సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Dec 24, 2020 , 00:31:51

చలి చంపేస్తోంది..

చలి చంపేస్తోంది..

ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

యాంటీసైక్లోన్‌తో నాలుగు రోజులుగా గజగజ

రూరల్‌ జిల్లాలో 10 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్‌

బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం

పొద్దెక్కినా పోని పొగమంచు

ఉదయం 9దాటినా నిర్మానుష్యంగానే రోడ్లు..

చలి తీవ్రతకు ఒకరి మృతి

కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 15డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం వరంగల్‌రూరల్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 10 డిగ్రీలు నమోదైంది. వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఈ నెల 17 నుంచి 21 వరకు 13, 14 డిగ్రీలు నమోదయ్యాయి. 22న ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత 10.5 నమోదైంది. 23న 14.03 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

ఆత్మకూరులో అత్యల్పంగా 8.8 డిగ్రీలు..

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో 22న అత్యల్పంగా 8.8 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఇదే రికార్డుగా చెప్పవచ్చు. జిల్లాలో 17న 16.8 డిగ్రీలు, 18న 16.6, 19న 14.1, 20న 13.2, 21న 10.1, 22న 8.8, 23న 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

మహబూబాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17న 19 డిగ్రీలు, 18న 18, 19న 16, 20వ తేదీన 15, 21న 13, 22వ తేదీన 12, బుధవారం 13 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక్కడ రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు స్పష్టం అవుతుంది. 

జనగామ జిల్లాలో 17వ తేదీన 17, 18న 18, 19న 15, 20న 15, 21న 11, 22న 10, 23న 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 13 నుంచి 17 డిగ్రీలు నమోదయ్యాయి. బుధవారం ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదైంది. ములుగు జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి 23 వరకు 12 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 నుంచి 22 వరకు ఇక్కడ ప్రతి రోజు 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల్లోని గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు.

నెగళ్లతో ఉపశమనం

పలు గ్రామాలను పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం ఎనిమిది గంటల వరకు దారి కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు రోడ్లపై పగలు కూడా లైట్ల సహాయంతో ప్రయాణిస్తున్నారు. రైతులు ఉదయం తొమ్మిది గంటల తర్వాతే పొలం పనులకు వెళ్తున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడం వల్ల రాత్రిపూట, తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో జనం ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో తెల్లవారుజామున చలి మంటలే దర్శనమిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరూ చలి మంట వద్ద కూర్చుంటున్నారు. చలి తీవ్రతతో రాత్రివేళ గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.


logo