జనగామ, డిసెంబర్ 26 : పొగమంచు అందాలు జనగామ జిల్లాలో కనువిందు చేశాయి. సోమవారం తెల్లవారుజామున వరంగల్-హైదరాబాద్ హైవేపై పరుచుకున్న మంచుదుప్పటి చూపరులకు ఆహ్లాదం కలిగించింది. దానికి తోడు చిన్నగా తుంపర్లు కూడా పడి ఉదయం పూట ఆ దారిన వెళ్లే వారికి ప్రకృతి సరికొత్త అనుభూతిని పంచింది. బారెడు పొద్దెక్కినా భానుడు ఇంకా మబ్బుల చాటునే దాక్కుంటుండడంతో లైట్ల వెలుతురులోనే ప్రయాణించాల్సి వస్తున్నది. ఒకింత చలి వణికిస్తున్నా హిమసోయగం కట్టిపడేస్తున్నది.
అరుణవర్ణమై అద్భుత దృశ్యమై..
వరంగల్, డిసెంబర్ 26 : లేలేత భానుడి కిరణాలతో నింగీనేల అరుణవర్ణ శోభితమైంది. ఓవైపు తెల్లని పొగమంచు.. మరోవైపు రోడ్డును ఎరుపుమయం చేసిన దృశ్యం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలు సోమవారం వరంగల్లోని కరీమాబాద్ ఫ్లై ఓవర్, ధర్మారం వద్ద ‘నమస్తే’ కెమెరాకు చిక్కాయి.