ కంటి పరీక్షలు చేయిస్తున్నడని మా ఊళ్లో అన్నరు. తెల్వంగనే క్యాంపు కాడికి పోయిన. అక్కడ మూడు రకాల పరీక్షలు చేసిన్రు. దగ్గరి సూపు సక్కగ లేదని మిషన్ల చూసిన డాక్టర్ చెప్పిండు. సార్ ఫ్రీగా నాకు మంచి కళ్లద్దాలు ఇచ్చిండు. ఆ అద్దాలు పెట్టుకుంటే మంచిగ కనవడ్తాంది. రూపాయి ఇచ్చే పని లేకుంట సర్కారోళ్లు కంటి పరీక్షలు చేసుడు మంచిగున్నది. మాలాంటి పేదోళ్లకు కంటి సూపు ఇచ్చిన ఇస్తున్న కేసీఆర్ సారు సల్లగుండాలె.
– ఎర్రవెల్లి సౌందర్య, గండ్రపల్లి, భూపాలపల్లి
కంటివెలుగుతో అందరికీ మేలు
జనగామ రూరల్ : ప్రయివేటు దవాఖానకు పోయే పనిలేకుంట మా వార్డులనే కంటి పరీక్షలు మంచిగ చేస్తున్నరు. సర్కారు పెట్టిన కంటివెలుగు కార్యక్రమం బాగుంది. పేదలకు ఖర్చులేకుంటనే ఫ్రీగా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నరు. అద్దాలు కూడా మంచిగున్నయ్. ప్రైవేట్‌కు పోతే వేల రూపాయలు ఖర్చు అయితయ్. కంటి పరీక్షలు చేయించి అవసరమున్న వారికి అద్దాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలు మరువ.
– చక్రాల పోశయ్య, 6వ వార్డు, జనగామ
మారుమూల ప్రాంతం వారికి వరం
వెంకటాపురం (నూగూరు) : ఏజెన్సీల మారుమూల ప్రాంతంలో ఉండే వారికి కంటివెలుగు కార్యక్రమం నిజంగా వరం. మేము కంటి పరీక్షలు చేసుకోవాలంటే భద్రాచలం, హనుమకొండకు పోయేటోళ్లం.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మా ఊళ్లోనే కంటివెలుగు క్యాంపు పెట్టింది. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం మంచి విషయం. నేను కూడా మొన్న పోయి టెస్టులు చేయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలు ఇచ్చారు. చాలా బాగున్నయ్. వృద్ధులు, పేదలకు ఈ కంటి వైద్య పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. కంటి సమస్య ఉన్న వాళ్లు చాలామంది క్యాంపులోనే పరీక్షలు చేయించుకుంటున్నరు.
– బొగట విజయ, వీఆర్కే పురం, వెంకటాపురం