ధర్మసాగర్, జూన్ 28 : సాదా బైనామా పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో గ్రామపాలన అధికారులు (జీపీవో) చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాసులు ముట్టజెపితేనే ఫైళ్లకు కాళ్లొస్తాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెవె న్యూ సేవలు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో జీపీవోలను నియమించింది. అయితే వారి పనితీరు పాత వీఆర్వో వ్యవస్థలోని అవినీతిని తలదన్నేలా ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెవెన్యూ శాఖలో ఉన్న లోపాలను సరిచేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి జీపీవోల పేరుతో అధికారులను మళ్లీ నియమించింది. సాదా బైనామా పెండింగ్ కేసుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాల్సిన జీపీవోలు డబ్బులు ఇయ్యందే పనిచేయడం లేదని రైతులు అంటున్నారు.
ఫీల్డ్ విచారణ సందర్భంగా భూమికి సంబంధించిన ధ్రువ పత్రాలన్నీ సరిగా ఉన్నప్పటికీ డబ్బు లు డిమాండ్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారు అడిగినంత ఇవ్వకపోతే ఏదో వంక పెట్టి ఫైల్‌ను పక్కన పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాదా బైనామా పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లక్ష్యం నెరవేరడం లేదంటున్నారు. అవినీతికి పాల్పడుతున్న జీపీవోల వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
మధ్యవర్తులతో వ్యవహారం..
సాదా బైనామా పెండింగ్ కేసుల విచారణలో మధ్యవర్తుల ప్రమేయం ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యవర్తి ఫోన్ చేసిన వారి పైళ్లకే జీపీవోలు ప్రాధాన్యతనిస్తున్నట్లు కొందరు రైతులు అంటున్నారు. జీపీవోలు ఆయా గ్రామాలకు చెందిన వారిని మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకొని ఈ తతంగం నడిపస్తున్నట్లు చెబుతున్నారు. సాదా బైనామా పెండింగ్ లిస్ట్‌లోని రైతులకు సదరు మధ్యవర్తి ఫోన్ చేసి జాబితాలో పేరుందని, ఫైల్ ముందుకు కదలాలంటే తనను కలవాలంటూ చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.