– కొత్తపల్లి పరమేశ్వరి, ఘట్కేసర్
సమస్య అనే పదం ఎప్పుడూ శాశ్వతం కాదు. అది శాస్త్రం ముందు పనికిరానిది. మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ, అది నిలబడే కాలం ఎవరికి ఎంతసేపు అనేది మనం ఆలోచించాలి. ఒక శాస్త్ర గృహం వ్యక్తి నిజాయతీని నిలబెడుతుంది. అతని అంతరాలలో నెమ్మదిగా మార్పు తెస్తుంది. ప్రకృతి చేసే మార్పునకు ఆ యజమాని కూడా తన వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తే.. తద్వారా వినూత్న విజయాలు సాధిస్తాడు. ఒక ఔషధానికి పథ్యం (ఆహార నియమం) ఎంత ఉపయోగపడుతుందో.. శాస్త్ర గృహానికి వ్యక్తి నిజాయతీ అంత తోడవుతుంది.
వాలుకు సైకిల్ నడిపినట్లు బతుకు సాఫీగా నడుస్తుంది. కాబట్టి శాస్త్ర గృహంలో సమస్య నిలబడదు. ఏదో ఒక సహకారం, సమయానికి ఒక వ్యక్తి తోడ్పాటు దొరికి పరిష్కారం లభిస్తూ సమస్యలు తొలగిపోతాయి. మనం మనకున్న శాస్త్ర తోడ్పాటు అర్థంకాక ఇంత చేసుకున్నా.. ఇంకా ఇబ్బందులు అంటూ ఆలోచిస్తాం. కానీ, పరిష్కారం తప్పక లభిస్తుంది. మంచి ఇల్లు.. మంచి ఆలోచనలు.. మనిషికి మంచి జీవితాన్ని ఇవ్వకుండా పోవు. ఈ జన్మ అనేక జన్మల కర్మఫలాల ‘మూట’.. దాన్ని నిర్వహించడం చాలాకష్టం. అయినా ఒక తీర్పు-మార్పును శాస్ర్తాలు మనకు అందించాయి.
పంట రావాలనే వరినాటు వేస్తాము. అలాగని ఆ సాగు మడులకు నీళ్లు పెట్టడం, కాపు కాయడం మానేస్తామా? అలానే మన గృహంలో మన నిత్యకార్యకలాపాలు నిజాయతీగా జరిగినా అద్భుత ఫలితాలు అందుకుంటాం. అలాంటి ఉదంతాలు ఎన్నో నిరూపణమైతేనే కానీ, ఈ శాస్ర్తాలు మన కాలం వరకూ నిలిచి నేటికీ ఆదరణ పొందుతున్నాయి. నిజం నిలకడ మీద తేలకపోవచ్చు కానీ, తేలకుండా ఉండదు. మీరు సహనంతో మీ జీవిత ప్రయాణం సాగించండి. తప్పక ఎప్పటికప్పుడు మంచి ఫలితాలతో మనుగడ సాధిస్తారు. ముక్కు ఉన్నప్పుడు జలుబు ఉంటుంది. కానీ జలుబు కోసం ముక్కు రాలేదు. జీవించడానికి ప్రాణ రూపంగా ఉంది.. వాస్తు గృహం కూడా అంతే!
– గువ్వల చంద్రం, నర్సంపేట
ఒక స్థలంలోని కొలతలను బట్టి నైరుతి, వాయవ్యం పెరిగి ఉండవచ్చు. ఆ స్థలాన్ని మూలమట్టం చేసినప్పుడు పెరిగిన మూలలు వదిలి ఇల్లు నిర్మాణం చేయాల్సి వస్తుంది. మీకు ఎదురుగా ఉన్న ఇల్లుకు నైరుతి పెరిగితే.. అది మీకు ఎప్పుడూ దోషం కాదు. మీకు తూర్పు రోడ్డు ఉంది. వారిది, పడమర ఇల్లు. వారి తరుగుదల, పెరుగుదలతో మీకు సంబంధం ఉండదు. ఒకసారి స్థలం నిర్ధారించి ‘కాంపౌండ్’ పూర్తయ్యాక.. ఆ లోపలి స్థలం, దాని నిర్మాణం ఆ ఇంటి యజమానికే చెందుతాయి. ఒకవేళ వారి దక్షిణంలో రోడ్డు ఉండి, అది మీకు తూర్పు ఆగ్నేయంలో పడుతుంటే.. అప్పుడు అది మీకు దోషం అవుతుంది. మీకు.. వీళ్లకు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉంది. కాబట్టి వారికి పెరిగిన నైరుతి స్థలం వల్ల మీ ఇంటికి ఏం ఇబ్బందీ లేదు.
– మండల భారతి, రాయగిరి
మీ ఇంటికి లిఫ్ట్ ఎటువైపు ఉంది? అనేది మీరు చెప్పలేదు. ‘పూజ’ విషయం అడిగారు కాబట్టి మీకు ఈశాన్యంవైపు ‘లిఫ్ట్’ ఉందని అర్థం అవుతున్నది. తూర్పు ఇంటి (ఫ్లాట్)కి ఈశాన్యం వైపు లిఫ్ట్ ఇచ్చి దానికి వెనుక అంటే.. ‘లిఫ్ట్’కు ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలారు. అది మీకు ఈశాన్యం అవుతుంది. ఆ సొరుగులాంటి స్థలం మీ ఇంటి ఈశాన్యం గదికి లింక్ అయి ఉంటుంది. అది మీకు బాల్కనీగా పనికి వస్తుంది. కానీ దాన్ని పూజగదిగా వాడకూడదు. ఆ చిన్న స్థలానికి ఉత్తరంలో రెయిలింగ్ పెట్టి ఓపెన్‌గా వాడాలి. దాన్ని ఫ్లాట్‌లోకి గదిలా వాడకూడదు. ఓపెన్ బాల్కనీ అయితేనే.. అది ఉపయోగవంతం అవుతుంది. అంతేకానీ పూజగదిగా.. స్టోర్ గదిగా వాడకూడదు. అది అగ్నేయం లిఫ్ట్ అయితే.. ఆ స్థలం వాడకుండా మూసివేయాలి.
– బి. అనిరుధ్, వికారాబాద్
మీరు ఎన్ని ఇండ్లు కట్టినప్పటికీ ఒక వెంచర్ సెపరేటుగా చేసినా.. పక్క వీధులను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ స్థలం మధ్యలో దక్షిణంలో వీధిపోటు పడుతుంది. కాబట్టి ఆ వీధికి నేరుగా మీ స్థలం ఆ రోడ్డుకు అభిముఖంగా ‘తూర్పు – ఉత్తర’ స్థలాలు ఏర్పాటు చేయండి. మీరు అనుకున్నట్టు ఎన్ని ప్లాట్లు వస్తే అందులో అన్ని విభజించండి. ప్రతి ప్లాట్‌లో ఇల్లుతోపాటు ఏ ప్లాట్‌కు ఆ ప్లాట్‌ను సపరేట్ చేస్తూ ‘కాంపౌండ్లు’ కట్టండి.

మీ స్థలానికి ఉత్తరం రోడ్డు ఉంది. కాబట్టి ముందు ఆ రోడ్డును కలుపుతూ లోపలి రోడ్డును ఏర్పాటు చేసి, తగిన లే అవుట్ తయారుచేసుకోండి. అన్ని ప్లాట్లు సమంగా రాకున్నా సరే.. వీధిపోటు రాకుండా ఇంటిని నిర్మించడం ముఖ్యం. ఇంటి స్థలాలు వీధులకంటే ఎత్తు ఉండేలా తయారు చేయండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143