నర్సంపేట, ఆగస్టు 27 ;ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంతో పంటల సాగు తీరు క్రమంగా మారుతోంది. కూలీల కొరత పెరుగుతున్నందున నవీన యంత్రాల కొనుగోలుకు, వినియోగానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నే నాగలి నుంచి విత్తడం, కలుపు తీయడం, పంట కోసే యంత్రాలు వ్యవసాయంలో భాగమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం కూడా సబ్సిడీపై యంత్రాలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది. నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లు ఇచ్చేందుకు సర్కారు నిధులు కేటాయించి శుక్ర, శనివారాల్లో ప్రదర్శనకు పెట్టింది. దరఖాస్తు చేసుకున్న అన్నదాతకు వీటిని ఇవ్వనున్నారు. వీటిలో కొన్నింటి పని తీరును మనం తెలుసుకుందాం.
హార్వెస్టర్
వరి పండించే రైతులకు ఒకేసారి పంట కోతల సమయంలో కూలీల కొరత ఏర్పడుతుంది. వరి కోసి పంట నూర్పేందుకు చాలా మంది కూలీలు అవసరమవుతారు. ఈ యంత్రంతో వేగంగా వరి కోయవచ్చు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. వరి నూర్పిడి యంత్రం రూ. 25 లక్షల వరకు ధర ఉంది. ఇందులో వేగంగా వరి కోసే యంత్రం కూడా ఉంది. 45 నిమిషాల్లో ఎకరం వరిని నూర్పిడి చేయవచ్చు.
భూం స్ప్రేయర్
ఒకేసారి పది నుంచి 15 సాల్లకు మందులు పిచికారీ చేయవచ్చు. పెద్ద పెద్ద చేలల్లో రోజుల తరబడి మందులు పిచికారీ చేసే రైతులు ఒకేసారి మందు పోసి స్ప్రే చేసే అవకాశం ఈ యంత్రంతో ఉంది. ఇందులో కంపెనీ సామర్థ్యాలను బట్టి ధరలు ఉన్నాయి.
డ్రోన్
డ్రోన్‌తో పంటలో పురుగు మందుల పిచికారీ చేయవచ్చు. ఇవి రైతులకు చాలా ఖర్చును తగ్గి స్తాయి. ఈ యంత్రాల్లో కంపెనీని బట్టి ధరలు నిర్ణయించారు. రూ.7 లక్షల నుంచి పది లక్షల వరకు ఉన్నాయి.
తైవాన్ స్ప్రే
మామూలు యంత్రం కన్నా, తైవాన్ స్ప్రేతో చేనులో ప్రతి మొక్కకూ మందులు స్ప్రే చేయడానికి వీలవుతుంది. వీటిని 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి ధరలను కంపెనీలు నిర్ణయించాయి. మొక్క అన్ని భాగాలు మందుతో తడిసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గడ్డి కట్టలు కట్టే యంత్రం
యంత్రాలతో వరిని కోయడం వల్ల ముక్కలుగా వస్తుంది. దీనిని కట్టలు కట్టడానికి కూలీలు అవసరమయ్యేది. ఇప్పుడు యంత్రాలే కట్టలు కట్టుతున్నాయి. కూలీల కొరతను అధిగమించేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఇందులోనూ కంపెనీ బట్టి ధరలు ఉన్నాయి.
వరి, మక్కజొన్న కోసే యంత్రం
వరితో పాటు మక్కజొన్న చేలను కోస్తుంది. గతంలో వరి, మక్కజొన్నలు కోసేందుకు వేర్వేరుగా యంత్రాలు ఉండేవి. కానీ, ఇప్పుడు రెండు ఒకేసారి కోసేందుకు ఇది అందుబాటులోకి వచ్చింది.
పవర్ టిల్లర్
చిన్న ట్రాక్టర్‌లా ఉపయోగపడుతుంది. దీనిని భూమిని దున్నేందుకు ఉపయోగించవచ్చు. పవర్ టిల్లర్ హార్స్ పవర్‌ను బట్టి ధరలు ఉన్నాయి. దీనిలో ఇంకా వేగంగా దున్న గలిగేవి కూడా ఉన్నాయి.
వరి నాటే యంత్రం
వరి నారును తెంపి ఈ యంత్రంలో వేస్తే పొలంలో నాటు వేస్తుంది. ఈ యంత్రం సామర్థ్యాన్ని బట్టి ధరలు ఉన్నాయి. ఇది రోజుకు ఏడెకరాల్లో నాటు పెడుతుంది. ఇందులోనే ఎక్కువ ఎకరాలు నాటు వేసే పెద్ద యంత్రాలు కూడా ఉన్నాయి.
పవర్ వీడర్
ఇది చేనులో కలుపును నివారించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులోనూ హార్స్వపర్, వేగాన్ని బట్టి ధరలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో ధరను నిర్ణయించాయి. పవర్ వీడర్‌తో ఎలాంటి కలుపునైనా తొలగించవచ్చు.
విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేసే యంత్రం
విత్తనాలు, ఎరువులు కలిపి వేసే యంత్రం ఇది. కంపెనీ బట్టి ధరను నిర్ణయించారు. దీనివల్ల విత్తనం, ఎరువు ఒకేసారి వేసుకోవచ్చు. ఇది రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.