ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీబాటిల్ను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మే 25వరకూ ఆగండి. వేలంలో గనుక మీరు ఎక్కువ పాట పాడితే గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన ఈ భారీ విస్కీబాటిల్ మీ గుమ్మంతొక్కుతుంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్. ఇందులో 444 స్టాండర్ట్ సీసాల్లో ఉన్నంత మద్యం పడుతుంది. ఈ అతిపెద్ద విస్కీ బాటిల్ మే 25న స్కాట్లాండ్లో వేలానికి రాబోతోంది. ది ఇంట్రెపిడ్ అని పిలిచే ఈ బాటిల్ 5 అడుగుల 11 అంగుళాల పొడవు ఉంటుంది. ఇందులో ది మకాల్లన్ డిస్టిలరీకి చెందిన 32 ఏళ్ల కిందటి విస్కీ ఉంది. 2021లో ఈ విస్కీని బాటిల్ చేశారు. అప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది.
దీనిని మే 25న ఎడిన్‌బర్గ్‌కు చెందిన లియోన్ అండ్ టర్న్‌బుల్ వేలం వేయనుంది. కాగా, ఈ బాటిల్ అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌గా కొత్త ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పగలదని వేలం సంస్థ భావిస్తోంది. ఈ బాటిల్ గనుక 1.9 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడపోతేనే రికార్డు సొంతమవుతుంది.