అది ఇల్లు కాదు.. ఆవుల మ్యూజియం. ఇంటినిండా గోమాత బొమ్మలే.. ఎక్కడ చూసినా ఆవుల చిత్రాలే. ఆ ఇంట్లో అడుగుపెడితే ఆవు బొమ్మలు, విగ్రహాలు, ఆవు ఫొటోలతో ఐస్ గ్లోబ్‌లు, ఆవుల చిత్రాలతో దిండ్లు, దుస్తులు, చెస్ సెట్ ఇలా ఏది చూసినా గోమాతే దర్శనమిస్తుంది. ఆఖరికి ఆ ఇంట్లో వైన్ డికాంటింగ్ సెట్‌కూడా ఆవు ప్రతిమే కావడం విశేషం. ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడుందో తెలుసా? అమెరికాలో మిన్నెసొటాలో.. ఆ ఇంట్లో మొత్తం 19,500 ఆవు సంబంధిత వస్తువులున్నాయట. వీటిని సేకరించిన మహళ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.
మిన్నెసోటాకు చెందిన రూత్ క్లోస్నర్కు ఆవు సంబంధిత వస్తువుల సేకరణ హాబీ. దీంతో గోమాత ఉన్న ఏ వస్తువు కనిపించినా కొని, ఇంటికి తీసుకొస్తుంది. అలా మొత్తం 19,500 వస్తువులను సేకరించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఆవు సంబంధిత వస్తువులను సేకరించినందుకుగానూ గిన్నిస్ రికార్డు సాధించింది. ప్రస్తుతం ఆమె తన ఇంటిని మ్యూజియంగా మార్చేసింది. త్వరలోనే గోమాత ప్రేమికుల కోసం ఇంటి సందర్శనకు అనుమతించనుంది.