శనివారం 06 జూన్ 2020
Warangal-city - Apr 12, 2020 , 03:00:49

కరోనా కట్టడి అందరి బాధ్యత

కరోనా కట్టడి అందరి బాధ్యత

  • కరోనా కట్టడి అందరి బాధ్యత
  • సేవానిరతులకు అండగా ఉండాలి 
  • ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి
  • ఫలితమిస్తున్న లాక్‌డౌన్‌ 
  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడి ప్రజలందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటించి, మాస్క్‌లు ధరించి వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చర్యలకు ప్రపంచమంతా హర్షిస్తున్నదని ఆయన అన్నారు. అందరి సహకారం వల్ల కొంతవరకు కరోనా ఉధృతిని ఆపగలిగామని, అయితే మరింత పట్టుదలతో ఉండాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అహోరాత్రులు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని మానసిక ధైర్యంతో నిలబడి కరోనా సేవలో పాలుపంచుకున్న వారిని సమాజం ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. వీరి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ జీతాల్లో కోత లేకుండా చూడడమే కాకుండా రూ. 5 వేలు గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు. వ్యాపార, వర్తకులు, దాతలు తమకు తోచిన విధంగా సహకారం అందివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 

తప్పిన పెనుముప్పు.. 

ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల పెనుముప్పు తప్పిందని, అయితే వైరస్‌ మొత్తం పోయేదాకా ఇంతే అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. శనివారం హన్మకొండలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని, అయితే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో కొంత మేరకు వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగించినా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అయితే ఇందు లో ఇద్దరు కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారని, మిగతా 29 మంది సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, భగవంతుని దయ వల్ల వారూ కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యం కోసం అందరం బాధ్యతగా ఉండాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సహకరించాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కార్పొరేటర్లు రంజిత్‌రావు, చాడా స్వాతి పాల్గొన్నారు. 

పండిన ప్రతిగింజనూ కొంటాం..

జనగామ, నమస్తే తెలంగాణ:పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది.., రైతులు దిగులు పడొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. శనివారం జనగామ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ రాజయ్య, కలెక్టర్‌ నిఖిల, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, పంచాయతీ, డీఆర్‌డీవో, మున్సిపల్‌ అధికారులతో కరోనా కట్టడి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న కఠిన నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు, ప్రజలు మరికొద్ది రోజులు సంయమనం పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏ ఒక్కరికీ కరోనా లేదని, కేవలం ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితోనే వైరస్‌ వ్యాప్తి చెందిందన్నారు. ఇప్పటికే 29 మంది మర్కజ్‌ కరోనా పాజిటివ్‌ బాధితులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. జనగామ జిల్లా నుంచి ఏడుగురు వెళితే వారిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న 116మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తే, దేవుడి దయవల్ల అందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు. జిల్లాలో వెంటనే టెలీమెడిసిన్‌ వైద్య సేవలను ప్రారంభించాలని వైద్యశాఖను ఆదేశించామని, కొవిడ్‌-19 నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని, వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మినా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. కరోనా కట్టడిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఉమ్మడి జిల్లాలో 835  కేంద్రాలు..

ఉమ్మడి జిల్లాలో 835 ధాన్యం, 265 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సుమారు ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు, 10.67లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందనే అంచనాతో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో నీటి లభ్యత పెరిగి ఈసారి అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయన్నారు. కరోనా వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పండించిన పంటల కొనుగోలుకు రూ.10కోట్లు ఖర్చుచేస్తే, ఒక్క తెలంగాణలో రూ.30కోట్లు మంజూరు చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకముందు కఠిన చర్యలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలన్నారు. కరోనా కట్టడి అయ్యే వరకూ ప్రజలు, వలస కార్మికులకు అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి దాతలు ముందుకు రావాలని కోరారు.  


logo