శుక్రవారం 07 ఆగస్టు 2020
Tourism - Jan 26, 2020 ,

మన తెలంగాణం ఘన పర్యాటకం

మన తెలంగాణం   ఘన పర్యాటకం

ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకతలు గలది తెలంగాణ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయం. ముక్కోటి దేవతలు కొలువైన తెలంగాణ నేల..ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు. ఆకాశం నుంచి దూకే జలపాతలు...ఒక్కటేంటి ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. ఈనెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన బంగారు తెలంగాణ గడ్డ పర్యాటక ఆకర్షణలపై ప్రత్యేక కథనం. ఇది తెలంగాణ..ముక్కోటి పర్యాటకవీణ.. ఊటీని తలపించే లోయలు, అమెజాన్‌ను మరిపించే అడవులు, నయాగరాను గుర్తుకుతెచ్చే జలపాతాలు. ఇట్ల ఎన్నో ఈ మట్టి స్వంతం. భాగ్యనగరంగా పిలుచుకునే హైదరాబాద్ నుంచి పచ్చదనానికి మారుపేరుగా నిలిచిన ఆదిలాబాద్ వరకు 31 జిల్లాలు వేటికవే సాటి. ప్రపంచాన్ని అబ్బురపరిచే తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రాంతాలివిగో..

భాగ్యనగరం హైదరాబాద్: భారత దేశ పటంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. రాజకీయ,సామాజిక, ఆర్థిక, పర్యాటకం..ఇలా ఎన్నికోణాల్లో చూసినా హైదరాబాదుకు సాటిరాదేది. ఇంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ నగరంలో పర్యాటక ప్రాంతాలు అనేకం..

పర్యాటక ప్రదేశాలు: గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ భవనం, చౌమొహల్లా ప్యాలెస్, కింగ్‌కోఠి, పురానీ హవేలీ, ఫలక్‌నుమా ప్యాలెస్ కట్టడాలు చరిత్రకు సజీవసాక్ష్యాలు. ఇండో- అరబిక్- పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు ప్రతీకలు. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణశైలి వీటి సొంతం. మక్కా మసీదు, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండుగలకు ప్రధాన ఆకర్షణ. హుస్సేన్‌సాగర్, బుద్ధవిగ్రహం, ట్యాంక్‌బాండ్, బిర్లా మందిర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు హైదరాబాద్ సొంతం.

నల్లగొండ : పర్యాటక ప్రదేశాలు : నాగార్జున సాగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్నది. చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ కాలువల జలాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు వాడపల్లి, ఛాయా సోమేశ్వర దేవాలయం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను హెరిటేజ్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.

 యాదాద్రి భువన గిరి: కొలనుపాక జైనదేవాలయం, ఏకశిలపై వెయ్యేండ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. భువనగరి కొండ రాక్ క్లయింబింగ్‌కు అనుకూలం. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం. పోచంపల్లి చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. తెలంగాణ పర్యాటక శాఖ యాదాద్రి భువనగిరి కోట మీదకు కేబుల్ కారు ఏర్పాటు చేయనుంది.  

వరంగల్: తెలంగాణ ప్రజలు కొలిచి మొక్కే భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక వేయి స్తంభాలగుడి, ఖిల్లా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలంనాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలోఉన్నా యి.

సిరిసిల్ల: చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే. ఈ ప్రాంతం మరనేత, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు అనేకం. దక్షిణ కాశీ క్షేత్రంగా, కోడె మొక్కుల దేవుడిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఎగువ మానేరు జలాశయం కూడా ఇక్కడే ఉంది. సిరిసిల్ల చేనేత పరిశ్రమ, వేములవాడ, నాంపల్లి గుట్ట మొదలైనవి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.  

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన  భద్రాద్రి దేవాలయం, పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అభయారణ్యం ఏర్పాటుకు అనుకూలం. కిన్నెరసానిలో హరిత రెస్టారెంట్, ఎకో పార్క్, గెస్ట్ హౌజ్ ఏర్పాటు కానున్నాయి.  

నిజామాబాద్ శ్రీరాం సాగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పుట్టినిల్లు నిజామాబాద్.  బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. వీటితోపాటు బ్రిటీష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్య కళాశాల చూడదగ్గ ప్రాంతాలు.

ఆదివాసుల ఆదిలాబాద్: ప్రకృతికి పర్యాయపదంగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో పొచ్చర, గాయత్రి, కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడి ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఇంద్రవెల్లి మండలంలో ఉంది. చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతీ దేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగి ఉన్న అద్భుతమైన జిల్లా ఇది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్‌లకు పెట్టింది పేరు. ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారంటారు.400 ఏండ్ల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయన పేరుపై వెలిసిందే నిర్మల్. బాసర సరస్వతి దేవాలయం, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్ బ్యారేజీ తదితర ప్రాజెక్టులు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు పర్యాటక ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. నిర్మల్లోని పొచ్చెర, కుంతాల, కడెం జలపాతాలు, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ అడవిలో వైల్డ్‌లైఫ్ టూరిజం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తున్నది.


logo